Global Health Emergency: ఎండలు, కరువు, అంటువ్యాధులు.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీపై లాన్సెట్ కౌంట్‌డౌన్ 2026 నివేదికలో ఆందోళనకర విషయాలు..
Climate Change and El Niño: రుతుపవనాలకు మళ్లీ బ్రేక్.. జూలై 10 నుంచి వర్షాలు తగ్గుముఖం.. తెలంగాణలో పెరగనున్న ఎండలు..
Global Health Emergency: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అదుపుతప్పుతున్న కర్బన ఉద్గారాలు మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రముఖ వైద్య పరిశోధనా పత్రిక ‘లాన్సెట్’ వెల్లడించింది. పారిస్ వాతావరణ ఒప్పందం అమల్లోకి వచ్చి పదేళ్లు పూర్తవుతున్నా, కాలుష్య నియంత్రణలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ‘లాన్సెట్ కౌంట్‌డౌన్ 2026’ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పులు పర్యావరణ సమస్యగానే కాకుండా ప్రపంచ ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారాయని నిపుణులు హెచ్చరించారు.
గత 11 సంవత్సరాలు రికార్డు స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైన కాలంగా నిలిచాయని నివేదిక పేర్కొంది. పెరుగుతున్న వేడి కారణంగా ప్రాణనష్టం, ఉపాధి కోల్పోవడం, అంటువ్యాధుల వ్యాప్తి, ఆహార కొరత వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని వివరించింది. ఈ పరిణామాలను ఎదుర్కోవడానికి దేశాలన్నీ సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించింది.
ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వేడిమి ప్రభావం కార్మికుల ఆరోగ్యంతోపాటు వారి ఆదాయంపైనా పడుతోంది. ముఖ్యంగా వ్యవసాయం, నిర్మాణ రంగం, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
2025లో ఎండల తీవ్రత కారణంగా ప్రపంచవ్యాప్తంగా 573 బిలియన్ పని గంటలు కోల్పోయినట్లు నివేదిక అంచనా వేసింది. దీనివల్ల కార్మికుల ఆదాయానికి సుమారు 1.07 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఈ నష్టంలో వ్యవసాయ రంగం వాటా 37.8 శాతంగా ఉండటం గమనార్హం.
2016 నుంచి 2023 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 5.4 లక్షల మరణాలు అధిక ఉష్ణోగ్రతలతో సంబంధం కలిగి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. వీటిలో 68.4 శాతం మరణాలకు మానవ కార్యకలాపాల కారణంగా చోటుచేసుకున్న వాతావరణ మార్పులు దోహదపడ్డాయని పేర్కొంది. 2023లో ఒక్క ఏడాదిలోనే ఎండల కారణంగా సుమారు 7.10 లక్షల మంది మరణించినట్లు నివేదికలో ప్రస్తావించింది.
వేడి పెరగడం వల్ల దోమల వ్యాప్తికి అనుకూల పరిస్థితులు ఏర్పడి, డెంగ్యూ వంటి వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతోంది. డెంగ్యూ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు 31 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తీర ప్రాంతాల్లో ‘విబ్రియో’ బ్యాక్టీరియాతో సంబంధం ఉన్న ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా విస్తరిస్తోందని హెచ్చరించింది.
మరోవైపు, కరువులు, వడగాలుల ప్రభావం ఆహార ఉత్పత్తిపైనా పడుతోంది. 2024లో వాతావరణ సంబంధిత పరిణామాల కారణంగా అదనంగా 12.79 కోట్ల మంది తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొన్నట్లు నివేదిక పేర్కొంది.
వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి భారీగా నిధులు అవసరమవుతున్నప్పటికీ, అంతర్జాతీయంగా అందుతున్న సహాయం సరిపోవడం లేదని నివేదిక స్పష్టం చేసింది.
వాతావరణ మార్పుల ఆరోగ్య ప్రభావాలను ఎదుర్కోవడానికి 48 అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏటా కనీసం 330 కోట్ల డాలర్ల నిధులు అవసరమని అంచనా వేయగా, 2024లో అంతర్జాతీయంగా సమీకరించిన నిధులు 110 కోట్ల డాలర్లకే పరిమితమయ్యాయని తెలిపింది.
వాతావరణం, ఆరోగ్యానికి సంబంధించిన పరిశోధనలకు కేటాయించే గ్రాంట్లు 2016లో 4.2 కోట్ల డాలర్ల నుంచి 2024 నాటికి 31.6 కోట్ల డాలర్లకు పెరిగాయి. అయితే, ఈ నిధుల పంపిణీలో తీవ్ర అసమానతలు ఉన్నాయని నివేదిక పేర్కొంది.
