Skip to content
తెలంగాణ › వార్తలు

Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రోకు రూ.275 కోట్లు.. ఫేజ్‌-2 పనులకు రూ.150 కోట్లు విడుదల..

jagan 03 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రోకు రూ.275 కోట్లు.. ఫేజ్‌-2 పనులకు రూ.150 కోట్లు విడుదల..

Hyderabad Metro

Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మహానగరంలో రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం రూ. 275 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం రెండు వేర్వేరు ప్రభుత్వ ఉత్తర్వులను (GOs) జారీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాలు వెలువరించారు. మెట్రో రైల్ రెండో దశ విస్తరణ పనులతో పాటు, ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల నిర్వహణ, కొత్త కోచ్‌ల కొనుగోలు అవసరాల నిమిత్తం ఈ నిధులను కేటాయించారు.

ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో మెట్రో రెండో దశ (Phase-2) విస్తరణ కోసం ప్రభుత్వం రూ. 600 కోట్లను కేటాయించగా, అందులో మొదటి విడతగా రూ. 150 కోట్లను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML)కు విడుదల చేస్తూ పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. పాతబస్తీ పరిధిలోని ఎంజీబీఎస్ (MGBS) నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన 7.5 కిలోమీటర్ల కారిడార్‌లో ప్రస్తుతం రోడ్ల విస్తరణ, భూమి/ఆస్తుల సేకరణ , నష్టపరిహారం చెల్లింపుల ప్రక్రియ వేగంగా సాగుతోంది.

ఈ మార్గంలో సుమారు 850 నిర్మాణాలను తొలగించేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ (HMRL) సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫేజ్-2కి తుది ఆమోదం లభించిన వెంటనే క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభించేలా ఈ రూ. 150 కోట్ల నిధులను ఆస్తులు కోల్పోయిన యజమానులకు పరిహారంగా చెల్లిస్తున్నారు.

ప్రస్తుతం మున్సిపల్ శాఖ విడుదల చేసిన మరో రూ. 125 కోట్ల నిధులను నగరంలో నడుస్తున్న మెట్రో రైళ్ల నిర్వహణ , అదనపు కోచ్‌ల కొనుగోలుకు వినియోగించనున్నారు. ప్రస్తుతం భాగ్యనగరంలో రోజుకు 5 లక్షల మందికి పైగా ప్రయాణికులు మెట్రో సేవల ద్వారా ప్రయాణిస్తున్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 3 కోచ్‌ల రైళ్లకు అదనంగా మరో 3 కోచ్‌లను జోడించి 6 కోచ్‌ల రైళ్లుగా మార్చాలని నిర్ణయించారు. ఒక్కో కోచ్ నిర్మాణానికి రూ. 60 కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకు వ్యయం కానుండగా, కోచ్‌ల సంఖ్య పెరిగితే నిత్యం మరో 2 లక్షల మంది అదనపు ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి.