Skip to content
తెలంగాణ › వార్తలు

ఆర్‌టిసి ఎన్నికలలో ఎర్రజెండా రెపరెపలు

Prajapaksham 05 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
ఆర్‌టిసి ఎన్నికలలో ఎర్రజెండా రెపరెపలు

RTC Election

ఎస్‌.బాబు, టిజిఎస్‌ ఆర్‌టిసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఆర్‌టిసిలో ఎన్నికలు 2016లో జరిగి టిఎంయు గుర్తింపు సంఘంగా ఏర్పడింది. కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించాలి. ఆ ప్రకారంగా 2018 లో జరగాల్సిన గుర్తింపు సంఘ ఎన్నికలు అనేక కారణా ల వల్ల వాయిదా పడ్డాయి. 2019లో 55 రోజుల సమ్మె తరువాత కెసిఆర్‌ ఆర్‌టిసిలో ట్రేడ్‌ యూనియన్లకు మంగళం పాడారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత 09-.10.-2026న అంటే దాదాపు పదేళ్ళ తరువాత గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించింది.
నా 42 ఏళ్ళ అనుభవంలో ఇలాంటి గుర్తింపు సంఘ ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. సినిమా వాళ్ళు కథలో ట్విస్ట్‌ లు ఇచ్చినట్లు అంతకు మించి అన్నట్లుగా ట్విస్ట్‌ ల మీద ట్విస్ట్‌ లు నడిచాయి. ఈ ట్విస్ట్‌ లకు కారణం టిఎంయు అంతర్గత కలహాలు. వారి సొంత సమస్యకు కోర్టుల కెక్కి 34 వేల మంది కార్మికులను ఇబ్బంది పెట్టారు. టిఎంయు ‘ఎ’ గ్రూప్‌, ‘టి’ గ్రూప్‌లుగా ఏర్పడి జూన్‌ 2026న జరగాల్సిన ఎన్నికలను అక్టోబర్‌ దాకా లాక్కొచ్చారు. ఒకసారి ‘ఎ’ వర్గం పైచేయి అయితే, మరోసారి ‘టి’ వర్గం పైచేయిగా సాగింది. ఈ రెండు వర్గాల వల్ల వారి క్యాడర్‌ అనుభవించిన క్షోభ వర్ణనాతీతం. ఎన్నికల్లో ఏ వర్గం ఉంటుందో తెలియదు. ఏ వర్గం ఊడుతుందో తెలియదు. లేక రెండు వర్గాలు ఉంటాయా? ఉండవా? అనే మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు. గుర్తు దగ్గర నడిచిన డ్రామా కోర్టులు, ప్రభుత్వం జోక్యంతో పిచ్చెక్కిపోయింది. చివరి నిముషం వరకు నడిచిన ఈ మెలోడ్రామా కార్మికుల్ని గందరగోళం లోకి నెట్టింది. యూనియన్‌ తమకు రాదని తెలుసుకున్న ‘ఎ’ గ్రూప్‌ బాణం గుర్తుపై కన్నేసిం ది. ఎలాగైనా ఆ గుర్తును దక్కించుకోవాలని పావులు కదిపిం ది. ఫలితంగా టిఎంయు ‘టి’ వర్గ ఎన్నికల గుర్తు అయిన బాణం ఎ వర్గానికి పోయింది. టిఎంయు ‘టి’ వర్గానికి నిచ్చెన గుర్తు కేటాయించారు. ఇందులో కాంగ్రెస్‌ పనితనం బాగా ఉందని కార్మికులు అర్థం చేసుకున్నారు.
