Skip to content
జాతీయం › వార్తలు

నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ మరొక మారణకాండ!

Prajapaksham 04 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ మరొక మారణకాండ!

Protest

డాక్టర్ దేవరాజు మహారాజు, (నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ ఇండియా సలహా సంఘ పూర్వ సభ్యుడు, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌)

1934వ సంవత్సరం అంటే జర్మనీలో నాజీలు అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్స రం అక్కడి చరిత్రకారుడు ఊరిక్‌ కార్సెం ట్‌ చేసిన ప్రసంగంలోని కొన్ని విషయాల్ని ఈ సందర్భంలో మనం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది.
“కేవలం పరిశోధన కోసం చేసే పరిశోధన మాకు అక్కరలేదు. తెలిసిన సూక్ష్మజీవుల సంఖ్యను పెంచడాని కి మేం వైద్యశాస్త్రంలో పరిశోధనలు చేయం. ఆరోగ్యకరమైన, బలమైన జర్మనీ ప్రజల కోసమే మాకు వైద్యశాస్త్రం కావాలి. సైన్సు నేర్చుకునేది, బోధించేది ABSTRACT LAWS కనుక్కోవడానికి కాదు. ఇతర దేశాలతో జరిగే పోటీలో ముందు నిలబడటానికి మాత్రమే! గతంలో ఏం జరిగిందో చెబుతూ మేం చరిత్ర బోధించం. జర్మన్‌ ప్రజలకు కొన్ని సూచనలివ్వడానికి మాత్రమే చరిత్ర బోధి స్తాం!” ఈ రకమైన ఆలోచనా విధానంతో నాజీలు మొట్టమొదట పాఠశాలల మీద, విశ్వవిద్యాలయాల మీద, విద్యారంగం మీద దాడి చేశారు.
“అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్రం మాకు అక్కరలేదు” ఆనాటి నాజీల ముఖ్యమైన నినాదం! సమాజాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఇలాంటి కొన్ని నినాదాలు, విధానాలు ప్రచారం చేశారు. ‘జర్మన్‌ తత్వం’ ఉంటే చాలు నన్నది స్థూలంగా వారి విధానమయ్యింది. ఈ విషయం అక్కడి ప్రభుత్వం ప్రకటించగానే విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు సుమారు మూడు వంతుల మంది ఉద్యోగాలు వదిలేసి వెళ్లపోయారు. ఇతరత్రా జీవన భృతి చూసుకున్నారు. మిగిలిన ఒక వంతు మంది నాజీలకు లొంగిపోయి, బతుకు జీవుడా అనుకున్నారు. పై ప్రసంగంలోని విషయాలు ఎంత అహేతుకంగా ఉన్నాయో కొద్దిపాటి ఇంగిత జ్ఞానం ఉన్నవారికి సైతం తెలుస్తాయి కదా?
మన ప్రస్తుత దేశ నాయకులు అంటే ఆరెస్సెస్‌, బిజెపి వారు నూటికి నూరుపాళ్ళు విద్యారంగంలో
‘భారతీయత’ ఉంటే చాలునంటున్నారు. వీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశంలో సైన్సుకు గడ్డుకాలం దాపురించింది. చరిత్ర వక్రీకరణకు గురి అవుతూ ఉంది. విద్వేష ప్రసంగాలు చేస్తూ జనాన్ని చీలుస్తూ ఉన్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం, ఆహార భద్రత, పేదరిక నిర్మూలన వంటి విషయాలపై ఏ మాత్రం దృష్టి పెట్టడంలేదు. ఆర్థికంగా దిగజారిపోయి, విదేశీ విధానంలో పూర్తిగా దెబ్బతిని ఉండి కూడా, పుంజుకుందామన్న స్పృహ లేకుండా, పునరుద్ధరణ విషయమే ఆలోచించకుండా ‘హిందుత్వ’ పేరుతో ద్వేష రాజకీయాలు చేస్తూ ఉన్నారు. పన్నుల భారం ఒకవైపు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి మరొకవైపు… సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఏదైనా ఒక విషయాన్ని గతంలో మన దేశం ఎలా అర్థం చేసుకుందో ఇప్పుడు ప్రతీ విద్యార్థికీ తెలియజెప్పాలన్నదే నేటి జాతీయ విద్యావిధానం! ప్రాచీన భారతీయ జ్ఙానం అంటే సాధారణ శకానికి ముందు (BCE) వచ్చిన చార్వాక, బౌద్ధ, జైన, ఆజీవక, సాంఖ్య వంటి దర్శనాల గురించి చెప్పాలి. అంతేకాని, వైదిక రుషుల గురించి చెప్పడం ఎందుకూ? వారి రచనలన్నీ తర్వాత కాలంలో సాధారణ శకం(C.E)లో వచ్చినవి కదా? భారతీయ జ్ఞానం గొప్పది. అయితే, దాన్ని నాశనంచేసి, భారతీయ మూలాలేవో భారతీయులకు తెలియకుండా చేసిన వైదిక మతాన్ని తిరగతోడి ప్రస్థుత ప్రభుత్వం గొప్పగా నిలబెట్టాలని అనుకుంటోంది. ప్రశ్న బలపడిన ఈ కాలంలో ప్రశ్ననే ఊపిరి చేసుకుని ఈ దేశ యువత ఉద్యమిస్తున్న కాలంలో నేటి ఈ ప్రభుత్వపు దురుద్దేశం ఎక్కువ కాలం కొనసాగదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆనాటి జర్మనీ నాజీల అడుగుజాడల్లో నడుస్తూ ఈ ప్రభుత్వం దేశంలోని విద్యావిధానాన్ని ధ్వంసం చేసింది. గతంలో వీరు చేయించిన ఎన్నో మారణ కాండల్లాంటిదే ఈ జాతీయ విద్యావిధానం NEP. దీని ఉద్దేశం ఏమిటంటే “ప్రాచీన, వారసత్వ, శాశ్వత, భారతీయ జ్ఞానం, ఆలోచనా సరళి అవసరం” అని! ఇందు లో పద్దెనిమిది మంది ప్రాచీన రుషులను ప్రస్తావించి, భారతీయ జ్ఞానా న్ని భవిష్యత్‌ తరాలకోసం పెంపొందించి, పరిరక్షించి, పరిశోధనలు చేసి, మెరుగుపరచి, దాన్ని కొత్త ప్రయోజనాల కోసం వినియోగించాలి అని! ఇందుకోసం NEP లో IKSD ని కూడా ఏర్పరిచారు. IKSD అంటే Indian Knowledge Systems division. NEP లో NEC (Non Major elective Course) ఇంకా VAC (Value course) వంటి కోర్సు లు కూడా ప్రవేశపెట్టారు. వారి NEP కే Value లేనప్పుడు ఇంకా లోపల Value Added Courseలు పెడితే ఏం లాభం? ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టం కింద ఒక ఫాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (FDP) కూడా పెట్టారు. ఇవన్నీ ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్స్‌. వీటిని వీడియోలతో, స్లయిడ్స్‌తో నిర్వహిస్తారు. అవైనా నిర్వాహకులు తయారు చేయించి ఇచ్చినవి మాత్రమే ఉపయోగించాలి. ఇక వీటి స్థాయి ఎలా ఉందో చూడం డి IKS: మాస్టర్‌ స్థాయి శిక్షకులు చెప్పిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి.

  1. పైథాగరస్‌ ఆవిష్కరణ మన భారతీయుల ఆవిష్కర ణ అని చెప్పాడు ఒక శిక్షకుడు. పైథాగరస్‌ 495 BCE నాటి గ్రీకు తత్త్వవేత్త కదా? ఆయన పేరుతో ఉన్నది
    భారతీయ ఆవిష్కరణ ఎలా అవుతుందీ?
  2. మనుషులకు మూడవ కన్ను ఉంటుంది. అది యోగా చేసిన వారిలో తెరుచుకుంటుంది ఇది మరొక మాస్టర్స్‌ స్థాయి శిక్షకుడు చెప్పిన విషయం.
    ౩.హిందూ ప్రార్థనలు చేస్తే చెరకు దిగుబడి బాగా
    పెరుగుతుంది.
