Skip to content
తెలంగాణ › వార్తలు

Telangana Graduate MLC Elections: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పొడిగింపు..

jagan 04 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Graduate MLC Elections: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పొడిగింపు..

Voter Card

Telangana Graduate MLC Elections: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు దరఖాస్తు గడువును రాష్ట్ర ఎన్నికల సంఘం పొడిగించింది. సాంకేతిక లోపాలు, ఆన్‌లైన్ పోర్టల్ సర్వర్ నిలిచిపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా అర్హులైన పట్టభద్రులందరికీ ఊరట కలిగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, అర్హత కలిగిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసే చివరి తేదీ వరకు తమ ఓటు హక్కు నమోదు కోసం ఫారం-18 (Form-18) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.

ఈ గడువు పొడిగింపు నిర్ణయం వరంగల్-ఖమ్మం-నల్గొండ , మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాలకు వర్తిస్తుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సీ. సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఆన్‌లైన్ ఓటరు నమోదు పోర్టల్‌లో గడచిన కొన్ని రోజులుగా సర్వర్ల మొరాయింపు వల్ల పట్టభద్రులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ స్పష్టతనిచ్చారు. వాస్తవానికి ఈ నెల నవంబర్ 6 వరకు మాత్రమే ప్రాథమిక దరఖాస్తుల స్వీకరణకు తుది గడువుగా నిర్దేశించినప్పటికీ, సాంకేతిక లోపాలను సరిదిద్దడంతో పాటు ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకు గడువు పరిమితిని సవరించారు.

దరఖాస్తు గడువును పొడిగించినప్పటికీ ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన ప్రణాళిక ప్రకారమే నవంబర్ 25న ముసాయిదా (Draft) ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు , సవరణల దరఖాస్తులను స్వీకరించి పరిశీలిస్తారు. అనంతరం డిసెంబర్ 30న తుది (Final) ఓటర్ల జాబితాను అధికారికంగా వెలువరిస్తారు. ఈ తుది జాబితా విడుదలైన తర్వాత కూడా ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆఖరి రోజు వరకు అర్హులైన పట్టభద్రులు ఓటు కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్గం సుగమమైంది.