INDIA Bloc Rally: ఎన్నికల అక్రమాలపై నిరసన.. లక్షలాది మందితో హోరెత్తిన రామ్ లీలా మైదాన్.. ఇది ర్యాలీ కాదు భారతదేశ గర్జన అంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్..
INDIA Bloc Rally
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ, కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఆందోళన నిర్వహించింది. ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ (ఓటును కాపాడండి.. దేశాన్ని రక్షించండి) నినాదంతో ఆదివారం చేపట్టిన ఈ ప్రదర్శనలో వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ర్యాలీతో విపక్షాల ఐక్యతను చాటిచెప్పడంతో పాటు, ఓటర్ల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం కల్పించాలని నేతలు పిలుపునిచ్చారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులతో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం సందడిగా మారింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, ఓటర్ల జాబితాల సవరణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకూడదని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు.
ఒకే వాహనంపై అగ్రనేతలు.. ఐక్యతను చాటిన విపక్షాలు
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి ఈ నిరసన కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడ సమావేశమైన ఇండియా కూటమి ముఖ్య నేతలు ప్రత్యేక ఓపెన్ క్యాంటర్ వాహనంపై ర్యాలీలో పాల్గొన్నారు. మింటో రోడ్–కనాట్ ప్లేస్ జంక్షన్‌కు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి కార్యకర్తలతో కలిసి ముందుకు సాగారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం నాయకులు ఎం.ఎ. బేబి, సీపీఐ లిబరేషన్ (CPI (ML) Liberation) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆర్జీడి జాతీయ ప్రధాన కార్యదర్శి తేజస్వీ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈ ర్యాలీ ప్రదర్శనలో పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ప్రముఖ నేతలు ఫారూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితరులు అగ్రనేతలతో కలిసి ర్యాలీకి నాయకత్వం వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఒకే వాహనంపై కనిపించడం ప్రతిపక్షాల ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.
నినాదాలతో హోరెత్తిన ఢిల్లీ వీధులు
మింటో రోడ్, కనాట్ ప్లేస్ పరిసరాల నుంచి అజ్మేరీ గేట్ మీదుగా ర్యాలీ ముందుకు సాగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు నినాదాలు చేస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం ఈ నిరసన ర్యాలీ రామ్‌లీలా మైదానానికి చేరుకుంది.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండేలా సంబంధిత సంస్థలు వ్యవహరించాలని వారు పేర్కొన్నారు.
‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన తమ అభ్యంతరాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే ఇండియా కూటమి ప్రధాన ఉద్దేశంగా కనిపించింది. వివిధ పార్టీల నేతలు ఒకే వేదికపైకి రావడంతో ఈ నిరసన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.