Skip to content
ప్రపంచం › వార్తలు

US Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ట్రంప్ నివాసానికి సమీపంలో కూలిన ప్రైవేట్ లియర్‌జెట్.. తొమ్మిది మంది మృతి

jagan 02 Nov 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
US Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ట్రంప్ నివాసానికి సమీపంలో కూలిన ప్రైవేట్ లియర్‌జెట్.. తొమ్మిది మంది మృతి

US Plane Crash

US Plane Crash:అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. టెక్సాస్ నుంచి బయలుదేరిన ఒక ప్రైవేట్ లియర్‌జెట్ 60 (Learjet 60) విమానం జనావాసాల సమీపంలో కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు చెందిన పామ్‌బీచ్ కౌంటీలోని మార్-ఎ-లాగో (Mar-a-Lago) నివాసానికి సుమారు తొమ్మిది మైళ్ల దూరంలో ఆదివారం మధ్యాహ్నం 12:50 గంటలకు ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విమానంలోని అందరూ మరణించినట్లు అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ అధికారికంగా ధ్రువీకరించారు.

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నివేదికల ప్రకారం.. N722BD రిజిస్ట్రేషన్ నంబరు కలిగిన ఈ లియర్‌జెట్ 60 విమానం టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బహామాస్‌లోని నార్త్ ఎలుథెరా విమానాశ్రయానికి బయలుదేరింది. ఫ్లోరిడా ఆకాశంలో పయనిస్తున్న సమయంలో ప్రతికూల వాతావరణం, తీవ్ర మంచు ప్రభావం , తుపాను గాలులు తలెత్తడంతో విమానం వేగంగా ఎత్తును కోల్పోయి మిలిటరీ ట్రయల్ – 10వ అవెన్యూ నార్త్ జంక్షన్ పరిధిలోని క్రెస్ట్‌హేవెన్ ప్రాంతంలో నేలను ఢీకొట్టింది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు విమాన పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ‘మేడే’ (Mayday) అత్యవసర సందేశాన్ని పంపినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోల్లో విమానం నిలువుగా ఆకాశం నుంచి కిందకు దూసుకొచ్చి రహదారి పక్కన పడి భారీ పేలుడుతో అగ్నిగోళంగా మారడం కనిపించింది. ఈ ఘటనపై ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, విమానం క్షిపణిలా వేగంగా నేలకు దూసుకొచ్చి తీవ్రమైన పేలుడును సృష్టించిందని పేర్కొన్నారు. విమానం కూలిన ప్రభావానికి విద్యుత్ వైర్లు తెగిపోవడంతో పాటు భూగర్భ నీటి పైప్‌లైన్లు దెబ్బతిన్నాయని, సమీపంలోని ట్రైలర్ పార్క్ కమ్యూనిటీకి చెందిన సుమారు 600 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

ప్రమాద ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. సంఘటనా స్థలంలో తీవ్ర దెబ్బతిన్న మౌలిక సదుపాయాల మరమ్మతులు సాగుతుండగా, ప్రమాదానికి గల కారణాలపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) , ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఉమ్మడిగా విచారణ ప్రారంభించాయి. విమానంలోని ప్రయాణికుల వివరాలను సేకరించేందుకు అధికారులు యత్నిస్తున్నారు.