Skip to content
క్రైమ్ › వార్తలు

Telangana: నా భార్య అందరి ముందు ఇజ్జత్ తీస్తోంది.. బతకాలని లేదు’ అంటూ యువకుడు అదృశ్యం.. సెల్ఫీ వీడియో వైరల్..

jagan 18 Nov 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
Telangana: నా భార్య అందరి ముందు ఇజ్జత్ తీస్తోంది.. బతకాలని లేదు’ అంటూ యువకుడు అదృశ్యం.. సెల్ఫీ వీడియో వైరల్..

Youth Disappears

Telangana: భార్య వేధింపులు భరించలేక ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి సిద్ధపడినట్లు సెల్ఫీ వీడియో తీసి అదృశ్యమైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ‘నాకు ఈ బతుకు బతకాలని లేదు.. మీరైనా సంతోషంగా ఉండండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆ యువకుడు, తన స్కూటీపై హైదరాబాద్ వైపు వెళ్లి కనిపించకుండా పోయాడు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతీఘనపూర్ గ్రామానికి చెందిన శివప్రసాద్ (23) అనే యువకుడు తన భార్యతో తరచూ గొడవలు పడుతున్నట్లు ఆరోపించాడు. భార్య తనను తరచూ కొడుతోందని, బూతులు తిడుతూ నలుగురిలో అవమానిస్తోందని సెల్ఫీ వీడియోలో వాపోయాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినప్పటికీ తననే తప్పుగా చిత్రీకరిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం ఆడవారివైపే చట్టాలు ఉన్నాయనే ధైర్యంతో ఆమె తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తోందని.. కొడుతూ, కొరుకుతూ నానా ఇబ్బట్లకు గురిచేస్తోందని వీడియోలో పేర్కొన్నాడు. నిత్యం మానసికంగా కుంగదీసి తనను చనిపోమని అంటోందని ఆవేదన వెళ్లగక్కాడు.

ఈ జీవితం ఇక తనకు వద్దని, తన తల్లిదండ్రులైనా సంతోషంగా ఉండాలని చెబుతూ శివప్రసాద్ ఇంటి నుంచి తన స్కూటీపై హైదరాబాద్ వైపు బయలుదేరాడు. అయితే కొత్తూరు ప్రాంతం వద్ద తన స్కూటీని నిలిపివేసి ఆ తర్వాత అతడు ఎక్కడికి వెళ్లాడనే దానిపై స్పష్టత లేకపోవడంతో పూర్తిగా కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. శివప్రసాద్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే అప్రమత్తమై కేసు నమోదు చేశారు. యువకుడు ఆచూకీ కోసం కోఠి నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గాల్లోని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కుటుంబ కలహాలు ఒక యువకుడిని ఈ స్థాయి నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ట్యాగ్‌లు: Crime Telangana