Hyderabad Rain: హైదరాబాద్‌ను అకస్మాత్తుగా ముంచెత్తిన భారీ వర్షం.. స్తంభించిన రహదారులు.. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం..
AP Weather Alert:
Hyderabad Rain: భాగ్యనగరంలో శుక్రవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం ముంచెత్తింది. రోజంతా పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మబ్బులు పట్టి, భానుడి వేడి నుంచి ఉపశమనం అందించినప్పటికీ, నగరవాసులకు మాత్రం నరకం చూపించింది. సాయంత్రం ఆఫీసు వేళలు ముగిసి ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు తమ తమ ఇళ్లకు చేరుకునే సమయంలోనే వర్షం దంచికొట్టడంతో నగర వీధులన్నీ చెరువులను తలపించాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాలు జల్సాగా ముందుకు సాగలేక అడుగు ముందడుగు పడక గంటల తరబడి నిలిచిపోయాయి.
నగరంలో ప్రధానంగా మణికొండ, రాయదుర్గం, షేక్‌పేట, తుర్కయంజాల్, మన్నెగూడ, కాప్రా, కీసర, నాగారం, టోలిచౌకి, కార్వాన్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, యూసుఫ్‌గూడా, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షం పడింది. వర్షపు తీవ్రత ఎక్కువగా ఉండటంతో కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో రహదారులపై ఐదారు అంగుళాల మేర నీరు చేరింది. హఠాత్తుగా కురిసిన ఈ వర్షానికి ఇళ్లకి వెళ్తున్న ఐటీ ఉద్యోగులు, ద్విచక్ర వాహనదారులు, కాలినడకన వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక చోట్ల వర్షపు నీటిలో ద్విచక్ర వాహనాలు ఆగిపోయి ప్రయాణికులు తీవ్ర తంటాలు పడాల్సి వచ్చింది.
వర్షం ధాటికి నగరంలోని పలు కీలక జంక్షన్లలో ఉదృతంగా వరద నీరు పారింది. ముఖ్యంగా మాదాపూర్ సిటీ వైన్స్ సమీపంలోని ప్రధాన రహదారిపై మురుగు నీరు, వరద నీరు భారీగా నిలిచిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నెమ్మదించాయి. ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కేపీహెచ్‌బీ, మైండ్‌స్పేస్, కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాలు , ఐకియా స్టోర్ వైపు వెళ్లే మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసుల వేళ ముగిసే సమయానికి ఐటీ ఉద్యోగులందరూ ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ఈ రద్దీ రెట్టింపైంది.
మరోవైపు నగర ఉత్తర భాగంలోనూ వర్ష ప్రభావం తీవ్రంగా కనిపించింది. కుత్బుల్లాపూర్ చౌరస్తా నుంచి సూరారం వరకు, షాపూర్ నగర్ నుంచి గాజులరామారం వరకు గల ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పంజాగుట్ట, అమీర్‌పేట్, దిల్సుఖ్‌నగర్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో సైతం సిగ్నళ్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగర వ్యాప్తంగా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు.
సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ (GHMC) మన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు , నగర ట్రాఫిక్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ప్రధాన జంక్షన్లు, ఐటీ కారిడార్ వీధుల్లో నిలిచిపోయిన వరద నీటిని డ్రైనేజీ మ్యాన్‌హోళ్ల ద్వారా కిందకు పంపించేందుకు డ్రైనేజీ నివారణ చర్యలు చేపట్టారు. క్యాచ్ పిట్లలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ నీటి ప్రవాహాన్ని సుగమం చేశారు. వర్షం తగ్గుముఖం పట్టే వరకు అత్యవసరమైతే తప్ప నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రయాణాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం , జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.