Skip to content
జాతీయం › వార్తలు

INDIA Bloc Rally: ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ పేరుతో విపక్షాల మహా ప్రదర్శన.. ఢిల్లీ రామ్‌లీలా మైదానానికి పోటెత్తిన జనసందోహం.. వీడియోలు ఇవిగో..

jagan 01 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
INDIA Bloc Rally: ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ పేరుతో విపక్షాల మహా ప్రదర్శన.. ఢిల్లీ రామ్‌లీలా మైదానానికి పోటెత్తిన జనసందోహం.. వీడియోలు ఇవిగో..

INDIA Bloc Rally

INDIA Bloc Rally: కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి , ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ ప్రతిపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ (Vote Bachao, Desh Bachao) పేరుతో నిర్వహించిన ఈ చారిత్రాత్మక నిరసన ర్యాలీ ఢిల్లీ వీధుల్లో విపక్షాల ఐక్యతా ప్రదర్శనకు వేదికైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ఉదయమే రామ్‌లీలా మైదానానికి చేరుకున్నారు.

ఈ భారీ నిరసన ప్రదర్శన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి ప్రారంభమైంది. ఖర్గే నివాసంలో సమావేశమైన అగ్రనేతలు అక్కడి నుంచి ప్రత్యేక ఓపెన్ క్యాంటర్ వాహనంలో మింటో రోడ్ – కనాట్ ప్లేస్ జంక్షన్‌కు చేరుకున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం నాయకులు ఎం.ఎ. బేబి, సీపీఐ లిబరేషన్ (CPI (ML) Liberation) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆర్జీడి జాతీయ ప్రధాన కార్యదర్శి తేజస్వీ యాదవ్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈ ర్యాలీ ప్రదర్శనలో పాల్గొన్నారు.

వీరితో పాటుగా జమ్మూ కాశ్మీర్ నేతలు ఫారూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఒకే వాహనంపై నిలబడి ర్యాలీకి నేతృత్వం వహించారు. కనాట్ ప్లేస్ , మింటో రోడ్ పరిసర ప్రాంతాల గుండా అజ్మేరీ గేట్ మీదుగా వేలాది మంది కార్యకర్తల జయజయధ్వానాల మధ్య ఈ ర్యాలీ రామ్‌లీలా మైదానానికి చేరుకుంది.

ఉదయమే ఢిల్లీ సెంట్రల్ డీసీపీ రోహిత రాజ్‌బీర్ పర్యవేక్షణలో రామ్‌లీలా మైదానం పరిసరాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మైదానానికి కార్యకర్తల రాక ఉదయం 5:30 గంటల నుంచే మొదలుకాగా, మధ్యాహ్నానికి సభా ప్రాంగణం జనసందోహంతో నిండిపోయింది.

పశ్చిమ బెంగాల్ యూత్ కాంగ్రెస్, మధ్యప్రదేశ్ ఆదివాసీ కాంగ్రెస్ విభాగాల శ్రేణులు కనాట్ ప్లేస్ మీదుగా మార్చ్ నిర్వహించగా, ఎస్‌ఎఫ్‌ఐ (SFI) నాయకులు సుర్జీత్ భవన్ నుంచి ర్యాలీగా తరలివచ్చారు.

ఈ నిరసనలో ప్రధానంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని విపక్ష నేతలు నినాదాలు చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో దేశవ్యాప్తంగా కోట్ల మంది అర్హులైన పౌరుల ఓట్లను అక్రమంగా తొలగించి రాజ్యాంగ హక్కులను హరించారని ఆరోపించారు.

రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం అవలంబించిన అక్రమాల చరిత్రను చట్టసభల వేదికగా, ప్రజల కోర్టులో ఎండగడతామని చెప్పారు. టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ స్పందిస్తూ, రామ్‌లీలా మైదానంలో వినిపించిన ప్రజల ఆగ్రహ జ్వాల త్వరలోనే ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిధ్వనిస్తుందని స్పష్టం చేశారు.