Skip to content
తెలంగాణ › వార్తలు

Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు రూ.150 కోట్ల నిధులు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

jagan 02 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు రూ.150 కోట్ల నిధులు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hyderabad Metro

Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మహానగరంలో రవాణా వ్యవస్థను మరింత వేగవంతం చేసేందుకు ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్టు పనుల విస్తరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక ముందడుగు వేసింది. మెట్రో రెండో దశ నిర్మాణ పనుల వేగాన్ని పెంచే లక్ష్యంతో రూ.150 కోట్ల నిధులను రుణం రూపంలో విడుదల చేసేందుకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జీఓ ఆర్‌టీ నెం. 990 (GO RT No. 990)ను అధికారికంగా జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్‌లో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు కోసం కేటాయించిన మొత్తం రూ.500 కోట్ల నిధుల నుంచి మొదటి విడత కింద రూ.125 కోట్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు, మొత్తం రూ.150 కోట్ల రుణ నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది. ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రతీ రూపాయి పారదర్శకంగా వినియోగమయ్యేలా చూడాలని, విడుదల చేసిన నిధుల వ్యయం , పనుల పురోగతిపై ప్రతి నెలా నివేదిక సమర్పించాలని మెట్రో రైల్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వ నిధుల విడుదల ఫలితంగా క్షేత్రస్థాయిలో భూసేకరణ, సాంకేతిక సర్వేలు , మెట్రో విస్తరణ ప్రాథమిక పనులు మరింత ఊపందుకోనున్నాయి. మెట్రో ఫేజ్-2 ప్రణాళికలో భాగంగా నగరం నలుమూలల కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం పలు కీలక రవాణా మార్గాలను ప్రతిపాదించింది.

నాగోల్ – శంషాబాద్ ఎయిర్‌పోర్టు కారిడార్
రాయదుర్గ్ – కోకాపేట్ కారిడార్
ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట కారిడార్ (పాతబస్తీ మార్గం)
మియాపూర్ – పటాన్‌చెరు కారిడార్
ఎల్బీనగర్ – హయత్‌నగర్ కారిడార్

వీటితో పాటు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి భారత్‌ ఫ్యూచర్‌సిటీ కారిడార్, జేబీఎస్ నుంచి మేడ్చల్ కారిడార్, , జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట్‌ కారిడార్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనల్లో పొందుపరిచారు. రూ.150 కోట్ల నిధులు లభించడంతో డీపీఆర్‌ల సవరణ, డిజైన్లు , ప్రాథమిక నిర్మాణ ప్రక్రియలు వేగవంతం కానున్నాయి.