Coconut Market Row: కొబ్బరికాయ పండు కాదు.. అది నూనెగింజ కిందకే వస్తుంది.. అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం కీలక తీర్పు..
మహిళలు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు..ఇస్లాంలోకి మారిన యువతులపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
Coconut Market Row: కొబ్బరికాయ వర్గీకరణకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం అత్యంత ఆసక్తికరమైన, కీలకమైన తీర్పును వెలువరించింది. చట్టపరంగా కొబ్బరికాయ ‘పండు’ (Fruit) కాదని, అది ‘నూనెగింజ’ (Oilseed) విభాగం కిందకే వస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కారణంతోనే పండ్లు, కూరగాయల విక్రయాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన మార్కెట్ యార్డులలో కొబ్బరికాయలను అమ్మడానికి అనుమతించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఘజియాబాద్‌కు చెందిన ‘మెసర్స్ త్రీ స్టార్ ఫ్రూట్ కంపెనీ’ అనే వ్యాపార సంస్థ సాహిబాబాద్‌లోని పండ్లు, కూరగాయల మార్కెట్ యార్డులో కొబ్బరికాయలు విక్రయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అలోక్ మాథుర్, జస్టిస్ అమితాబ్ కుమార్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వ్యాపారుల అభ్యర్థనను తోసిపుచ్చుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. ‘ఉత్తరప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ చట్టం–1964’ కింద కొబ్బరిని వ్యవసాయ నూనెగింజగా వర్గీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1995 జనవరి 30వ తేదీన తీసుకొచ్చిన సవరణ పూర్తిగా సమర్థనీయమని కోర్టు పేర్కొంది.
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వృక్షశాస్త్రం (Botany) ప్రకారం పచ్చి కొబ్బరి పండులా కనిపించినప్పటికీ, వాణిజ్యపరంగా , చట్టపరంగా చూస్తే కొబ్బరి నుంచి నూనె తీయడానికి ఎండు కొబ్బరి చిప్పలను (కొప్రా) అత్యధికంగా వినియోగిస్తారని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కేవలం పచ్చి కొబ్బరిని కొందరు పండులా తింటారనే కారణంతో మొత్తం కొబ్బరి కేటగిరీని పండుగా పరిగణించలేమని స్పష్టం చేశారు. అంతేకాకుండా, గతంలో అధికారులు నిబంధనల అమలులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఊరుకున్నంత మాత్రాన, వ్యాపారులకు పండ్లు, కూరగాయల మార్కెట్లో శాశ్వతంగా విక్రయించే హక్కు లభించదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
తాము అదనంగా యూజర్ ఛార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకురాగా, రుసుములు చెల్లించినా సరే నిబంధనలకు విరుద్ధంగా కూరగాయల మార్కెట్లో కొబ్బరి విక్రయాలకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. వ్యాపారులు సాహిబాబాద్‌లోని గోవింద్పురంలో ఉన్న ఆహార ధాన్యాల మార్కెట్‌కు వెళ్లి, అక్కడ నిర్ణీత రుసుములు చెల్లించి కొబ్బరికాయలను అమ్ముకోవచ్చని ధర్మాసనం సూచించింది.