మణిపూర్ రాష్ట్రంలో తుపాకీ మోతలేనా! బోసి నవ్వులు వినిపించవా?
Manipur protest
మేకిరి దామోదర్
ఒకప్పుడు ప్రకృతి అందాలకు, భిన్న జాతుల సంస్కృతీ సంప్రదాయాలకు నిలయంగా నిలిచిన మణిపూర్.. నేడు జాతుల మధ్య చిచ్చుతో అట్టుడుకుతోంది. శాంతి కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు తుపాకీ మోతలు, దాడులు, నిర్బంధాలు, నిరాశ్రయ జీవితాలే మిగులుతున్నాయి. 2023లో ప్రారంభమైన కుకీ ఘర్షణల గాయాలు మానకముందే, 2026లో కుకీ ఘర్షణలు కొత్త సంక్షోభానికి తెరతీశాయి. ఒక ప్రాంతంలో చల్లారిన ఉద్రిక్తతలు మరో ప్రాంతంలో చెలరేగుతుండటం ఆందోళనకరం. ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రం మూడేళ్లుగా అశాంతితో కొట్టుమిట్టాడుతుంటే, శాశ్వత పరిష్కారం సాధించడంలో పాలకులు ఎందుకు విఫలమవుతున్నారు? అన్నది దేశం ఆలోచించాల్సిన ప్రశ్న.
కొత్త ఘర్షణలు..అంతులేని ప్రాణనష్టం!
2023 మే 3న మణిపూర్‌లో కుకీ, మైతేయి వర్గాల మధ్య ప్రారంభమైన హింసలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు, భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నప్పటికీ సాధారణ పరిస్థితులు పూర్తిస్థాయిలో నెలకొనలేదు. ఇంతలో 2026 ఫిబ్రవరి నుంచి కుకీ వర్గాల మధ్య కూడా ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఉక్రుల్, కామ్జోంగ్, కాంగ్పోక్సి, నోనీ, తమెంగ్లాంగ్, సేనాపతి వంటి కొండ ప్రాంతాల జిల్లాలు హింసకు కేంద్రాలుగా మారాయి.
అక్టోబర్ 16న వెలువడిన నివేదిక ప్రకారం, ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 10 వరకు మణిపూర్‌లో 300కు పైగా హింసాత్మక ఘటనలు, దాదాపు 100 మరణాలు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లోనే కుకీ ఘర్షణల్లో కనీసం 19 మంది మరణించినట్లు నివేదికలు వెల్లడించాయి. అక్టోబర్ 10న కామ్జోంగ్, ఉక్రుల్ జిల్లాల్లో జరిగిన తాజా ఘర్షణల్లో నూ ప్రాణనష్టం సంభవించింది. ఇళ్ల దహనం, ఆకస్మిక దాడు లు, లక్ష్యంగా చేసుకున్న హత్యలు ప్రజల్లో భయాందోళనలు పెంచుతున్నాయి.
ఈ పరిణామాలను కేవలం రెండు వర్గాల మధ్య ఘర్షణలుగా చూడలేం. గతంలో నెలకొన్న అవిశ్వాసం, భద్రతపై ఆందోళనలు, భూహక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, పరస్పర ఆరోపణలు సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తున్నాయి. ఒక వర్గంపై జరిగిన దాడికి మరో వర్గం ప్రతీకారం తీర్చుకోవడం.. దానికి మళ్లీ ప్రతిదాడి జరగడం అంతులేని హింసకు దారితీస్తోంది. నేరానికి బాధ్యులెవరో నిష్పాక్షికంగా నిర్ధారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోతే, సామూహిక నిందారోపణలతో నిర్దోషులూ బాధితులవుతారు.
రహదారుల దిగ్బంధం.. అస్తవ్యస్తమైన జనజీవనం!