ఆర్‌టిసిలో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఇది గతంలో టిఆర్‌ఎస్‌ యూనియన్‌. దీని గుర్తు చార్మినార్‌. ఈ యూనియన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల గురించి ఆర్టీసి కార్మికులకు తెలియదు. దాని జెండా, ఎజెండా ఏమిటో తెలియదు. ఈ యూనియన్‌ని టిఎంయు ‘ఎ’ వర్గం అద్దెకు తెచ్చుకుంది. చార్మినార్‌ గుర్తుతో పోటీ పడకుండా చోరీ చేసిన గుర్తుపై పోటీకి దిగింది. ఈ యూనియన్‌ కి రాష్ట్రంలో ఏ డిపోలనూ కమిటీలు లేవు. వారెపుడూ కార్మికవర్గ సమస్యలపై పోరాడిందీ లేదు. 2016 ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌కి వచ్చింది 37 ఓట్లు మాత్రమే.
టిఎంయు ‘ఎ’ వర్గం గతంలో టిఆర్‌ఎస్‌ పంచన చేరింది. గుండెల్లో కెసిఆర్‌ని నింపుకున్నారు. కెటిఆర్‌ పైజేబులో, హరీష్‌ రావు పక్క జేబులో ఉన్నట్లు చెప్పుకొన్నారు. ఎక్కడ చెడిందో కానీ ఆ నాయకుడు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కాదు తూచ్‌ అని కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అంతే… అక్కడనుండి కాంగ్రెస్‌ పార్టీ ఆ నాయకుడిని వెనకేసుకొచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ తమ సొంత యూనియన్‌ అయిన ఐఎన్‌ టియుసి అనుబంధ సంఘాన్ని గాలికి వదలి తెలంగాణ వర్కర్స్‌ అనే యూనియన్‌ ను అద్దెకు తెచ్చి అద్దె నాయకులకు బ్రహ్మరథం పట్టింది. ఆ నాయకులు ఎర్రజెండా యూనియన్‌ను ఎన్నికల్లో గెలవనివ్వబోం అంటూ భీషణ ప్రతిజ్ఞ చేశారు. అద్దె నాయకులు రియల్టర్లు కావడంతో ట్రిపుల్‌ M ఫార్ములాను అమలు చేశారు. మందు ఏరులై పారింది. మనీ సర్క్యులేషన్‌ లోకి వచ్చింది. మందుకు మటన్‌ తోడై మత్తెక్కిచ్చింది. తాగారు, ఊగారు, వాగారు. వారి వల్ల ఎన్ని మూగజీవాలు బలయ్యాయో లెక్కలేదు. ఓటుకు నోటు అనే విధంగా రియల్టర్లు విజృంభించారు. ఇది నాణానికి ఒక వైపు.
ఇప్పుడు నాణానికి మరోవైపున ఆర్‌టిసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకత్వం జెఎసి లో ఉన్న టిఎంయు, ఎన్‌ఎంయు లతో ఐక్యకూటమి ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో నిలిచింది. ఈ జెఎసి పక్షానికి ట్రిపుల్‌ ఎం ఫార్ములా సౌకర్యాలు లేవు. వీరు 3 బృందాలుగా ఏర్పడి నేరుగా కార్మికవర్గంలోకి చొచ్చుకుపోయి ప్రచారం చేశారు. అద్దె యూనియన్‌ నాయకుల ప్రచార శైలి ధనస్వామ్యంతో నడిస్తే, ఎంప్లాయీస్‌ యూనియన్‌ జెఎసి కూటమి ప్రచారశైలి జనస్వామ్యంతో నడిచింది. వీరు ప్రతి డిపోలో గేటు మీటింగులు పెడుతూ కార్మికులను వ్యక్తిగతంగా కలుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అద్దె యూనియన్‌ నాయకులు వారికున్న ఆర్థిక వనరులతో ప్రచారాన్ని హోరెత్తించాడు. గజమాలలు, గండపెండేరాలు, పూలవర్షాలు, కాన్వాయ్‌లు, హోర్డింగులు, కటౌట్లతో చేసిన ప్రచారం అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికలను తలపించింది. తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ వారు రీజియన్లలో బహిరంగ సభలు, జన సమీకరణలు, బాజా భజంత్రీలతో ప్రచారానికి రంగులద్దారు. ఎంప్లాయీస్‌ యూనియన్‌ జెఎసి కూటమి ఈ ఎన్నికల్లో ఎక్కడా ఒక్క బహిరంగ సభ కూడా నిర్వహించలేదు. ఓటుకు నోటును ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఐక్య కూటమి పంచిన దాఖలాల్లేవు. అయినా ఈ కూటమికి కార్మికులు ఓట్ల వర్షం కురిపించారు. 10,000 ఓట్ల మెజారిటీతో గెలవాల్సిన ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఐక్య కూటమి, అద్దె యూనియన్‌ నాయకులిచ్చిన తాయిలాలతో మెజారిటీ తగ్గింది తప్ప ఎంప్లాయీస్‌ యూనియన్‌ గెలుపుని ఆపలేకపోయారు.