    4.మంత్రోచ్ఛారణ వెనుక న్యూరో సైన్స్‌ (neuro science) ఉంది.
  3. భగవద్గీతలో ‘కర్మయోగ’ ఉంది.
  4. అంతర్గత నిశ్శబ్దపు ప్రాధాన్యత (importance of innner silence)పెంచుకోవాలి!
  5. మన ప్రదర్శన కళల్లో ‘నాట్యకళ’ అత్యంత పురాతనమైంది. విద్యార్థులకు బోధించే శిక్షణనిచ్చే శిక్షకుల ఆలోచనలే ఇంత అహేతుకంగా ఉంటే, ఇక భావి భారత పౌరుల స్థాయి అంధభక్తుల స్థాయేకదా?
    వైదిక, బ్రాహ్మణ సంప్రదాయాలపైనే ఆరెస్సెస్‌ బిజెపిలు దృష్టి సారించి, అందుకు అనుగుణంగా మన తరగతి గదులను మార్చాలని, తద్వారా రాబోయే తరాలను మార్చాలని ప్రయత్నిస్తోంది! ఉదాహరణకు చూడండి
  6. బోధనా పద్ధతుల్ని వారే నియంత్రిస్తున్నారు.
  7. పరిశోధనాంశాలను వారే నిర్ణయిస్తున్నారు.
    3.భారతీయ సంస్కృతి అంటే వైదిక సంస్కృతి/బ్రాహ్మణ సంస్కృతి అని మాత్రమే ప్రస్తుత పాలకులు భావిస్తున్నారు.
    4.వారి కనుసన్నల్లో మెదిలే అధికారులు వారికి
    వంతపాడుతున్నారు.
  8. ప్రపంచానికి భౌతిక వాదం మొదటగా చెప్పింది ఈ దేశమేనన్న విషయం ఈ దేశ ప్రజలు గుర్తుంచుకోగూడదని పాలకులు ఎత్తులు వేస్తున్నారు.
    NEP లో భాగంగా వారు రూపొందించిన కోర్సుల లో ఏమేమున్నాయో ఈ దేశ ప్రజలు పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంది. దాన్ని రద్దు చేయించడానికి ఉద్యమించా ల్సి ఉంది 1. భగవద్గీత ! A Guide to Holistic Well Being సంపూర్ణ మానవ శ్రేయస్సుకు భగవద్గీత ఒక మార్గదర్శి అని వారి భావన! అలాగే 2. భారత దేశాన్ని రామాయణం కోణంలో అర్థం చేయించాలని మరొక వీడియో కోర్సు ఏర్పాటు చేశారు. దాని శీర్షిక Comprehending india Through Ramayana. 3. రామ రాజ్యానికి సంబంధించిన కోర్సు ఒకటి ఇలా ఉంది. Ideal state and Goverence in The Ramayana 4. కులాలు ఎవరూ ఏర్పాటు చేయలేదని, వారు చేపట్టిన వృత్తుల వల్ల అవి సహజంగా ఏర్పడ్డాయని ఆ కోర్సులో బోధిస్తున్నారు. 5. కుల వివక్ష ఈ వ్యవస్థ నుండి పుట్టలేదన్నది వారి వాదన ! ఇకపోతే 6. Vedic Philosophy ని కళాశాలల్లో పాఠ్యాంశంగా నేరుగా జొప్పించడానికి ‘సిద్ధాంత పౌండేషన్‌’ అనే ప్రయివేటు సంస్థకు బాధ్యతను ఇచ్చి, కరికులమ్‌ కంటెంట్‌ను ఏర్పాటు చేయమన్నారు. వారికి 70 లక్షల నిధిని సమకూర్చారు. ఈ కోర్సులకు మెటీరియల్‌ తయారు చేయడానికి సంస్కృత విశ్వవిద్యాలయాలకు, సిద్ధాంత పౌండేషన్‌ లాంటి ప్రయివేటు సంస్థలకు సబ్‌కాంట్రాక్ట్‌ ఇచ్చారు. మళ్ళీ ఇదొక వ్యాపారం! ఇంతకూ ఈ సిద్ధాంత ఫౌండేషన్‌కు లోగడ ఏం అనుభవముంది? అని వెతికి చూస్తే, తెలిసిందేమంటే, ఇది లోగడ ఆగ్రో కెమికల్స్‌ తయారు చేసే కంపని. డబ్బులు దండుకోవడానికి భారతీయ తత్తశాస్త్రం పై దృష్టి సారించిందన్న మాట! తమకు భజన చేసే కంపనీ అయి ఉంటుంది అందుకే ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టు వారికిచ్చి, నిధులు సమకూర్చారన్న మాట!
