Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

ప్రజా ఉద్యమాలే ఊపిరిగా..పేదల పక్షాన పోరాటమే జీవితంగా…

Prajapaksham 05 Nov 2026 0 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
ప్రజా ఉద్యమాలే ఊపిరిగా..పేదల పక్షాన పోరాటమే జీవితంగా…

Mekala Ravi

షేక్‌ బాష్‌ మియా, సిపిఐ వరంగల్‌ జిల్లా కార్యదర్శి

వరంగల్‌ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో కామ్రేడ్‌ మేకల రవి ప్రస్థానం
వరంగల్‌ జిల్లా రాజకీయ, సామాజిక ఉద్యమ చరిత్రలో సిపిఐ రాష్ట్ర నాయకులు కామ్రేడ్‌ మేకల రవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సుమారు నాలుగు దశాబ్దాల పాటు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)లో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన ప్రజా నాయకుడు ఆయన. ఆయన అకాల మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, వరంగల్‌ జిల్లా ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. ప్రజానాట్యమండలి నుంచి రాజకీయ ప్రస్థానం 1986లో ప్రారంభమై, ప్రజానాట్యమండలి కళాకారునిగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించిన మేకల రవి, కళను ప్రజా చైతన్యానికి ఆయుధంగా మలిచారు. పాటలు, కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని కల్పించేందుకు కృషి చేశారు. అనంతరం భారత కమ్యూనిస్టు పార్టీతో అనుబంధం పెంచుకొని పార్టీ నిర్మాణంలో క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీ నిర్మాణంలో కీలక బాధ్యతలు చేపట్టిన మేకల రవి తన రాజకీయ జీవితంలో అనేక ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్‌) నగర కార్యదర్శిగా, సిపిఐ వరంగల్‌ నగర కార్యదర్శిగా, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యునిగా, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగా పనిచేశారు. అలాగే ఎఐటియుసి వరంగల్‌ జిల్లా నిర్మాణ బాధ్యతల్లో కీలక పాత్ర పోషించారు. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను క్రమశిక్షణతో, అంకితభావంతో నిర్వహిస్తూ కార్యకర్తలకు మార్గదర్శకంగా నిలిచారు. భూపోరాటాల సందర్భంలో పేదల పక్షాన అలుపెరుగని పోరాటం చేశారు. వరంగల్‌ నగరంలో పేదలు, నిరుపేద కుటుంబాలు, ఇళ్ల స్థలాలు లేని నిరాశ్రయుల సమస్యలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు. భూపోరాటాల్లో చురుకుగా పాల్గొంటూ వేలాది పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, పట్టా లు సాధించేందుకు జరిగిన పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి, వారి హక్కుల కోసం అధికారులను నిలదీస్తూ, ప్రజలను సమీకరిస్తూ ఉద్యమాలు నిర్వహించారు. మైక్రోఫైనాన్స్‌ బాధితుల కోసం పోరాటం మైక్రోఫైనాన్స్‌ సంస్థల వేధింపులతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్న పేద మహిళలు, కుటుంబాలకు అండగా నిలిచారు. అధిక వడ్డీలు, అప్పుల ఒత్తిళ్లు, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా బాధితులను సమీకరించి పోరాటాలు నిర్వహించారు. పేదల ఆర్థిక హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి ప్రజా ఉద్యమ చరిత్రలో గుర్తుండిపోతుంది.
కార్మిక, యువజన ఉద్యమాలకు సేవలు
యువజన ఉద్యమం నుంచి కార్మిక ఉద్యమం వరకు వివిధ రంగాల్లో తనదైన ముద్ర వేశారు. యువతను సామాజి క మార్పువైపు నడిపించడంలో, కార్మికుల సమస్యలపై పోరాడడంలో, సంఘటిత శక్తి ప్రాధాన్యతను వివరించడంలో కృషి చేశారు. ప్రజా సంఘాల నిర్మాణానికి, పార్టీ విస్తరణకు నిరంతరం శ్రమించారు. నేటి తరానికి ఆయన జీవితం స్ఫూర్తిగా నిలుస్తుంది. పదవులు, హోదాల కంటే ప్రజల మధ్య ఉండటానికే ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు మేకల రవి. ఎన్నో ప్రజా ఉద్యమాల్లో భాగస్వామిగా ఉంటూ, పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో పనిచేశారు. ఆయన అకాల మరణం సిపిఐ వరంగల్‌ జిల్లా సమితికి, ప్రజా సంఘాలకు, ఉద్యమకారులకు తీరని లోటు. కామ్రేడ్‌ మేకల రవి భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన ప్రజా పోరాటాలు, పేదల కోసం సాగించిన ఉద్యమాలు, పార్టీ నిర్మాణానికి చేసిన సేవలు ఎప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ఎర్రజెండా నీడలో సాగిన ఆయన పోరాట జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకం. కామ్రేడ్‌ మేకల రవికి జోహార్లు!

ట్యాగ్‌లు: CPI Telangana