Skip to content
తెలంగాణ › వార్తలు

ప్రకృతి విపత్తుపై రాజకీయ బురదజల్లుడేంది?

Prajapaksham 22 Oct 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
ప్రకృతి విపత్తుపై రాజకీయ బురదజల్లుడేంది?

brs vs congress

వెంకగారి భూమయ్య

ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు పాలకుల పరిణతి, ప్రతిపక్షాల స్పందన ఒక సమాజం ప్రజాస్వామ్య దృక్పథాన్ని, బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతాయి. ప్రస్తుతం తెలంగాణ సమాజం తీవ్రమైన వర్షాభావం, ఊహించని ఎల్‌నినో వాతావరణ పరిణామాల వల్ల భయంకరమైన నీటి ఎద్దడి, విద్యుత్‌ కొరత ఎదుర్కొనే ప్రమాదంలో పడింది. ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు, ప్రపంచ శాస్త్రవేత్తల పరిశోధనలు వందకు పైగా దేశాల్లో ఎల్‌నినో ముప్పు తీవ్రంగా ఉండబోతోందని తేల్చి
చెప్పాయి. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు ఎండల తీవ్రతకు, నీటి కొరతకు అల్లాడుతున్నాయి. ఇటువంటి తరుణంలో, ఇది కేవలం ప్రకృతి సృష్టించిన గ్లోబల్‌ వైపరీత్యమని తెలిసీ, తెలంగాణ లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులకు ప్రభుత్వంపై నెపం నెడుతూ బిఆర్‌ఎస్‌, టిఆర్‌ఎస్‌, బిజెపి నాయకులు ‘కాంగ్రెస్‌ తెచ్చిన కరువు’ అని విషప్రచారం చేయ డం అత్యంత హేయమైన, బాధ్యతారాహిత్యమైన రాజకీయ దిగజారుడుతనానికి ప్రత్యక్ష నిదర్శనం. ఎల్‌నినో అనేది మానవుల చేతుల్లో లేని అంతర్జాతీయ పర్యావరణ వ్యవస్థ మార్పు. పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడతాయి. గతేడాది ఇదే సమయానికి తెలంగాణ రిజర్వాయర్లలో 462 టిఎంసిల నీరు అందుబాటులో ఉంటే, ఈ రోజు అది 200 టిఎంసిలకు పడిపోవడం ఎవరి వైఫల్యం? మానవ ప్రమేయం లేకుండా వానలు పడకపోవడం ప్రకృతి శాపం కాదా? అలాగే, రాష్ట్రావిర్భావం నాటి కంటే విద్యుత్‌ డిమాండ్‌ ఏకంగా 20,000 మెగావాట్లకు చేరడం, చలికాలం ప్రారంభంలోనే మార్చి నెలను తలపించేలా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం వంటి అంశా లు శాస్త్రీయంగా నగ్న సత్యాలు. ఈ క్రమంలో, పరిస్థితి తీవ్రతను గ్రహించి ప్రజలను ముందే అప్రమత్తం చేయడం పాలకుడి బాధ్యత. ముఖ్యమంత్రి ఆ ధైర్యంచేసి, దాచకుండా నిజాన్ని ప్రజల ముందు ఉంచారు.
ప్రభుత్వం సంక్షోభ నివారణకు ప్రణాళికాబద్ధమైన చర్యలు ప్రారంభించింది. అందుబాటులో ఉన్న నీటిని సాగు కంటే తాగునీటికే మొదటి ప్రాధాన్యతగా కేటాయించడం, రాబోయే 8 నుండి 10 నెలలు పొదుపు చర్యలు పాటించాలని కోరడం బాధ్యతాయుతమైన ముందస్తు ఆలోచన. ఎండాకాలం వరి పంటలు వేసి నీరు అందక పెట్టుబడు లు కోల్పోయి, మోటార్లు కాలిపోయే దయనీయ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఒక సీజన్‌ వాయి దా వేసుకోవాలని, ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని కోరడంలో రైతు సంక్షేమం కాక మరేముంది? దీనిని ‘కరువు’గా చిత్రీకరిస్తూ రైతులను రెచ్చగొట్టడం ద్వారా ప్రతిపక్షం ఏం సాధించాలనుకుంటోంది? రైతును ఆదుకోవడానికి ఎంత మూల్యమైనా చెల్లించి బహిరంగ మార్కెట్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేస్తామని స్పష్టం చేస్తున్నప్పుడు అభినందించాల్సింది పోయి, శవ రాజకీయాలు చేయడం పైశాచికం కాదా?
సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. 2.5 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించడం, పశుగ్రాసం అభయారణ్య నిల్వలు పెంచడం, తాగునీటి సరఫరాను 24 వేల గ్రామాలకు సజావుగా అందించడం, వైద్య ఆరోగ్య శాఖను అత్యవసరంగా సన్నద్ధం చేయడం ద్వారా ఒక సమగ్ర విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసింది. వీటికితోడు ప్రత్యేక వార్‌ రూమ్‌, టోల్‌ ఫ్రీ నంబర్‌, సీనియర్‌ అధికారి తో నోడల్‌ ఆఫీస్‌ పర్యవేక్షణ, సబ్‌ కమిటీ ఏర్పాటు వంటివి యంత్రాంగం యొక్క పారదర్శకతను నిరూపిస్తున్నాయి. అంతేగాక, రాజకీయాన్ని పక్కనబెట్టి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, నవంబర్‌ మొదటి వారంలో ప్రతిపక్షాల ప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసి కేంద్ర విపత్తు నిధులు, అదనపు విద్యుత్‌ పూల్‌ సాధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, పౌరసమాజం ఏకతాటిపైకి వచ్చి ప్రకృతి విపత్తుపై పోరాడాలని పిలుపునిచ్చినప్పు డు, దానిని ఆసరాగా చేసుకుని విషం చిమ్మడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే.
కరువు లేదా నీటి ఎద్దడి అనేది శాస్త్రీయ కారణాల వల్ల సంభవించే వైపరీత్యం. అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న ఎల్‌నినో పరిస్థితులను ‘కాంగ్రెస్‌ తెచ్చిన కరువు’ అని వ్యాఖ్యానించడం బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌, ఆయన అనుయాయుల అజ్ఞానానికి, తీవ్ర అసహనానికి నిదర్శనం. అధికారం కోల్పోయిన ఆక్రోశంతో ప్రజలను భయాందోళనలకు గురిచేయడం, భ్రమలు కల్పించి రైతాంగాన్ని నష్టాల్లోకి నెట్టాలని చూసే కుట్రలు తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర కేవలం నిందించడం కాదు; ఆపదలో ఉన్న ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడం, ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయడం కూడా. కష్టకాలంలో రైతుల ను రెచ్చగొట్టి పెట్టుబడులు నష్టపోయేలా చేయడం శ్రేయస్కరం కాదు. ప్రతిపక్షాలు తమ సంకుచిత రాజకీయ స్వార్థాన్ని, బురదజల్లే నైజాన్ని పక్కనబెట్టి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఇది రాజకీ యం చేసే సమయం కాదు, ప్రజా రక్షణకు భుజం భుజం కలిపి నిలబడాల్సిన సమయం! ఇప్పటికైనా అబద్ధాల ప్రచారాన్ని కట్టిపెట్టి, ఎల్‌నినో విపత్తును జయించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణలో ప్రతిపక్షాలు భాగస్వామ్యమవ్వాలి!