Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

ప్రజాస్వామ్యానికి బలం ఐక్య ప్రతిపక్షానికి బూస్ట్‌

Prajapaksham 03 Nov 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ప్రజాస్వామ్యానికి బలం ఐక్య ప్రతిపక్షానికి బూస్ట్‌

India Bloc

నవంబర్‌ 1 దేశ ప్రతిపక్ష రాజకీయంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఎన్నికల్లో అక్రమాలు, ఓటు దొంగతనం, బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలకు గురైన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) గ్యానేశ్‌ కుమార్‌ను తొలగించాలన్న డిమాండ్‌ చుట్టూ సాగుతున్న రాజకీయ ఉద్యమం రాంలీలా మైదానంలో మహార్యాలీగా మారి యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. 19 పార్టీల ‘ఇండియా’ కూటమి పిలుపుపై, ఓటరు జాబితాల ప్రక్షాళన పేరుతో 13కోట్లకు పైగా ఓట్లను తొలగించిన ‘సర్‌’ ప్రక్రియకు వ్యతిరేకంగా, ఓట్‌ చోరీకి వ్యతిరేకంగా 2026 గాంధీ జయంతి అక్టోబర్‌ 2 నుంచి అవిరామంగా సాగుతున్న ప్రతిపక్ష ఆందోళన రాంలీల ర్యాలీతో ఉచ్ఛస్థాయికి చేరుకుంది. నిరసన ప్రదర్శకులు ఢిల్లీకి ఎక్కువగా చేరుకోకుండా చేసేందుకు బిజెపి ప్రభుత్వం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నిరాకరించినా, ఒకే రైల్వే స్టేషన్‌లో బల్క్‌గా టిక్కెట్లు ఇవ్వకపోయినా వారు సొంత ఇతరేతర ఏర్పాట్లతో పెద్దసంఖ్యలో ఢిల్లీ చేరుకున్నారు. ‘ఓటును కాపాడండి కాపాడండి’ నినాదాలు దళసరి చర్మంగల అధికార పీఠాలను బలంగా తాకాయి. ఈ ర్యాలీ క్లుమైక్స్‌ కాదు పోరాటాల విస్తృతికి ఉత్తేజం. నవంబర్‌ మధ్యనుంచి డిసెంబర్‌ మధ్యవరకు ఇండియా కూటమి అనేక ఆందోళనలకు ప్రణాళిక తయారుచేసింది. నవంబర్‌ 25 తేదీల్లో మరో ఐదు పెద్ద ఢిల్లీ మార్చ్‌ ర్యాలీలు నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవం రోజున ఢిల్లీలో కలుస్తాయి. ఆ తర్వాత ఈ పోరాటం పార్లమెంటు శీతాకాల సమావేశంలో పార్లమెంటును చేరుతుంది. అంటే ఇదొక రాజకీయ ఉద్యమంగా 2027 సంవత్సరారంభ అసెంబ్లీ ఎన్నికల క్షేత్రంలోకి గొనిపోబడుతుంది. రెండోవైపున సుప్రీంకోర్టులో న్యాయపోరాటం సాగుతుంది. ఈ విచారణలో న్యాయకోవిదులు ఇప్పటికే ఇసి ఒడిగట్టిన అనేక అక్రమాలు, సిఇసి ఏకపక్ష నిర్ణయాలు కోర్టుముందుకు తెచ్చారు. న్యాయమూర్తుల వ్యాఖ్యలు కూడా అక్రమాలను నిలదీసే రీతిగానే ఉన్నాయి.
ప్రతిపక్ష ఇండియా కూటమి ఆందోళనకు వ్యతిరేకంగా బిజెపి దేశవ్యాప్త ప్రచారాందోళన సాగించటంలోనే ఓట్ల దొంగతనాలు, మూకుమ్మడి తొలగింపులను సమర్థించే ధోరణి కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షా సహా బిజెపి నాయకత్వం పై నుంచి కిందిస్థాయి వరకు ఒకే పాట పాడుతున్నది. ‘ప్రతిపక్షం లేదా రాహుల్‌జీ దేశంలో బంగ్లాదేశ్‌, నేపాల్‌లో లాగా అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్య రక్షణ, అరాచకం తొలగింపు’ అంటూ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నది. హోంమంత్రి అమిత్‌ షా సోమవారం హైదరాబాద్‌లో 2కిలోమీటర్ల