Skip to content
క్రైమ్ › వార్తలు

Meerut Blue Drum Murder Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో సంచలన తీర్పు.. దోషులు ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాకు మరణశిక్ష..

jagan 14 Oct 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
Meerut Blue Drum Murder Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో సంచలన తీర్పు.. దోషులు ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాకు మరణశిక్ష..

Meerut Blue Drum Murder Case

Meerut Blue Drum Murder Case: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ‘బ్లూ డ్రమ్ మర్డర్’ (Blue Drum Murder Case) కేసులో మీరట్ జిల్లా కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ దారుణ హత్యకు పాల్పడిన ప్రధాన నిందితులు ఇద్దరికీ ఉరిశిక్ష (మరణశిక్ష) ఖరారు చేస్తూ జిల్లా కోర్టు జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా తుది తీర్పును ప్రకటించారు. గత సెప్టెంబర్ 30 నాటికే ఈ కేసు విచారణ ప్రక్రియ పూర్తిగా ముగియగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. నేడు జరిగిన తుది విచారణలో నిందితులు ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ఈ ఘోర హత్యకు గురైంది ముస్కాన్ భర్త, నేవీ మాజీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ భరద్వాజ్ కావడం గమనార్హం.

ఈ భయానక ఘటనకు సంబంధించిన వివరాల ఏంటంటే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన నేవీ మాజీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ 2025 మార్చి 3న అత్యంత క్రూరంగా హత్యకు గురయ్యాడు. సౌరభ్ భార్య ముస్కాన్ రస్తోగికి, ఆమె క్లాస్‌మేట్ అయిన సాహిల్ శుక్లాతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ అక్రమ సంబంధానికి భర్త సౌరభ్ అడ్డుగా ఉన్నాడనే కక్షతో నిందితులు ఇద్దరూ పథకం ప్రకారమే అతన్ని కడతేర్చారు. అనంతరం సౌరభ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఒక నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో (బ్లూ డ్రమ్) కుక్కారు. మృతదేహం బయటపడకుండా ఉండేందుకు దానిపై సిమెంట్ పోసి గట్టిగా కప్పేయడంతో, శవం డ్రమ్‌లోనే కూరుకుపోయింది. కొద్ది రోజుల తర్వాత మిస్సింగ్ కేసుగా ప్రారంభమైన విచారణలో పోలీసులు అన్ని కోణాలను కూపీ లాగడంతో ఈ దారుణ హత్య వెలుగులోకి వచ్చింది.

ఈ కేసు దర్యాప్తు నుంచి తీర్పు వెలువడే వరకు మొత్తం ప్రక్రియ అత్యంత వేగంగా జరగడం విశేషం. గత ఏడాది జూలైలో ప్రారంభమైన ఈ కేసు విచారణ కేవలం 13 నెలల రికార్డు సమయంలోనే పూర్తయింది. ఈ సుదీర్ఘ విచారణ కాలంలో ఏకంగా 126 సార్లు ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. పోలీసులు సేకరించిన పక్కా ఆధారాల ఆధారంగా 22 మందికి పైగా కీలక సాక్షులను కోర్టు విచారించి అభియోగపత్రాలను (చార్జిషీటు) నమోదు చేసింది. తీర్పు వెలువడే సమయంలో నిందితులు ఇద్దరూ జిల్లా జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. సమాజంలో తీవ్ర కలకలం రేపిన ఈ కిరాతక నేరానికి కోర్టు మరణశిక్ష విధించడం ద్వారా సంచలన తీర్పును వెలువరించింది.