Israel Election Results: ఇజ్రాయెల్ ఎన్నికల తుది ఫలితాలు ఇవే.. హంగ్ దిశగా రాజకీయాలు.. ఏ పార్టీకి రాని 61 సీట్ల పూర్తి మెజారిటీ..
Israel Election Results
Israel Election Results: ఇజ్రాయెల్ పార్లమెంట్ (కెనెసెట్) ఎన్నికల తుది ఫలితాలు వెలువడటంతో దేశ రాజకీయాల్లో తీవ్ర అనిశ్చితి, స్పష్టమైన హంగ్ వాతావరణం నెలకొంది. మొత్తం 120 స్థానాలకు గాను గురు, శుక్రవారాల్లో ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 61 సీట్ల మేజిక్ ఫిగర్‌ను ఏ ఒక్క పార్టీ గానీ, కూటమి గానీ దాటలేకపోయాయి.
ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని అధికారిక రైట్ వింగ్ కూటమి 53 స్థానాలు సాధించగా, అందులో ఆయన సొంత ‘లికుడ్’ (Likud) పార్టీ 27 సీట్లు గెలుచుకుని అతిపెద్ద ఏకైక పార్టీగా నిలిచింది. ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష కూటమి 48 సీట్లు సాధించగా, అనూహ్య రీతిలో అరబ్ పార్టీలు 19 సీట్లను దక్కించుకుని చక్రం తిప్పే స్థాయికి చేరుకున్నాయి.
మిలిటరీ సైనికులు, రిజర్వు బలగాలు, దౌత్యవేత్తలు, ఆసుపత్రుల్లోని రోగులు, వైద్యులు , ఖైదీలు ఓటు వేసిన ‘డబుల్ ఎన్వలప్ బ్యాలెట్ల’ (రహస్య ఓట్లు) లెక్కింపు పూర్తయిన తర్వాత నెతన్యాహు కూటమికి బలం పెరుగుతుందని విశ్లేషకులు భావించారు. అయితే ఈ తుది ఓట్ల లెక్కింపు పూర్తి అయినప్పటికీ స్థానాల పంపకంలో ఎలాంటి మార్పులు రాకపోవడంతో నెతన్యాహు కూటమి 53 స్థానాల వద్దే ఆగిపోయింది.
ఫలితంగా, కేవలం 19 సీట్లు ఉన్న అరబ్ పార్టీలతో కలవడానికి అటు నెతన్యాహు నేతృత్వంలోని రైట్ వింగ్, ఇటు ప్రతిపక్ష లెఫ్ట్ వింగ్ కూటములు సుముఖంగా లేకపోవడంతో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అధికార, ప్రతిపక్షాల మధ్య జాతీయ ఐక్యత ప్రభుత్వం (National Unity Government) ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు ఎన్నికల ఫలితాలపై ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల సరళిలో విదేశీ శక్తులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నాయని, ఇది దేశ ప్రజాస్వామ్యానికి ‘భూకంపం’ వంటి పెద్ద విపత్తు అని అభివర్ణించారు.
అరబ్ ఓటర్ల రికార్డు స్థాయి పోలింగ్ వెనుక విదేశీ నిధులు , అక్రమాలు ఉన్నాయని ఆరోపిస్తూ, దేశ అంతర్గత భద్రతా విభాగం షిన్ బెట్ (Shin Bet) , పోలీసులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దేశాన్ని ఇస్లామీకరణ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించిన నెతన్యాహు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అరబ్ పార్టీల మద్దతు తీసుకోబోమని స్పష్టం చేశారు.