Skip to content
క్రైమ్ › వార్తలు

Bolarum Train Accident: ఒక్క క్షణం నిర్లక్ష్యం ప్రాణాంతకం.. ఇయర్‌ఫోన్లపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్..

jagan 28 Oct 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
Bolarum Train Accident: ఒక్క క్షణం నిర్లక్ష్యం ప్రాణాంతకం.. ఇయర్‌ఫోన్లపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్..

Bolarum Train Accident

ప్రాణాల కంటే ఫోన్ కాల్స్, పాటలు ముఖ్యమా అంటూ భావోద్వేగ సందేశం

Bolarum Train Accident: ఆధునిక జీవనశైలిలో భాగంగా మారిన ఇయర్‌ఫోన్ల వాడకం వల్ల జరుగుతున్న ఘోర ప్రమాదాలపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ (ఐపీఎస్) వి.సి. సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇయర్‌ఫోన్లు పెట్టుకుని అజాగ్రత్తగా ఉండటం వల్ల చోటుచేసుకుంటున్న విషాదకర ఘటనలను ఎత్తిచూపుతూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాత్మక , హెచ్చరికతో కూడిన పోస్టును పంచుకున్నారు. నిండు నూరేళ్ల జీవితం కంటే ఆ ఫోన్ కాల్ అంత అత్యవసరమా, ఇంట్లో మీకోసం ఎదురుచూసే కుటుంబ సభ్యుల కంటే ఆ పాటలు అంత ముఖ్యమైనవా అంటూ ఆయన పౌరులను నిలదీస్తూ ఆలోచింపజేశారు.

ఇటీవల సికింద్రాబాద్ సమీపంలోని బొల్లారంలో చోటుచేసుకున్న ఒక హృదయ విదారక దృశ్యాన్ని తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ సీపీ సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు. బొల్లారంలో రైల్వే ట్రాక్ పక్కన బాహ్య ప్రపంచ స్పృహే లేకుండా, ఇయర్‌ఫోన్లలో మాట్లాడుకుంటూ నడుస్తున్న ఒక వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చిన రైలు క్షణాల వ్యవధిలో ఢీకొట్టిన దృశ్యం అత్యంత ఆందోళన కలిగించింది. క్షణకాలం ఏమరుపాటు, అజాగ్రత్త ఒక నిండు జీవితాన్ని ఎలా బలితీసుకుంటుందో చెప్పడానికి ఈ ఘటనే సజీవ నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్లపై నడుస్తున్నప్పుడు, వాహనాలు నడుపుతున్నప్పుడు లేదా రైల్వే ట్రాక్‌ల సమీపంలో సంచరిస్తున్నప్పుడు ఇయర్‌ఫోన్లలో మాట్లాడటం లేదా సంగీతం వినడం అనేది అత్యంత ప్రాణాంతకమైన అలవాటని సీపీ పేర్కొన్నారు. ఈ విధమైన పరధ్యానం వల్ల స్వయంగా తమ ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే తోటి వాహనదారులకు కూడా ముప్పు తెచ్చిపెడుతున్నారని స్పష్టం చేశారు. ఆధునికత పేరుతో చెవులకు తగిలించుకునే ఇయర్‌ఫోన్లు వినోదాన్ని అందించడం లేదని, ప్రాణాలను బలితీసుకునే మాయా తెరగా మారుతున్నాయని విమర్శించారు. పౌరులందరూ ఈ ప్రమాదకరమైన అలవాటును తక్షణమే మానుకోవాలని, ఇళ్లకు సురక్షితంగా తిరిగొస్తారని వెయ్యి కళ్లతో ఎదురుచూసే కుటుంబ సభ్యులను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సజ్జనార్ హితవు పలికారు.