పులివెందుల మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు.. ఓట్ల లెక్కింపునకు లైన్ క్లియర్!
పులివెందుల మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు.. ఓట్ల లెక్కింపునకు లైన్ క్లియర్!
పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ ప్రమీల, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ఉత్కంఠకు త్వరలో తెరపడనుంది.
మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రమీల, అవినాష్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు వార్డులకు తిరిగి ఎన్నికలు జరిపించింది. అయితే ఆ నాలుగు ప్రాంతాలకే కాకుండా మున్సిపాలిటీలోని మిగిలిన వార్డుల్లోనూ మరోసారి ఎన్నికలు జరపాలని వారు కోరారు.
అన్ని ప్రాంతాల్లో తిరిగి ఓటింగ్ పూర్తయ్యే వరకు ఫలితాల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకూడదని పిటిషనర్లు తమ వాదన వినిపించారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపుపై ఆంక్షలు విధించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ఈ వ్యవహారంపై సోమవారం ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. అనంతరం మంగళవారం ఉదయం 7.30 గంటలకు హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఓట్ల లెక్కింపును ఆపాలన్న అభ్యర్థనలను అంగీకరించలేదు.
తాజా న్యాయస్థాన నిర్ణయంతో పులివెందుల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు ఎదురైన న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయింది. ఇక ఎన్నికల సంఘం తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.