    మరొక వైపు, ఈ జాతీయ విద్యావిధానం యువతపై బలవంతంగా సంస్కృతాన్ని రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. పేపర్‌ లీక్‌ మీద ఉద్యమం చేస్తూ జెన్‌ జి ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించిన విషయం మనకు తెలుసు. జెన్‌ జి వారికి సంస్కృతం రాకపోవడం వల్లనే వారు మోదీ గురించి అవాకులు చవాకులు రాసి ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని NEP నిర్వాహకులు ఆరోపించారు. సంస్కృత పఠనం సాధన చేస్తే సహనం అలవడుతుందనీ, వారిలో హింసాత్మకమైన స్వభావం ఉండదని అన్నారు. ఈ నూతన విద్యావిధానంలో భాగంగా “ఆధునిక కాలానికి సంస్కృతం యొక్క ఆవశ్యకత” అనే అంశంపై పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించాలని అనుకున్నారు. ప్రయత్నించారు కూడా! శీర్షిక చూడగనే ఎక్కడ వారు అక్కడే పారిపోయారు. ఆశించినంత మంది రాలేదు. దానికి నిర్వాహకులు చెప్పి న సమాధాన మేమంటే ‘జనం అశాంతితో, గందర గోళంలో ఎందుకు ఉన్నారంటే అందుకు కారణం, వారు సంస్కృతం నేర్చుకోకపోవడమే’ అని చెప్పారు. ఒకప్పుడు అధిక సంఖ్యాకులైన బహుజనులు సంస్కృత పదం ఉచ్ఛరిస్తేనే నాలుకలు కోసేశారే మరి ఇప్పుడు ఏమైంది? మారిన పరిస్థితుల దృష్ట్యా “బాబ్బాబు నేర్పు తాం! నేర్చుకోండి!!” అని జనాల వెంట పడి బతిమిలాడినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఎంతటి బలమైన ప్రభుత్వాలైనా జనం బలం ముందు దిగదుడుపే సమాజాన్ని వెనక్కినడుపుతామంటే ఎవరూ సహకరించరు. పైగా తీవ్రంగా ప్రతిఘటిస్తారు. ఆ ప్రతిఘటనలనే మనం ప్రస్తుతం దేశంలో చూస్తున్నాం. గతంలో నీట్‌ పేపర్‌ లీక్‌ కారణంగా, ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫలితంగా డిల్లీ జంతర్‌ మంతర్‌లో నిరసనలు పెల్లుబికాయి. అంటే, విద్యారంగానికి సంబంధించిన విషయంతోనే ఉద్యమాలు ఊపిరిపోసుకున్నాయి. మోదీ ప్రభుత్వం దిగొచ్చింది. అప్పటి విద్యామంత్రి రాజీనామా చేసి పారిపోయాడు. ఆ తరువాత ఇప్పుడు
    ‘ఓట్‌ చోరీ’ మీద (sir) ఉద్యమం నడుస్తోంది. దీని తర్వా త దేశంలో ఉన్న అనేక సమస్యలు మీద ఉద్యమాలు తలెత్తే అవకాశం ఉంది. నేటి బాల బాలికల భవిష్యత్తు, యువతీ యువకుల భవిష్యత్తు అంధకారం చేయబోయే ఈ నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ రద్దు చేయాలని కూడా ఒక ఉద్యమం ఊపందుకోవచ్చు ఎందుకంటే, ఇది కూడా మరో మారణకాండ లాంటిదే! పౌర సమాజం ఆలోచించే యువతకు వెన్నుదన్నుగా నిలబడుతూ ఉంది!