Skip to content
తెలంగాణ › వార్తలు

Ramanthapur Pedda Cheruvu: హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా దూకుడు.. రామంతాపూర్ పెద్ద చెరువులో ఆక్రమణల తొలగింపు..

jagan 31 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Ramanthapur Pedda Cheruvu: హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా దూకుడు.. రామంతాపూర్ పెద్ద చెరువులో ఆక్రమణల తొలగింపు..

Hydra: హైదరాబాద్‌లో అక్రమ నీటి దందాపై హైడ్రా దాడులు.. 10కి పైగా బోర్ కనెక్షన్లు తొలగింపు..

Ramanthapur Pedda Cheruvu: హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో ఉన్న పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) పరిధిలోని ఆక్రమణలను తొలగించి, చెరువు స్థలాన్ని కాపాడే చర్యల్లో భాగంగా ‘హైడ్రా’ (HYDRAA) అధికారులు శరవేగంగా కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలో ఎఫ్‌టీఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఒక భారీ షెడ్డును అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు.

తమ ఆస్తులను కూల్చివేయడం పట్ల బాధితులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 40 ఏళ్లుగా తాము క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని, గత మూడు రోజులుగా సర్వేలు చేసి హఠాత్తుగా కూల్చివేతలకు దిగడంతో తాము హైకోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు. మొదట చెరువు ఎఫ్‌టీఎల్ హద్దులను పక్కాగా స్పష్టంగా నిర్ణయించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరోవైపు, చెరువులు , ప్రభుత్వ స్థలాల్లో భవన నిర్మాణాలకు ఒకవైపు అనుమతులు ఇవ్వడం, ఆపై వాటిని క్రమబద్ధీకరించడం (LRS) చేసి, ఇప్పుడు మళ్లీ అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేయాలని కోరడమేమిటని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులపై తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. నిర్మాణ అనుమతులు , కూల్చివేతల విషయంలో జీహెచ్‌ఎంసీ అవలంబిస్తున్న పరస్పర విరుద్ధ వైఖరిని ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. మల్కాజిగిరి మున్సిపాలిటీ పరిధిలోని డిఫెన్స్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ స్థలాల్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలను సవాల్ చేస్తూ నర్సింహారెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు, సొసైటీకి చెందిన 6,039 చదరపు గజాల స్థలంలో జీహెచ్‌ఎంసీ అక్రమంగా డంపింగ్ యార్డ్ నిర్మించి వాహనాలు పార్క్ చేస్తోందంటూ వేసిన పిటిషన్లపై జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ విచారణ చేపట్టారు.

విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బాధిత స్థలాలకు జీహెచ్‌ఎంసీ నుంచి అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయని, ప్రామాణిక లేఅవుట్లు కూడా క్రమబద్ధీకరించబడ్డాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, ఒకసారి లేఅవుట్లను మీరే క్రమబద్ధీకరించిన తర్వాత, మళ్లీ అందులోని ప్రజా వినియోగ స్థలాలను కాపాడాలంటూ రెవెన్యూ, హైడ్రా శాఖలకు జీహెచ్‌ఎంసీ లేఖలు రాయడం ఏంటని తీవ్రంగా ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ తన సొంత స్థలాల్లో ఉన్న నిర్మాణాలను తొలగించకుండా రెవెన్యూ శాఖను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఈ వ్యవహారంలో సమగ్ర వివరణతో కౌంటర్లు దాఖలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ , హైడ్రాలకు చివరి అవకాశంగా మూడు వారాల వ్యవధి ఇస్తూ ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.