మణిపూర్‌లో రహదారుల దిగ్బంధాలు, బంద్‌లు, రవాణా అంతరాయాలు ప్రజల రోజువారీ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. అత్యవసర వైద్యం, నిత్యావసర సరుకు లు, విద్యార్థుల చదువులు, చిన్న వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. మార్కెట్లు మూతపడటం, వాహనాలపై దాడులు, ఇళ్లకు నిప్పుపెట్టడం వంటి ఘటనలు ప్రజల భద్రత ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొనడం విచారకరం. 2026 ఏప్రిల్‌లో వెల్లడైన మణిపూర్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023 మే 3 నుంచి 2026 మార్చి 30 వరకు 58,821 మంది హింస కారణంగా నిరాశ్రయులయ్యారు. పరిహార చెల్లింపుల ఆధారంగా 217 మరణాలు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. మార్చి 10 నాటికి 174 సహాయ శిబిరా లు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. వేలాది ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ గణాంకాలు పాత ఘర్షణల అమానవీయ పరిణామాలను స్పష్టం చేస్తున్నాయి. తాజా కుకీ ఘర్షణలు ఈ సంక్షోభాన్ని మరింత విస్తరించే ప్రమాదం ఉంది. నిరాశ్రయులైన కుటుంబాలు ఎప్పుడు తమ ఇళ్లకు చేరుకుంటాయో, పిల్లలు ఎప్పుడు పాఠశాలలకు తిరిగి వెళతారో, ఉపాధి కోల్పోయినవారికి ఎప్పుడు జీవనాధారం లభిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అక్టోబర్‌లో మృతదేహాలను ఇంఫాల్‌లోని ముఖ్యమంత్రి నివాసం ఎదుట ఉంచి నిరసన తెలిపిన ఘటనలు ప్రజల్లో పేరుకుపోయిన ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడటం, బాధితులకు న్యాయం చేయడం, నిరాశ్రయులకు పునరావాసం కల్పించడం ప్రభుత్వం కనీస ప్రాథమిక బాధ్యత.
శాంతి కోసం చిత్తశుద్ధితో చర్చలే పరిష్కారం!
మణిపూర్ సంక్షోభానికి బలప్రయోగం ఒక్కటే పరిష్కారం కాదు. భద్రతా చర్యలు అవసరమే అయినా, వాటితోపాటు రాజకీయ చొరవ, సామాజిక సామరస్యం, న్యాయబద్ధమైన పరిష్కారం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, భద్రతా సంస్థలు, కుకీ, మైతేయి, నాగా ప్రతినిధులు ఒకే వేదికపై కూర్చొని నిరంతర చర్చలు జరపాలి. బాధిత వర్గాల ఆందోళనలను వినాలి. గత ఒప్పందాల ఉల్లంఘనలపై వచ్చిన ఆరోపణలను స్వతంత్రంగా విచారించి వాస్తవాలను ప్రజల కు వెల్లడించాలి. తప్పు చేసినవారు ఏ వర్గానికి చెందినవారైనా చట్టం ముందు సమానంగా బాధ్యత వహించాలి.
హింసాత్మక ప్రాంతాల్లో పటిష్ఠమైన భద్రత కల్పించడం, ఆయుధాల అక్రమ రవాణాను అరికట్టడం, సున్నిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, బాధితులకు తక్షణ పరిహారం అందించడం అత్యవసరం. సహాయ శిబిరాల్లో ఆహారం, వైద్యం, పారిశుద్ధ్యం, విద్య వంటి సదుపాయాలు కల్పించాలి. నిరాశ్రయులైన కుటుంబా లు స్వచ్ఛందంగా, సురక్షితంగా తమ ఇళ్లకు తిరిగి వెళ్లేలా నమ్మకాన్ని కల్పించాలి. దాడులపై నిష్పాక్షిక దర్యాప్తు, బాధితులకు న్యాయం, దెబ్బతిన్న గ్రామాల పునర్నిర్మాణం సమాంతరంగా సాగాలి. అంతేకాదు, పౌర సమాజ సంస్థలు, మహిళా సంఘా లు, యువజన సంఘాలు, మత పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధుల ను శాంతి ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. సామాజిక మాధ్యమాల్లో విద్వేష ప్రచారం, తప్పుడు వార్తలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలి. పరస్పర అపోహలను తొలగించే ప్రజా సమావేశాలు నిర్వహించాలి. శాంతి ఒప్పందా లు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షించాలి.
మణిపూర్ ప్రజలు కోరుకుంటున్నది ఆధిపత్యం కాదు, ఆత్మగౌరవంతో కూడిన భద్రమైన జీవితం. ప్రతీకారం కాదు, న్యాయం, నిర్బంధాలు కాదు, స్వేచ్ఛగా జీవించే వాతావరణం. ప్రపంచ వేదికలపై శాంతి, అహింస గురించి మాట్లాడే మన దేశం, తనలోని ఒక రాష్ట్రంలో ప్రజలు అభద్రతలో- భయాందోళనల మధ్య బతుకుతుంటే!?. మౌనంగా ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాలకు అతీతం గా చిత్తశుద్ధితో వ్యవహరించాలి. మూడు వర్గాల మధ్య నమ్మకం పునరుద్ధరించాలి. చివరగా ఒక్క మాట.. ఒకరి రక్తంతో మరొకరి భవిష్యత్తును నిర్మించలేం. ప్రతీకారానికి ప్రతీకారం సమాధానం కాదు; చర్చలు, న్యాయం, పరస్పర గౌరవమే శాశ్వత శాంతికి పునాది. మణిపూర్‌లో మళ్లీ తుపాకీ మోతలు కాదు.. పిల్లల నవ్వులు వినిపించాలి.