Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

Hug Gone Wrong: భార్యను గట్టిగా కౌగిలించుకున్న భర్త.. విరిగిన ఐదు పక్కటెముకలు.. చైనాలో విచిత్ర ఘటనపై వైద్యులు ఏమన్నారంటే..

jagan 22 Oct 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Hug Gone Wrong: భార్యను గట్టిగా కౌగిలించుకున్న భర్త.. విరిగిన ఐదు పక్కటెముకలు.. చైనాలో విచిత్ర ఘటనపై వైద్యులు ఏమన్నారంటే..

Hug Gone Wrong

Hug Gone Wrong: భర్త చూపించిన అతి ప్రేమ ఒక మహిళను ఆసుపత్రి పాలయ్యేలా చేసిన విచిత్రమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. భర్త ప్రేమతో గట్టిగా కౌగిలించుకోవడంతో (హగ్ చేసుకోవడం) ఒక మహిళకు ఏకంగా ఐదు పక్కటెముకలు విరిగిపోగా, మరొక ఎముక పగిలిపోయింది. ఈ వింత సంఘటనకు సంబంధించిన కథనం , వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో ఈ వివరాలు బయటకు వచ్చాయి.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్‌కు చెందిన వాంగ్ అనే వ్యక్తి, తన భార్య చలిగా ఉందనడంతో ఆమెపై ఉన్న ప్రేమతో దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో ఆమె శరీరం నుంచి అకస్మాత్తుగా ‘టక్’ మనే శబ్దం రావడం, వెంటనే ఆమెకు గుండె, పక్కటెముకల భాగంలో తీవ్రమైన నొప్పి మొదలవడం వెంటవెంటనే జరిగిపోయాయి. పరిస్థితి తీవ్రతను గ్రహించి ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహించగా, ఏకంగా ఐదు పక్కటెముకలు విరిగిపోయాయని, మరొకటి పగిలిందని నిర్ధారించడంతో దంపతులిద్దరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. తాను కేవలం సాధారణ శక్తితోనే ప్రేమగా కౌగిలించుకున్నానని, ఇంత చిన్న విషయానికి ఇలా ఎముకలు విరిగిపోతాయని అస్సలు ఊహించలేదని భర్త వాంగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

కేవలం కౌగిలించుకోవడానికే ఎముకలు విరిగిపోవడానికి అసలు కారణం ఆ మహిళకు ఉన్న ‘ఆస్టియోపొరోసిస్’ (Osteoporosis) అనే తీవ్రమైన ఎముకల బలహీనత సమస్యేనని వైద్యులు స్పష్టం చేశారు. తన భార్య శరీర బరువు కేవలం 45 నుంచి 50 కిలోలు మాత్రమే ఉంటుందని భర్త వివరించారు. బరువు తగ్గడం కోసం ఆమె క్రమం తప్పకుండా రాత్రి భోజనాన్ని మానేయడం (డైటింగ్), ప్రతిరోజూ అధికంగా కాఫీ తాగడం , సూర్యరశ్మి (ఎండ) తగలకపోవడం వంటి జీవనశైలి అలవాట్ల వల్ల ఆమె శరీరంలో డి-విటమిన్, క్యాల్షియం లోపించి ఎముకలు గుల్లబారి, అత్యంత దయనీయంగా బలహీనపడ్డాయని వైద్యులు తేల్చారు.

ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలతో ఎముకలు బలహీనంగా ఉన్నవారిని అకస్మాత్తుగా గట్టిగా కౌగిలించుకుని పైకి ఎత్తినప్పుడు లేదా ఒత్తిడి తెచ్చినప్పుడు పక్కటెముకలపై తీవ్రమైన భారం పడి విరిగిపోయే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళకు ఎముకలు నయమయ్యేందుకు అవసరమైన మందులు, పెయిన్ రిలీఫ్ ఆయింట్‌మెంట్లు ఇచ్చి పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. శస్త్రచికిత్స (సర్జరీ) చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.