Skip to content
తెలంగాణ › వార్తలు

Telangana Weather Alert: తెలంగాణకు మురసు తుపాను ముప్పు.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

jagan 02 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Weather Alert: తెలంగాణకు మురసు తుపాను ముప్పు.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

arnab cyclone

Telangana Weather Alert: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘మురసు’ (Murasu) తీవ్ర తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తుపాను తీవ్రత తీవ్ర రూపాంతరం దాల్చడంతో వాతావరణ శాఖ సోమవారానికి ‘ఆరెంజ్ అలర్ట్’, మంగళవారానికి ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు సిద్ధంగా ఉండాలని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన సూచనలు చేసింది.

వాతావరణ శాఖ వివరాల ప్రకారం, బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న ‘మురసు’ నవంబర్ 2వ తేదీ (సోమవారం) ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మరింత బలపడనుంది. ఇది నవంబర్ 2 అర్ధరాత్రి నుంచి నవంబర్ 3వ తేదీ తెల్లవారుజాము మధ్య వ్యవధిలో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు , నర్సాపురం ప్రాంతాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తీరం దాటే సమ్మయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

తుపాను ప్రభావంతో సోమవారం (నవంబర్ 2) తెలంగాణలోని దక్షిణ , తూర్పు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ , వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉనందున ఈ జిల్లాలకు అధికారులు ‘ఆరెంజ్ అలర్ట్’ (Orange Alert) జారీ చేశారు.

ముఖ్యంగా మంగళవారం (నవంబర్ 3) నాడు వర్షాల తీవ్రత పరాకాష్ఠకు చేరనుందని హెచ్చరించారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత తీవ్రమైన అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ఈ మూడు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ (Red Alert) ప్రకటించారు. అదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు నివేదించారు.

మరోవైపు రాజధాని హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణం రోజంతా మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, చెట్లు, కరెంట్ స్తంభాల కింద నిలబడవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు టీవీ, రేడియో , వాతావరణ శాఖ అధికారిక ప్రకటనలను గమనిస్తూ తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం విజ్ఞప్తి చేసింది.