Cyclone Arnab Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. ఇవాళ అర్ధరాత్రికి తీవ్ర తుపాన్, రేపు అతి తీవ్ర తుపాన్‌గా బలపడే అవకాశం..
Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు.. అక్టోబర్ 27 నుంచి ఏపీలో భారీ వర్షాలు...
Cyclone Arnab Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వేగంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఇది రానున్న 24 గంటల్లో ‘ఆర్నబ్’ తుపానుగా (Cyclone Arnab) బలపడి, ఆ తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చి ‘అతి తీవ్ర తుపాను’గా (Very Severe Cyclonic Storm) మారే ప్రమాదముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ నెల 28వ తేదీన విశాఖపట్నం , మచిలీపట్నం మధ్య, ముఖ్యంగా కాకినాడకు సమీపంలోని యానాం వద్ద ఈ తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాల బీభత్సం తప్పదని అధికారులు స్పష్టం చేశారు.
గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు
సోమవారం ఉదయం నుంచే కోస్తా తీర ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత గణనీయంగా పెరగనుంది. ప్రారంభంలో గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచే ఈ గాలులు, తుపాను తీవ్రత పెరిగేకొద్దీ మంగళవారానికి ఏకంగా గంటకు 140 కిలోమీటర్ల సంచలన వేగానికి చేరుకుంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో సముద్రంలో రాకాసి అలలు 1.5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, యానాం తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఉమ్మడి కోస్తా జిల్లాలకు ‘ఆరంజ్ అలర్ట్’ జారీ
ఈ అతి తీవ్ర తుపాను ధాటికి శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు ఉమ్మడి కోస్తా జిల్లాలన్నీ జలమయం కానున్నాయి. ముఖ్యంగా ఈ నెల 27 , 28 తేదీల్లో కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పలుచోట్ల కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కోస్తా జిల్లాలన్నింటికీ భారత వాతావరణ శాఖ ‘ఆరంజ్ అలర్ట్’ ప్రకటించింది.
పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరికలు – మత్స్యకారులకు నిషేధం
తీరం వెంబడి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం తదితర అన్ని ప్రధాన పోర్టుల్లో 1వ నంబరు ప్రమాద హెచ్చరిక సూచికలను ఎగురవేశారు. ఈ నెల 29వ తేదీ వరకు సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా ఉంటుందని, అలల ఉద్ధృతి అసాధారణంగా ఉంటుందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే ఒడ్డుకు తిరిగి రావాలని, కొత్తగా ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులను తరలించేందుకు, నిత్యావసరాలు సిద్ధం చేసేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే ముందస్తు సహాయక చర్యల్లో నిమగ్నమైంది.