Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

వయస్సు పెరిగినా… మారని బాల్యపు నైజం!

Team Prajapaksham 17 Nov 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
వయస్సు పెరిగినా… మారని బాల్యపు నైజం!

Peter Pan Syndrome

సుధాకర్‌ ఏ వి

పెద్దవడం ఎవరికి ఇష్టం? ఎప్పటికీ చిన్నపిల్లలాగే ఉండిపోతే ఎంత బాగుండు! అని సరదాగా అనుకోవడం వేరు, నిజ జీవితపు బాధ్యతలను ఎదుర్కొనే ధైర్యం లేక శాశ్వతంగా బాల్యంలోనే ఆగిపోవాలని కోరుకోవడం వేరు. నేటి వేగవంతమైన, ఒత్తిడితో కూడిన ఆధునిక జీవితంలో చాలామంది యువతీయువకులు వయస్సు పెరిగినా మానసిక పరిపక్వతను సాధించలేకపోతున్నారు. వివాహం, ఉద్యోగ బాధ్యతలు, ఆర్థిక నిర్వహణ వంటి పెద్దల బాధ్యతలు చూసి భయపడి, వాస్తవ ప్రపంచం నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ మానసిక రుగ్మతనే ఆధునిక మనస్తత్వశాస్త్రంలో
‘పీటర్‌ పాన్‌ సిండ్రోమ్‌’ అని పిలుస్తున్నారు.
పీటర్‌ పాన్‌ సిండ్రోమ్‌తో బాధపడే వ్యక్తులు శారీరకంగా పూర్తి వయస్సు కలిగి ఉంటారు కానీ వారి ప్రవర్తనలో మాత్రం తీవ్రమైన బాల్యపు ధోరణులు కనిపిస్తాయి. ఏ చిన్న సమస్య ఎదురైనా తట్టుకునే మానసిక స్థైర్యం వీరికి ఉండదు. నిర్ణయా లు తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం చేయడం, బాధ్యతల నుంచి ఎప్పుడూ తప్పించుకోవాలని చూడటం, ఎల్లప్పుడూ ఇతరులపై (ముఖ్యంగా తల్లిదండ్రులపై) ఆధారపడి జీవించడం వీరి ప్రధాన లక్షణం. ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పటికీ, తమ సంపాదనను భవిష్యత్తు కోసం దాచుకోకుండా కేవలం క్షణికానందాల కోసం, విలాసాల కోసం ఖర్చు చేస్తుంటారు. దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకోవడానికి వీరు భయపడతారు.
ఈ మానసిక స్థితి వెనుక అనేక సామాజిక, కుటుంబ కారణాలు ఉంటాయి. ముఖ్యంగా బాల్యంలో తల్లిదండ్రులు పిల్లలను అతిగా గారాబం చేస్తూ, వారి పనులన్నీ స్వయంగా తామే చేస్తూ, ఎలాంటి కష్టనష్టాలు తగలకుండా పెంచడం దీనికి ప్రధాన కారణం కావచ్చు. దీనివల్ల ఆ పిల్లలు పెద్దయ్యాక నిజ జీవితపు సవాళ్లను ఎదుర్కొనే శక్తిని కోల్పోతారు. అలాగే, నేటి ఆధునిక డిజిటల్‌ యుగంలో సోషల్‌ మీడియా, వీడియో గేమ్‌లు, వర్చువల్‌ ప్రపంచం మనుషులను వాస్తవ దూరంగా ఉంచి, బాధ్యతారహితమైన సుఖవంతమైన కల్పిత ప్రపంచంలో బతికేలా ప్రేరేపిస్తున్నాయి. ఇది పీటర్‌ పాన్‌ సిండ్రోమ్‌ లక్షణాలు మరింత పెరగడానికి దోహదపడుతోం ది.
పీటర్‌ పాన్‌ సిండ్రోమ్‌ తో బాధపడుతున్న వ్యక్తులు లేదా ఆ మానసిక స్థితి నుంచి బయటపడాలనుకునేవారు ముందు గా వాస్తవ ప్రపంచాన్ని ధైర్యంగా అంగీకరించడం నేర్చుకోవాలి. జీవితం ఎల్లప్పుడూ ఆటవిడుపులా, ఎలాంటి బాధ్యతలు లేని కల్పిత లోకంలా ఉండదని, సమస్యలు, బాధ్యతలు జీవితంలో సహజ భాగమని గుర్తించాలి. బాల్యపు జ్ఞాపకాలను నెరుపడం తప్పు కాకపోయినా, అదే లోకంలో శాశ్వతంగా జీవించడాని కి ప్రయత్నించడం వర్తమాన వాస్తవాలను కోల్పోయేలా చేస్తుందని గ్రహించాలి. ఒకేసారి పెద్ద బాధ్యతలను మోయలేమనే భయంతో వాటికి దూరంగా పారిపోకుండా, ప్రణాళికాబద్ధంగా చిన్న చిన్న బాధ్యతల నుంచి శ్రీకారం చుట్టాలి. స్వయంగా గదిని సర్దుకోవడం, దైనందిన ఆర్థిక ఖర్చులను ప్లాన్‌ చేసుకోవడం, ఇంటి పనుల్లో చిన్న సహాయాలు చేయడం వంటివి అలవాటు చేసుకోవడం ద్వారా క్రమంగా పెద్ద బాధ్యతలను ఎదుర్కొనే మానసిక ధైర్యం కలుగుతుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వయంప్రతిపత్తిని పెంపొందించుకోవాలి. తప్పులు చేయడం ద్వారానే మనుషులు ఎదుగుతారనే సత్యాన్ని అర్ధం చేసుకుని, ఆ నిర్ణయాల బాధ్యతను తామే స్వీకరించాలి.