Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

ఢిల్లీలో పోలీసుల బహిరంగ ధిక్కారం దేనికోసం?

Prajapaksham 04 Nov 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఢిల్లీలో పోలీసుల బహిరంగ ధిక్కారం దేనికోసం?

Editorial: విశిష్ట సాహిత్య ధోరణి ‘మేజిక్‌ రియలిజం’

శాంతి పరిరక్షణ యంత్రాంగంలో ప్రధానమైన విభాగం పోలీసు వ్యవస్థ. క్రమశిక్షణ, నిష్పక్షపాతం, చట్టపాలన, అసాంఘిక శక్తుల పట్ల కాఠిన్యం, మానవ హక్కులను గౌరవించటం దానికి నిర్దేశిత కర్తవ్యాలు. అయినప్పటికీ అది రాజ్యవ్యవస్థ సాయుధ పనిముట్టు అని మరిచిపోరాదు. విలువలు దిగజారిన రాజకీయ వ్యవస్థలో అది సర్వసాధారణంగా పాలకపక్షం చెప్పుచేతల్లో పనిచేస్తూ వారి ప్రయోజనాలను రక్షిస్తూ ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎంచుకున్న పోలీసు అధికారులనే ప్రభువులు వారి నియోజకవర్గాల్లో నియమించటమనే ఆనవాయితీ దీనికి నిదర్శనం. నిజాయితీపరులైన అధికారులు ఏ మారుమూల ప్రదేశాలకో లేక అప్రధాన పోస్టింగ్‌ల్లోకో పంపబడుతుంటారు. పోలీసును చట్టనిర్దేశనకు లోబడి పనిచేసే స్వతంత్ర వ్యవస్థగా సంస్కరణలు కోరే సిఫారసులు అమలుకు నోచుకోవు. రెండోవైపున, పోలీసుల్లో అసంతృప్తిని, వారి ఫిర్యాదులను, సాధకబాధకాలను చర్చించి, పరిష్కరించే అంతర్గత యంత్రాంగం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడూ కొందరు పోలీసు లు తెగించి రోడ్డెక్కుతుంటారు. 2019 లో తీస్‌ హజారీ కోర్టు కాంప్లెక్స్‌ వద్ద లాయర్లతో హింసాత్మక ఘర్షణల దరిమిలా 2000మంది పోలీసు సిబ్బంది పాత ఐటిఒ హెడ్‌ క్వార్టర్స్‌ వెలుపల సమీకృతం కావటం అటువంటి ఒక పెద్ద సంఘటన. కాగా ఢిల్లీలో సోమవారం 800మంది సాధారణ పోలీసులు రోడ్డెక్కి నిరసన తెలియజేయటం ఈ కోవకే చెందుతుంది. ఎసిపి వశిష్ట, షాదర స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఒ) ఇన్‌స్పెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ సస్పెన్షన్‌ ఆర్డర్లు వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ 23న షాదర పోలీసు స్టేషన్‌ వద్ద తోపులాటలో ఒక అడ్వొకేట్‌ తలపై బలమైన గాయమైన కారణంగా లాయర్‌లు నిరవధిక సమ్మెకు దిగటంతో వశిష్ట, అరుణ్‌కుమార్‌లను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. తన బదిలీకి వ్యతిరేకంగా వశిష్ట ఈ నిరసన ఆర్గనైజ్‌ చేయటం ఆసక్తిదాయకం. అయితే 400మంది ఎసిపిల్లో ఇద్దరు తప్ప మరెవ్వరూ బయటపడి సంఘీభావం తెలియజేయకపోవటం గమనించదగింది. ఒకచోట వాహనం పార్కింగ్‌ వివాదంలో అడ్వొకేట్‌ లలిత్‌ బన్సాల్‌పై దాడిచేసిన నిందితులపై చర్య తీసుకోవాలని కోరేందుకు లాయర్‌లు పోలీసు స్టేషన్‌కు వచ్చారు. చర్యకు హామీ ఇచ్చిన వశిష్ట ఆ తర్వాత నిందితులను విడుదల చేశారు.