అక్టోబర్‌ 14, 15 తేదీలలో జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌లో కూడా అద్దె సంఘ నాయకులు నోట్లకట్టలతో కార్మికుల్ని ప్రభావితం చేయాలని చూశారు. మెదక్‌ లో 18 ఓట్లు వస్తే అద్దె యూనియన్‌ ఆ రీజియన్‌ క్లాజ్‌ గెలిచే పరిస్థితి వచ్చింది. ఒక ఓటుకు 2 లక్షల రూపాయలు ఆఫర్‌ ఇచ్చారు. అయినా వారికి కేవలం ఒకే ఒక్క ఓటు దక్కింది. మరికొన్ని చోట్ల ఫోన్‌ పేలు, గూగుల్‌ పేలు నడిపారు. కంచిపట్టు చీరలు పంచారు. వారే గెలిచి విజయోత్సవ సభ నిర్వహిస్తారనే నమ్మకంతో మహిళలకు డ్రెస్‌ కోడ్‌ పేరుతో పట్టు చీరల పంపకం జరిగింది. అయినా వారు ఓటమిపాలయ్యారు. రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్‌ యూనియన్‌నే 18,375 ఓట్లు ఇచ్చి కార్మికవర్గం ఎంచుకుంది. అద్దె సంఘానికి 13,709 ఓట్లు మాత్రమే రావడంతో ఆ నాయకుల ఆశలు అడియాసలయ్యా యి.
ఎన్నికల ప్రచారానికి ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్మికుల్ని డొనేషన్లు(విరాళాలు) అడుగుతుంటే, అద్దె యూనియన్‌ నాయకులు కార్మికులకు డబ్బు ఆఫర్‌ చేయడం జరిగింది. వారికి ఏ లాభం లేకుండా మనకి డబ్బెందుకు ఇస్తున్నారని కార్మికులు బుర్రకు పని చెప్పారు. వారి కుళ్ళు, కుతంత్రం కార్మికులు అర్థం చేసుకున్నారు. ఈయూ అయితేనే కార్మికుల పక్షాన పోరాడుతుందని నమ్మారు. అందుకే అద్దె సంఘాన్ని చిత్తుగా ఓడించారు. దానికి కూడా అనేక ట్విస్టులు. రాష్ట్ర గుర్తింపు సంఘంగా 9 యూనియన్లు పోటీ పడ్డాయి. బ్యాలెట్‌ పేపర్‌ లో వారి యూనియ న్లు ఉన్నా ఎస్‌.డబ్ల్యు.యు ఐ.ఎన్‌.టి.యు.సి అనుబంధ సంఘం ఇది కాంగ్రెస్‌ పార్టీ యూనియన్‌ వారి త్రాసు గుర్తుకు ఓటు వేయకుండా అద్దె సంఘం గుర్తుపై ఓటేశారు. అలాగే మరో 6 సంఘాలు వారి గుర్తుకు ఓటు వేయకుండా అద్దె యూనియన్‌ గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్‌ భక్తిని చాటుకున్నారు. ఎవరి గుర్తుకు వారు ఓటు వేసుకుంటే అద్దె సంఘానికి 5 వేల ఓట్లు తగ్గి 8 వేలకే పరిమితం అయ్యేది. ఓట్లు టోటల్‌ కాంప్లిమెంట్‌ 34,904 కాగా పోలైన ఓట్లు 34,421. వీటిలో 18,375 ఓట్లు సాధించి క్లాజ్‌- కింద రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ గెలిచింది. టిడబ్ల్యుయుకి 13,709 ఓట్లు రావడంతో కాంగ్రెస్‌ పార్టీతో పాటు అద్దె సంఘ నాయకుల మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఇచ్చిన షాక్‌ కి కాంగ్రెస్‌ పార్టీ షేక్‌ అయింది. అద్దె సంఘ నాయకులకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. ఆ దెబ్బతో వారి ముఖచిత్రం మారిపోయింది. ఎస్‌.టి. ఎం. యు కి 15, బి.డబ్ల్యు.యు 320, కె.పి 0, కె.ఎస్‌ 193. బికెయు 259, ఎస్‌.డబ్ల్యు.యు 35, టిజెఎంయుకి 1,315 ఓట్లు స్టేట్‌ బ్యాలెట్‌ కు వచ్చాయి. 130 ఓట్లు చెల్లలేదు.