దూరం సాగించిన ‘మహాపాదయాత్ర’, అనంతర ప్రసంగం ఇందుకోసమే నిర్వహించబడింది. ఢిల్లీకి అన్ని లక్షలమంది ప్రజలు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షాబద్ధులై అరుదెంచారే ఎక్కడైనా ఒక చిన్న అవాంఛనీయ ఘటన జరిగిందా? పైగా బిజెపివారు ఢిల్లీ వ్యాపారుల సంఘాన్ని రెచ్చగొట్టి ‘ప్రతిపక్ష ర్యాలీ వల్ల పండగ సీజన్‌లో మా పదులకోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతింటుంది. అందువల్ల ర్యాలీ దీపావళి అవతల తేదీకి వాయిదా వేసుకోవాలని రాహుల్‌ గాంధీకి, ఆ తర్వాత సోనియాగాంధీకి విజ్ఞప్తులు చేయించారు. 1వ తేదీన అల్లర్లు జరగవచ్చనే భయంతో రెండు లక్షలకు పైగా దుకాణాలు మూసివేశారు. వ్యాపారాలకు నష్టం వాటిల్లకుండా ప్రదర్శకులు ఏదోక వస్తువు కొనుక్కుని వెళ్లండని రాహుల్‌గాంధి విజ్ఞప్తి చేయటం వ్యాపారుల మొసలి కన్నీరును పరిహసించటమే! ప్రతిపక్ష కూటమిలో విభేదాలున్నాయని కూడా బిజెపివారు ప్రచారం చేస్తున్నారు. 19పార్టీల నాయకులు ర్యాలీ ముందురోజు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ‘మాక్‌ పార్లమెంటు’ నిర్వహించి సిఇసి జ్ఞానేశ్‌ కుమార్‌ను అభిశంసించటం, ర్యాలీలో అన్ని పార్టీల నాయకులూ టాపులేని శకటంపై ప్రదర్శనలో పాల్గొని, ఉమ్మడి వేదికను పంచుకోవటం ఆ ప్రచారం నోరు మూయిస్తున్నది. రాష్ట్రాల్లో సీట్లు పంచుకోవటం వంటి విషయాల్లో విరుద్ధ ప్రయోజనాలు ఘర్షణ పడుతుండవచ్చు, కాని ఎన్నికల నిజాయితీని పరిరక్షించే డిమాండ్‌ విషయంలో ముక్తకంఠం వింటున్నాం.
రాంలీలా మైదాన్‌ ర్యాలీవల్ల ఇండియా కూటమికి అనేక రాజకీయ ప్రయోజనాలు చేకూరి ఉండవచ్చు. ప్రతిపక్ష ఐక్యతను చాటిచెప్పటం, మోదీ భజన చేస్తూ ప్రతిపక్షాన్ని పక్కన పెడుతున్న జాతీయ మీడియాలో తగు కవరేజి, రాహుల్‌ గాంధి సహా ప్రతిపక్ష నాయకుల ‘నాయకత్వ సమర్థతను’ పటిష్టవంతం చేయటం, ఎన్నికల జాబితాల తయారీలో నిజాయితీపై చర్చను పెంపొందించటం వాటిలో ముఖ్యమైనవి. ఈ ర్యాలీ తక్షణ ప్రభావం ఫిబ్రవరి లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌పై ఉంటుంది. ఈ ర్యాలీ సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌ రాజకీయ స్థితిని పటిష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పోరాటానికి నాందిగా ఈ ర్యాలీని ఎస్‌పి నాయకుడు అఖిలేశ్‌యాదవ్‌ అభివర్ణించారు. దీని ప్రభావాన్ని తక్కువ చేయటానికే అన్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ లక్నోలో ఇదే రోజున ర్యాలీ నిర్వహించారు. యుపి పోరాటంలో ‘సర్‌’ ఒక ప్రధానాంశంగా ఉంది. రాష్ట్రంలో నికరంగా 2 కోట్ల 5 వేల ఓట్లు తొలగించారు. అందులో అత్యధికం మైనారిటీలు, దళితులు, అల్ప సంఖ్యాకులవని ఊహించటం కష్టం కాదు.
ఢిల్లీ ర్యాలీ సాధించిన మరో సాఫల్యం హిందీ భాషా రాష్ట్రాలన్నిట్లో ప్రతిపక్ష గొంతుక బలపడింది. ఇండియా కూటమి ‘ఎన్నికల జవాబుదారీ ఉద్యమం’ మరింత బలంగా ముందుకు వెళుతుంది. రాహుల్‌గాంధి హెచ్చరించినట్లు దోషులు శిక్ష తప్పించుకోలేరు.

ట్యాగ్‌లు: editorial Today news