Axis Bank Customers Alert: యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారులకు షాక్.. డిసెంబర్ 1 నుంచి మారనున్న ఛార్జీలు, సవరించిన నిబంధనల వివరాలు ఇవే..
Axis Bank Customers Alert
Axis Bank Customers Alert: దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ‘యాక్సిస్ బ్యాంక్’ (Axis Bank) తమ దేశీయ , నివాసేతర (NRI) సేవింగ్స్ ఖాతాదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. వచ్చే డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా పలు రకాల బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన నిబంధనలు, ఛార్జీలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. నగదు లావాదేవీల పరిమితి తగ్గింపు, కనీస బ్యాలెన్స్ లోటుపై విధించే జరిమానాల పెంపు, చెక్ రిటర్న్ రుసుములు , ఎడ్జ్ రివార్డ్ పాయింట్ల (EDGE REWARD Points) నిలిపివేత వంటి కీలక మార్పులు ఈ కొత్త సవరణలలో ఉన్నాయి.
దేశీయ , ఎన్నారై ఈజీ యాక్సెస్ (EASY ACCESS), కృషి (KRISHI) , సహజ్ (SAHAJ) సేవింగ్స్ ఖాతాదారులకు ప్రస్తుతం నెలకు లభిస్తున్న మొదటి 4 ఉచిత నగదు లావాదేవీల (లేదా రూ.1 లక్ష వరకు) పరిమితిని బ్యాంక్ సవరించింది. డిసెంబర్ 1 నుంచి ఈ ఉచిత లావాదేవీల సంఖ్యను 3కి తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే రూ.1 లక్ష డిపాజిట్/విత్‌డ్రా పరిమితి మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. ఈ పరిమితి దాటితే అదనపు లావాదేవీల ఛార్జీలు వర్తిస్తాయి.
నిర్దేశిత సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) నిర్వహించకపోతే విధించే నెలవారీ సర్వీసు రుసుమును లోటులో 6 శాతంగానే ఉంచినప్పటికీ, సెమీ-అర్బన్ , గ్రామీణ ప్రాంతాల ఖాతాదారులకు గరిష్ట జరిమానా పరిమితిని భారీగా పెంచింది. ప్రస్తుతం సెమీ-అర్బన్ శాఖలకు రూ.300, గ్రామీణ శాఖలకు రూ.150గా ఉన్న గరిష్ట జరిమానా పరిమితిని మెట్రో, పట్టణ ప్రాంతాలతో సమానంగా రూ.600కు సవరించింది. ఎన్నారై ఈజీ యాక్సెస్ ఖాతాల్లోనూ సెమీ-అర్బన్/గ్రామీణ ప్రాంతాలకు గరిష్ట ఛార్జీ రూ.300 నుంచి రూ.600కు పెరిగింది. అయితే శాలరీ ఖాతాదారులకు (Salaried Customers) ఈ కనీస బ్యాలెన్స్ జరిమానాల నుంచి మినహాయింపు ఉంటుంది.
బర్గుండీ (Burgundy), ప్రయారిటీ (PRIORITY), ప్రెస్టీజ్ (PRESTIGE), ప్రైమ్ NRI , ఈజీ NRI ఖాతాదారులకు లభిస్తున్న ఎడ్జ్ రివార్డ్ పాయింట్ల ప్రయోజనాన్ని డిసెంబర్ 1 నుంచి పూర్తిగా నిలిపివేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. దీనికి తోడు ప్రైమ్, ప్రెస్టీజ్, ప్రయారిటీ, సంపన్న, అడ్వాంటేజ్, అరైజ్ ఉమెన్స్ , బర్గుండీ తదితర ప్రీమియం ఖాతాల్లో టోటల్ రిలేషన్షిప్ వాల్యూ (TRV) అవసరాన్ని ప్రస్తుతం ఉన్న 75 శాతం నుంచి 100 శాతానికి పెంచింది. దీనివల్ల ఖాతాదారులు పూర్తి స్థాయి అర్హత పొందడానికి నిర్ణీత మొత్తంలో డిపాజిట్లు లేదా పెట్టుబడులను నిర్వహించాల్సి ఉంటుంది.
అవుట్వార్డ్ చెక్ రిటర్న్ (Outward Cheque Return) రుసుమును బ్యాంక్ భారీగా సవరించింది. ప్రస్తుతం మొదటి రిటర్న్‌కు రూ.50, తదుపరి రిటర్న్ నుంచి రూ.100 వసూలు చేస్తుండగా, ఇకపై ప్రతి చెక్ రిటర్న్‌కు యూనిఫామ్‌గా రూ.200 చొప్పున ఛార్జ్ చేయనుంది. అంతేకాకుండా ఎన్నారై బర్గుండీ, ప్రయారిటీ, ప్రెస్టీజ్ , ప్రైమ్ ఖాతాదారులకు చెల్లుబాటు అయ్యే డెలివరీ రిటర్న్ ఛార్జీలను (Deliverable Return Charge) రూ.50 నుంచి ఏకంగా రూ.500కు (10 రెట్లు) పెంచడం గమనార్హం.