AP Local Election Results: స్థానిక ఎన్నికల ఫలితాలు సుపరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు.. కూటమి ఆధిక్యంపై సీఎం చంద్రబాబు స్పందన
Chandrababu Naidu
AP Local Election Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాల్లో hఅధికార తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా పయనిస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సాయంత్రానికి పూర్తిస్థాయి ఫలితాలు వెలువడి మరింత స్పష్టత వస్తుందని తెలిపిన సీఎం, ఈ స్థానిక ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు స్పష్టంగా ఇచ్చిన తీర్పు అని అభివర్ణించారు.
ప్రభుత్వ పనితీరును గమనించిన ప్రజలు తమ సుపరిపాలనను మెచ్చి ఈ విజయంతో ఆశీర్వదించారని చంద్రబాబు పేర్కొన్నారు. తమకు ‘గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్’ అనేదే ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రాజకీయాల కంటే ప్రజల నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికే తాను ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ఇటీవలే సంభవించిన తీవ్ర తుపాను విపత్తు సమయంలో తమ ప్రభుత్వం మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే ప్రభుత్వం అనునిత్యం శ్రమిస్తోందని సీఎం తెలిపారు. రైతులకు భరోసా నిచ్చే పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని, ఇప్పటికే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగు నీటిని అందించామని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నామని, గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా ధ్వంసమైన రోడ్ల పునర్నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నామని వివరించారు. అయితే వారసత్వంగా వచ్చిన అన్ని సమస్యలూ ఒకేసారి పరిష్కారం కాలేదని, పౌర సేవలందించే క్రమంలో ఏమైనా పొరపాట్లు ఉంటే తక్షణమే సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు.
రాజకీయ ప్రత్యర్థుల విమర్శలపై స్పందిస్తూ.. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ కూడా కొందరు ఎగతాళి చేస్తూ విమర్శలు గుప్పిస్తారని, కానీ తాను అలాంటి వాటిని పట్టించుకోకుండా ప్రజాసేవకే అంకితమయ్యానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కులాలు, మతాలు లేదా తమకు ఓటు వేయలేదనే భేషజాలు, పక్షపాతాలు లేకుండా అర్హులైన ప్రజలందరి సంక్షేమం కోసం పని చేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించి వారి ఇబ్బందులు తొలగించడమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెబుతూ, రాబోయే రోజుల్లోనూ ఇదే రీతిలో ప్రభుత్వాన్ని ఆశీర్వదించి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.