Strait of Hormuz Attack: హార్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్‌పై లింపెట్ మైన్స్ దాడి.. 27 మంది భారతీయ నావికులు సురక్షితం
Strait of Hormuz Attack:
Strait of Hormuz Attack: వ్యూహాత్మకంగా కీలకమైన పశ్చిమాసియా జలమార్గం హర్మూజ్ జలసంధిలో (Strait of Hormuz) 27 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న పనామా జెండాతో కూడిన ‘ఎంటీ లూయిస్-1’ (MT LOUISE 1) అనే ఆయిల్ ట్యాంకర్‌పై లింపెట్ మైన్స్‌తో దాడి జరిగింది. ఈ అనూహ్య దాడి ధాటికి నౌక ఇంజిన్ రూమ్‌లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగి ప్రయాణం తాత్కాలికంగా స్తంభించినప్పటికీ, నౌకలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. ఒమన్ తీరానికి సమీపంలో సంభవించిన ఈ ఘటన అంతర్జాతీయ వాణిజ్య నౌకల భద్రతపై మళ్లీ తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
ఒమన్ తీరానికి సుమారు 25 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న సమయంలో చిన్న పడవల్లో వచ్చిన అపరిచిత దుండగులు నౌక కింది భాగంలో రెండు అయస్కాంత తీవ్రత కలిగిన లింపెట్ మైన్లను (Limpet Mines) అంటించి పేలుళ్లకు పాల్పడ్డారు. పేలుడు ధాటికి ఇంజిన్ విభాగానికి మంటలు వ్యాపించిన వెంటనే నౌకలోని భారతీయ సిబ్బంది అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి సకాలంలో మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం నౌక తన ప్రయాణాన్ని పునరుద్ధరించింది. ఈ ప్రమాదం వల్ల సముద్రంలో ఎలాంటి చమురు లీకేజీ లేదా పర్యావరణ నష్టం వాటిల్లలేదని బ్రిటన్ నౌకాదళ పర్యవేక్షణ సంస్థ యూకే మేరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) స్పష్టం చేసింది.
ఈ ఘటనపై కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ స్పందిస్తూ, ఎంటీ లూయిస్-1 నౌకలోని 27 మంది భారతీయ సీఫేరర్లు క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. దీనికి ఒకరోజు ముందు, అంటే అక్టోబర్ 29న ఇదే హర్మూజ్ జలసంధిలో ‘ఎంటీ అర్జానా’ (MT Arjana) అనే మరో వాణిజ్య నౌకపై కూడా దాడి జరిగిందని, అందులో ఉన్న ఇద్దరు భారతీయులు కూడా క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ రెండు వరుస ఘటనల్లో కలిపి మొత్తం 29 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని, షిప్ మేనేజ్మెంట్ కంపెనీలు , అంతర్జాతీయ రక్షణ ఏజెన్సీలతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేసుకుంటూ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
లింపెట్ మైన్స్ అంటే చిన్న పడవల ద్వారా వచ్చి నౌకల లోహపు బాడీకి అయస్కాంత శక్తితో అతుక్కునేలా చేసి పేల్చే ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు. పర్షియన్ గల్ఫ్ , ఓమన్ మధ్య ఉన్న హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన జలమార్గం. ఇటీవల యుఎస్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తమ రవాణా నిబంధనలను ధిక్కరించే నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దళాలు ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. గత కొద్దికాలంగా ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడుల ఘటనలు పెరగడంతో సముద్ర మార్గంలో ప్రయాణించే పడవల భద్రతపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.