Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Cyclone Murasu Update: ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటనున్న ‘మురాసు’ తీవ్ర తుపాను .. ఆరు జిల్లాలకు పెను ముప్పును జారీ చేసిన ఐఎండీ..

jagan 02 Nov 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Cyclone Murasu Update: ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటనున్న ‘మురాసు’ తీవ్ర తుపాను .. ఆరు జిల్లాలకు పెను ముప్పును జారీ చేసిన ఐఎండీ..

Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు.. అక్టోబర్ 27 నుంచి ఏపీలో భారీ వర్షాలు...

Cyclone Murasu Update: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘మురాసు’ (Murasu) తుపాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి ‘తీవ్ర తుపాను’గా మారినట్లు భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్‌లో స్పష్టం చేసింది. నవంబర్ 2వ తేదీ తెల్లవారుజామున 2:30 గంటల సమయానికి ఈ తీవ్ర తుపాను చెన్నైకి తూర్పు-ఈశాన్యంగా 260 కిలోమీటర్లు, నెల్లూరుకు ఆగ్నేయంగా 290 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 320 కిలోమీటర్లు, కావలికి 310 కిలోమీటర్లు, ఒంగోలుకు 330 కిలోమీటర్లు, విశాఖపట్నానికి దక్షిణంగా 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ నివేదించింది.

ఐఎండీ ప్రాథమిక అంచనాల ప్రకారం.. ‘మురాసు’ తీవ్ర తుపాను నవంబర్ 2వ తేదీ అర్ధరాత్రి 11:30 గంటల నుంచి నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున 4:00 గంటల మధ్య వ్యవధిలో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు – నర్సాపురం మధ్య ఒంగోలు పట్టణానికి అత్యంత సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే పీక్ సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల ప్రచండ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.

ఈ తీవ్ర తుపాను ప్రభావంతో నవంబర్ 3 , 4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, గుంటూరు , బాపట్ల జిల్లాల్లో అత్యధిక వర్ష ప్రభావం ఉంటుందని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు (Extremely Heavy Rainfall) నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఇందులో ఏలూరు జిల్లాలోని 9 మండలాలు, కృష్ణా జిల్లాలోని 5, ఎన్టీఆర్ జిల్లాలోని 5 , బాపట్ల జిల్లాలోని ఒక మండలం ఉన్నాయి.

తుపాను ధాటికి దక్షిణ కోస్తాలో పెద్ద ఎత్తున విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రంగా చిన్నభిన్నమయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తక్షణమే తమిళనాడు ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్‌తో ఫోన్‌లో సంభాషించి అత్యవసర సహాయం కోరారు. విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు తమిళనాడు నుంచి అనుభవజ్ఞులైన సిబ్బందిని, ప్రత్యేక యంత్రాలను ఏపీకి పంపించాలని విజ్ఞప్తి చేయగా, తమిళనాడు సీఎం విజయ్ అందుకు సానుకూలంగా స్పందించినట్లు ఏపీ సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

తీరం దాటే సమయంలో సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారడంతో పాటు కరెంట్ స్తంభాలు, పాత భవనాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున తీరప్రాంత , లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు. విద్యుత్ స్తంభాలు, ప్రకటనల హోర్డింగుల కింద నిలబడ వద్దని, విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ పునరావాస కేంద్రాలలో సురక్షితంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.