ఎంప్లాయీస్‌ యూనియన్‌ని ఓడించాలని, అద్దె సంఘాన్ని గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు, చేసిన ప్రయత్నాలను ఆర్టీసి కార్మికులు తిప్పి కొట్టారు. అందుకే ఈ విజయం కార్మికులకు అంకితం. రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ పై బాధ్యత పెరిగింది. వెంటనే ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయించి విలీన ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని కార్మికవర్గం కోరుతోంది.
ఇదిలా ఉంటే, కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ ప్రకారం క్లాజ్‌- 6 గుర్తింపు సంఘానికి ఆ రీజియన్లలో పోలైన ఓట్లలో 50 శాతం పైన రావాలి. అప్పుడు మాత్రమే ఆ యూనియన్‌కి క్లాజ్‌- గుర్తింపు ఇవ్వాలి. కాని నల్గొండ, వరంగల్‌, మెదక్‌ మరియు సికింద్రాబాద్‌ రీజియన్లలో 50శాతం పైన ఏ యూనియన్‌ కూ ఓట్లు రాలేదు.ఆ వివరాలు ఒక్కసారి పరిశీలిద్దాం. (పక్కన పట్టికలో)
ఇలాంటి సందర్భంలో రాష్ట్ర గుర్తింపు యూనియన్‌ ఆ నాలుగు రీజియన్లలో గుర్తింపు సంఘంగా ఉంటుందని కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ చెబుతోంది. కానీ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ పై 4 రీజియన్లలో 50 శాతం ఓట్లు చూడకుండా ఆ రీజియన్‌లో ఎక్కువ ఓట్లు పొందిన యూనియన్‌ కు గుర్తింపు ఇచ్చింది. ఇది కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ను ఉల్లంఘించడమే. యూనియన్లను సంప్రదించకుండా, ముందస్తు నోటీసు లేకుండా రిటర్నింగ్‌ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్‌ పార్టీ హస్తం ఉందని కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. అలా చేయడం వల్ల కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చిన అద్దె యూనియన్‌ టిడబ్ల్యుయు వర్గానికి 3 రీజియన్లు కట్టబెట్టడం రిటర్నింగ్‌ అధికారి చేసిన దుందుడుకు చర్య. లేబర్‌ డిపార్టుమెంట్‌ లోనే అన్‌ ఫెయిర్‌ లేబర్‌ ప్రాక్టీస్‌ జరుగుతుంటే వర్కింగ్‌ క్లాస్‌ తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? 28 ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జెఎసి రిటర్నింగ్‌ అధికారి ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ లేబర్‌ కమిషనర్‌ ఆఫీస్‌ను ముట్టడించారు. కార్మిక వర్గం గర్జనతో ఆ ప్రాంతం హోరెత్తింది. పరిస్థితిని గమనించిన అడిషనల్‌ లేబర్‌ కమిషనర్‌ చర్చలకు ఆహ్వానించి, సమస్యను రిజాల్వ్‌ చేస్తామని హామీ ఇవ్వటంతో కార్మికులు శాంతించారు.