ఢిల్లీ పోలీసులు కేంద్రప్రభుత్వ హోంమంత్రిత్వశాఖ కింద పనిచేస్తారు. దీన్ని ఉపయోగించుకుని బిజెపి మతమార్గాల్లో వారిలో రాజకీయాలు చొప్పించింది. ప్రజల నిరసన ఆందోళనల సందర్భంలో ఢిల్లీ పోలీసు పాత్ర, చర్యలు ఎప్పుడూ ప్రజలమధ్య చర్చనీయాంశాలుగానే ఉన్నాయి. జులై 26న ఢిల్లీలో యువత ‘చలో పార్లమెంట్‌’ సందర్భంలో పోలీసులు ప్రదర్శకుల మధ్య హింసాత్మక ఘటనలు పౌరహక్కులను అణచటంలో పోలీసుల పాత్రను చర్చలోకి తెచ్చాయి. ఎందుకంటే, పోలీసులు విద్యార్థులనుంచి ఫోన్‌లు లాక్కున్నారు, పేరుతో కూడిన బ్యాడ్జీలు ధరించని వ్యక్తులను విద్యార్థులపై దాడికి ఉపయోగించారు, మేకులున్న లాఠీలు ప్రయోగించారు, పెల్లెట్‌ గన్స్‌తో కాల్పులు జరిపి గాయపరిచారు. తమ చట్టవిరుద్ధ హింసను సమర్థించుకునేందుకు విద్యార్థుల నిరసన అనుమతిలేని చట్టవిరుద్ధ ఆందోళనగా నిందించారు.
లాయర్లు, పోలీసులు మధ్య కోర్టు ఆవరణల్లో తరచూ ఘర్షణలు జరుగుతుండటం, లాయర్ల సంఘటిత నిరసనతో పోలీసులపై చర్యలు తీసుకోవటం, తమగోడు వినేవారులేరన్న మనస్తాపం కూడా పోలీసుల్లో అసంతృప్తికి హేతువవుతోంది. వీటన్నిటికి తోడు ఢిల్లీలో విద్యార్థి ప్రదర్శకులపై పోలీసుల పాశవిక దాడి (ఎవరి ఆదేశాలతో జరిగినప్పటికీ) పై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శాంతియుత నిరసన తెలియజేయటం ఆర్టికల్స్‌ 14, 19, 21కింద రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కు అని నొక్కి చెప్పింది. పెల్లెట్‌ గన్స్‌ ప్రయోగించటం సహా పోలీసు పాశవికతపై ఆరోపణలపై దర్యాప్తు కూడా ఆదేశించింది. నిరాయుధులైన ప్రదర్శకులపై యువ ఐపిఎస్‌ అధికారులు స్వయంగా దాడిచేయటాన్ని తనుగా చూసిన మరో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ తన బాధను బహిరంగంగా వ్యక్తం చేశారు. “పోలీసు అధికారులనుంచి ఆశించేటటువంటి ‘స్వయంగా నిర్ణయానికి వచ్చే స్వాతంత్య్రం’ అంతర్ధానమవుతున్నట్లు కనిపిస్తున్నది’ అని వ్యాఖ్యానించారు. సమర్ధవంతమైన పోలీసింగ్‌ అంటే మానవహక్కులను ఉల్లంఘించటం కాదన్నారు.
ఇనుపమేకులు అమర్చిన పొడవాటి కర్రలు, ఎలక్ట్రిక్‌ లాఠీలు, పెల్లెట్లు ఉపయోగించటంపై అనేక పిల్‌లు ఢిల్లీ హైకోర్టులో దాఖలైనాయి. సిసిటివి ఫుటేజి మొత్తం భద్రపరచాలని, పిల్‌ ఆరోపణలకు సమాధానం దాఖలు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. విద్యార్థి ప్రదర్శకులపై అనవసరంగా, మోతాదుకు మించి బలప్రయోగానికి ఒడిగట్టిన ఢిల్లీ పోలీసును స్వతంత్ర ప్రజాట్రిబ్యునల్‌ అభిశంసించింది.
ప్రజావిభాగాల ఆందోళనల సందర్భంలో పోలీసులు ఒత్తిడికింద పనిచేయాల్సి ఉంటుంది. అయితే వారు రూల్‌బుక్‌ను పాటించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే రిస్క్‌ తక్కువ ఉంటుంది. కాని పోలీసు యంత్రాంగం పాలకుల ఆదేశాలకు తలవంచి వారి రాజకీయాల్లో భాగమైనప్పుడు ప్రజా అసమ్మతికి గురికాక తప్పదు. స్వాతంత్య్రం వచ్చి 8 దశాబ్దాలు అవుతున్నా బ్రిటిష్‌ కాలంనాటి అణచివేత స్వభావం నుంచి పోలీసు వ్యవస్థ బయటకు రాలేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ హితవులను ఈ చెవితోవిని ఆ చెవితో వదిలేస్తున్నారు. పోలీసులకు క్రమశిక్షణ ఎంత అవసరమో చట్టాన్ని పాటించే అత్యధిక మెజారిటీ ప్రజలనుంచి గౌరవం పొందటం కూడా అంతే అవసరం.

ట్యాగ్‌లు: editorial Today news