NHAI Alert: వాహనదారులకు NHAI అలర్ట్.. ఇన్సూరెన్స్ లేకుంటే రూ.10 వేల వరకు జరిమానా..
NHAI
NHAI Alert: వాహనానికి సరైన బీమా (ఇన్సూరెన్స్) లేకుండా రోడ్లపైకి వస్తే ఇకపై తప్పించుకోవడం అసాధ్యం. వాహనదారుల నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేసేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) టోల్‌ప్లాజాల వద్ద సరికొత్త ఆటోమేటెడ్ నిఘా వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. వాహనానికి ఇన్సూరెన్స్ గడువు ముగిసినా లేదా సరైన పాలసీ లేకపోయినా టోల్ గేట్ దాటగానే సంబంధిత యజమానుల మొబైల్ నంబరుకు నేరుగా ఎస్ఎంఎస్ ద్వారా హెచ్చరికలు వెళ్తాయి. ప్రస్తుతం ఢిల్లీలోని అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-2 (UER-2) పరిధిలోని ముండ్కా టోల్‌ప్లాజా వద్ద ఈ పైలట్ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
ఈ సాంకేతిక విధానం పూర్తిస్థాయిలో విజయవంతమై స్థిరపడిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారి టోల్‌ప్లాజాలకు విస్తరించాలని ఎన్హెచ్ఏఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టోల్ గేట్ దాటే ప్రతీ వాహనం రిజిస్ట్రేషన్ వివరాలు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) నిర్వహించే ‘వాహన్’ (VAHAN) డేటాబేస్‌తో నేరుగా అనుసంధానమై ఉంటాయి. టోల్ వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ బ్యాకెండ్ వ్యవస్థ ద్వారా ఆ వాహనానికి చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందో, లేదో క్షణాల్లో తనిఖీ చేస్తారు. ఒకవేళ పాలసీ గడువు ముగిసినట్లు తేలితే కొన్ని నిమిషాల్లోనే వాహనదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఎస్ఎంఎస్ సందేశం చేరుతుంది.
ఈ అలర్ట్ సందేశంలో వాహనం నంబర్, టోల్ దాటిన కచ్చితమైన సమయం , ఇన్సూరెన్స్ గడువు ముగిసిన తేదీ వివరాలు స్పష్టంగా ఉంటాయి. మోటారు వాహనాల చట్టం కింద భారీ జరిమానాల బారిన పడకుండా వెంటనే పాలసీని రెన్యూవల్ చేసుకోవాలని ఆ మెసేజ్‌లో సూచిస్తారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు న్యాయబద్ధంగా అందాల్సిన నష్టపరిహారం విషయంలో ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందులను పరిష్కరించడానికే కేంద్ర రవాణా శాఖ ఈ కఠిన చర్యలు తీసుకుంటోంది.
మోటారు వాహనాల చట్టం ప్రకారం పబ్లిక్ రోడ్లపై తిరిగే ప్రతీ వాహనానికి కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండటం తప్పనిసరి. చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే మొదటిసారి ప్రాథమిక ప్రీమియం మొత్తానికి మూడు రెట్లు లేదా రూ.5,000 (వీటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తం) జరిమానాగా విధిస్తారు. ఒకవేళ రెండోసారి కూడా మళ్లీ అదే ఉల్లంఘనకు పాల్పడితే బేస్ ప్రీమియంకు ఐదు రెట్లు లేదా గరిష్ఠంగా రూ.10,000 వరకు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వాహనదారులు ఎప్పటికప్పుడు తమ బీమా గడువును సరిచూసుకుని రెన్యూవల్ చేసుకోవడం శ్రేయస్కరం.