Skip to content
తెలంగాణ › వార్తలు

Hyderabad Borewell Ban: హైదరాబాద్‌లో కొత్త బోర్లకు బ్రేక్.. ఉల్లంఘిస్తే వాల్టా చట్టం కింద భారీ జరిమానాలు..

jagan 22 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Hyderabad Borewell Ban: హైదరాబాద్‌లో కొత్త బోర్లకు బ్రేక్.. ఉల్లంఘిస్తే వాల్టా చట్టం కింద భారీ జరిమానాలు..

Water

Hyderabad Borewell Ban: తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జల మట్టాలు వేగంగా అడుగంటిపోతుండటంతో నీటి కరువు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నగర పరిధిలోని పలు అపార్ట్‌మెంట్లలో ఇప్పటికే బోర్లు ఎండిపోయి మొరాయిస్తుండటంతో రాబోయే ఎనిమిది నెలల కాలాన్ని అత్యంత కీలకమైనదిగా అధికారులు గుర్తించారు. వచ్చే వర్షాకాలం వరకు నీటి అవసరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. నీటి వృథా అరికట్టడంతో పాటు కొత్త బోర్ల తవ్వకాలపై తక్షణ నిషేధం విధిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంది. అంతేకాకుండా, నిర్మాణ రంగానికి తాగునీటిని కాకుండా శుద్ధి చేసిన నీటిని (రెస్క్యూ/ట్రీటెడ్ వాటర్) వినియోగించడాన్ని తప్పనిసరి చేశారు. ఈ నూతన ఆంక్షలు కేవలం తాగునీటికే కాక వాణిజ్య, నిర్మాణ రంగానికి సైతం వర్తిస్తాయని స్పష్టం చేశారు.

అధికారిక అంచనాల ప్రకారం నగర పరిధిలో సుమారు 13 లక్షల నుంచి 15 లక్షలకు పైగా బోర్లు ఉన్నప్పటికీ, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం కేవలం 2.43 లక్షల బోర్లు మాత్రమే నమోదై ఉన్నాయి. నిబంధనలను బొందపెట్టి రోజుకు సగటున 200కు పైగా కొత్త బోర్ల తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. అదే సమయంలో భూగర్భ జలాలు అడుగంటి రోజుకు దాదాపు 100 బోర్లు ఎండిపోతున్నాయి. కొండాపూర్, బంజారాహిల్స్, బండ్లగూడ జాగీర్ వంటి కీలక ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ వాసులు ప్రభుత్వం విధించిన 400 అడుగుల పరిమితిని ఏమాత్రం పట్టించుకోకుండా, 500 నుంచి ఏకంగా 1,500 అడుగుల లోతు వరకు బోర్లు తవ్వుతున్నారు. ఫలితంగా భూగర్భ జలాల తోడకం ఏకంగా 102 శాతానికి చేరుకోవడంతో.. నేలలోకి చేరే నీటి కంటే తోడేస్తున్న నీరే ఎక్కువగా మారి భూగర్భ జల లభ్యత అత్యంత ‘క్రిటికల్’ స్థితికి చేరిందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

ఈ తీవ్ర సంక్షోభాన్ని అరికట్టేందుకు భూగర్భ జల పరిరక్షణ చట్టం ‘వాల్టా’ (WALTA – నీరు-భూమి-చెట్టు చట్టం) ను క్షేత్రస్థాయిలో అత్యంత పకడ్బందీగా అమలు చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇకపై సొంత స్థలంలో బోరు వేసుకోవాలన్నా రెవెన్యూ శాఖ నుంచి ముందస్తు అనుమతి పొందుట తప్పనిసరి. నిబంధనలను ఉల్లంఘించి పరిమితికి మించి బోర్లు తవ్వినా, అనుమతి లేకుండా తవ్వకాలు జరిపినా తహసీల్దార్లు, భూగర్భ జల శాఖ అధికారులు ఉమ్మడిగా క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టనున్నారు. ఉల్లంఘనులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రూ.5,000 నుంచి రూ.1,00,000 వరకు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.