మొత్తం పరిశోధన నిధుల్లో 88 శాతం సంపన్న దేశాలకు చెందిన పరిశోధకులకు అందగా, వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్న పేద దేశాల పరిశోధకులకు కేవలం 1 శాతం మాత్రమే లభించినట్లు వెల్లడించింది. అవసరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు తగిన స్థాయిలో ఆర్థిక సహాయం అందకపోవడం ఆందోళనకరమని నిపుణులు అభిప్రాయపడ్డారు.
వాతావరణ మార్పుల ప్రభావం భారత్‌లోనూ తీవ్రంగా కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, వ్యవసాయ కూలీలు, రోజువారీ ఉపాధిపై ఆధారపడే ప్రజలు అధిక ఉష్ణోగ్రతల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మధ్యస్థ మానవ అభివృద్ధి సూచిక (HDI) కలిగిన దేశాల విభాగంలో భారత్‌లో వేడి ఒత్తిడికి గురయ్యే సమయం అత్యధికంగా నమోదైనట్లు నివేదిక తెలిపింది. భారతీయులు ఏడాదికి సగటున 2,430 గంటలపాటు వేడి ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు ఉన్నట్లు పేర్కొంది.
అధిక ఉష్ణోగ్రతలు, వాయు కాలుష్యం కలిసినప్పుడు ప్రజారోగ్యంపై ప్రభావం మరింత తీవ్రమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని పది ప్రధాన నగరాల్లో నమోదైన సుమారు 36 లక్షల మరణాలపై జరిగిన విశ్లేషణను నివేదిక ప్రస్తావించింది. ఉష్ణోగ్రతల పెరుగుదల నేపథ్యంలో ప్రమాదకరమైన పీఎం 2.5 (PM2.5) కాలుష్యంతో సంబంధం ఉన్న మరణాల ముప్పు భవిష్యత్తులో ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడం, వేడి ప్రభావాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం, ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించడం అత్యవసరమని నివేదిక సూచించింది. తీవ్రమైన ఎండల కారణంగా పని గంటలు తగ్గడం, ఉత్పాదకత దెబ్బతినడం వల్ల భారత్‌లో కార్మికుల ఆదాయంపై కూడా ప్రభావం పడుతోంది.
2016 నుంచి 2025 మధ్య కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శ్రామిక ఆదాయ నష్టం ఎదుర్కొన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచినట్లు నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో చైనా, అమెరికా తర్వాత భారత్ ఉందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన శ్రామిక ఆదాయ నష్టంలో భారత్ వాటా 12.4 శాతంగా ఉన్నట్లు తెలిపింది.
ముఖ్యంగా వ్యవసాయం, నిర్మాణ రంగం, రవాణా, ఇతర బహిరంగ పనుల్లో నిమగ్నమయ్యే కార్మికులు అధిక వేడి కారణంగా ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ పని గంటలను తగ్గించాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో పాటు ఆరోగ్యపరమైన ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి.
వాతావరణ మార్పులను తీవ్రతరం చేస్తున్న బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ‘లాన్సెట్’ నివేదిక మరోసారి నొక్కిచెప్పింది. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అనేక దేశాలు ఇప్పటికీ శిలాజ ఇంధనాలకు భారీగా ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని నివేదిక పేర్కొంది. 2024లో రష్యా, ఇరాన్, చైనా, భారత్ సహా పలు దేశాలు 5,000 కోట్ల డాలర్లకు పైగా శిలాజ ఇంధన సబ్సిడీలు అందిస్తున్న దేశాల జాబితాలో ఉన్నట్లు వెల్లడించింది.
ఈ పరిస్థితుల్లో స్వచ్ఛమైన ఇంధన వనరుల వినియోగాన్ని వేగవంతం చేయాలని, కాలుష్యాన్ని తగ్గించే విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నివేదిక సూచించింది. అదే సమయంలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని ముందుగానే గుర్తించే ఆరోగ్య హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయాలని పేర్కొంది.
వాతావరణ మార్పుల ప్రభావం భవిష్యత్తులో మాత్రమే కనిపించే సమస్య కాదని, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం, ఉపాధి, ఆహార భద్రతపై ప్రభావం చూపుతోందని ‘లాన్సెట్ కౌంట్‌డౌన్ 2026’ నివేదిక హెచ్చరించింది.
ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం, ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి చర్యలను ప్రభుత్వాలు అత్యవసరంగా చేపట్టాలని సూచించింది.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ఆర్థిక, సాంకేతిక సహాయం అందించడం కూడా కీలకమని స్పష్టం చేసింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఇప్పుడే సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.