ఛిద్రమైన బాల్యాన్ని మళ్లీ భద్రం చేయటం ఎలా?
Children
డాక్టర్ అశోక్ పరికిపండ్ల (రచయిత, ప్రముఖ సైకాలజిస్ట్, బాల్ వికాస్ అభియాన్ కన్వీనర్)
నవంబర్ 20న ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని..
బాలల హక్కులు, సంక్షేమం, విద్య, ఆరోగ్యం మరియు రక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 20న బాలల దినోత్సవాన్ని జరుపుతారు. కాని విద్యాలయాలు ఒత్తిడిని వడ్డించే కేంద్రాలుగా మారుతున్న ప్రస్తుత తరుణంలో చందమామ, పేదరాశి పెద్దమ్మ, కాశీ మజిలీ కథలు, అక్బర్ బీర్బల్, అరేబియన్ నైట్స్ ఇలా ఏ పుస్తకం గురించి అడిగినా నేటితరం బాలలు తెల్ల మొఖం వేస్తారు. ఆటలు ఆడితే సమయం వృధా అవుతుందని తల్లిదండ్రులు భావిస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లలకు శారీరిక వ్యాయామం లేకుండా పోతుంది. సెలవు రోజుల్లో కూడా పాఠ్యపుస్తకాలతో కుస్తీపట్టే పరిస్థితి నెలకొంది. దీంతో బాలలు ఒత్తిడికి గురవుతూ బాల్యంలోని మాధుర్యాన్ని కోల్పోతున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు ఆటపాటలకు దూరం అవుతూ, కార్పొరేట్ విద్యాసంస్థల మధ్య పోటీ కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు. తల్లితండ్రులు కూడా ర్యాంకులు మార్కులకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఆటలకు సమయమే ఉండటం లేదు. బాలల వికాసానికి దోహదపడే బాలల సాహిత్యం మాటే వినిపించడం లేదు. యాంత్రిక జీవనంలో జీవనం కొనసాగిస్తున్న బాల్యం, జాతీయస్థాయిలో మానవ హక్కులకు ఉన్న ప్రాచుర్యం పిల్లల హక్కుల విషయంలో కనిపించడం లేదు. వారిని చైతన్య పరిచే విషయంలో ప్రయత్నాలు అంతంత మాత్ర మే ఉన్నాయి. తల్లిదండ్రులకు పిల్లలపై సర్వహక్కులు ఉన్నాయని భావన నేటికీ కొనసాగుతూ ఉండటమే అందుకు తార్కాణం. అందుకే బాలల హక్కులు పిల్లల సంరక్షణ కోసం ఉద్యమాలు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్యసమితి 1989లో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది.
దీనికి ముందు కూడా పిల్లల హక్కులకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు కార్యక్రమాలు జరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదని చెప్పాలి. 1992లో భారత ప్రభుత్వం బాలల హక్కులకు సంబంధించిన బిల్లుపై సంతకం చేసింది. ప్రతి భారతీయుడికి విద్య ఒక ప్రాథమిక హక్కు, రాజ్యాంగం ప్రకారం మౌలిక స్థాయిలో ఉచిత విద్యను అందించాలి. ప్రాథమిక విద్య అందరికీ నిర్బంధ విద్య, ఉన్నత విద్య అన్నది ప్రతిభపై ఆధారపడి ఉంటుంది అందుకే పిల్లలందరికీ విద్య తప్పనిసరి.
ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం, నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంది. మరమ్మతులు చేపట్టాల్సిన శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలు, హాస్టల్లో నాణ్యమైన పౌష్టికాహార లేమి, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, సింగిల్ టీచర్ పాఠశాలల సమస్యలపై పాలకవర్గాలు దృష్టి సారించాలి.
ఏం చేద్దాం… ఒకనాటి ఆహ్లాదకరమైన పిల్లల ప్రపంచాన్ని పాడు చేసింది ఎవరు?.. మనమే, మార్కులు రాకపోతే పిల్లాడు పనికిరాడు అని నమ్మిన తల్లిదండ్రులు ఎవరు?.. మనమే, ఆట స్థలాల అమ్మేసి అపార్ట్మెంట్లు కట్టిన సమాజం మనదే, బడిని జైలులా, పరీక్షను యుద్ధంలా మార్చిన వ్యవస్థ మనదే….పిల్లలు చేతికి ఆట వస్తువు బదులు ఫోన్ ఇచ్చిన వాళ్ళం మనమే… మరి దీనిని బాగు చేయాల్సింది ఎవరు?!..మనమే….. చాలా పెద్ద పనులు అక్కర్లేదు… పిల్లాడు ఆడాలంటే ఆడనివ్వండి, ప్రశ్న అడిగితే విసుక్కోకుండా జవాబు చెప్పండి, మార్కులు తక్కువ వస్తే తిట్టకుండా దగ్గరికి తీసుకోండి, రోజుకు ఒక్క గంట అయినా ఫోన్ లేకుండా వాడితో కలిసి కూర్చోండి, బడిలో ఆటకు ఒక పీరియడ్ ఇవ్వండి, వాడి తప్పును క్షమించి వాడి కలను నమ్మండి. ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా ఒక్కసారి మనం మన పిల్లల ప్రపంచంలోకి వెళ్దాం… వాళ్లతో పాటు కింద కూర్చుందాం….వాళ్ళ కళ్ళతో ఈ లోకాన్ని చూద్దాం….పిల్లల ప్రపంచం ఇంకా చావలేదు, అది మనకోసం ఎదురుచూస్తోంది….పిల్లలకు తోడు పెద్దలు కలిస్తే అక్కడ మళ్ళీ నవ్వులు పూస్తాయి… మళ్ళీ పిల్లలు బతుకుతారు.