SC Verdict on Second Marriage: రెండో వివాహం ద్వారా పుట్టిన పిల్లలకూ తల్లి ఆస్తిలో హక్కు.. కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు..
supreme court
SC Verdict on Second Marriage: హిందూ మహిళల ఆస్తి హక్కులు, వారసత్వ వివాదాలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. మొదటి భర్త కుటుంబం ద్వారా సంక్రమించిన ఆస్తిపై సదరు హిందూ మహిళకు సంపూర్ణ యాజమాన్య హక్కులు లభించినట్లయితే, ఆమె రెండో వివాహం ద్వారా జన్మించిన పిల్లలు కూడా ఆ ఆస్తిని వారసత్వంగా పొందేందుకు పూర్తి అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలోని సుమారు 45 బిగాల వ్యవసాయ భూమి వారసత్వానికి సంబంధించి దశాబ్దాలుగా నలుగుతున్న వివాదంలో, మొదటి భర్త కుటుంబీకుల వాదనను తోసిపుచ్చుతూ, మహిళ రెండో పెళ్లి కుమారులకు అనుకూలంగా ధర్మాసనం తుది తీర్పునిచ్చింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. ఖజానో అనే మహిళకు తన మొదటి భర్త మౌజీ రామ్, కుమారుడు రామ్ చందర్ మరణానంతరం వారి కుటుంబం నుంచి సుమారు 45 బిగాల వ్యవసాయ భూమి సంక్రమించింది. ఆ తర్వాత కాలంలో ఆమె బాల్‌కిషన్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకోగా, ఆ దంపతులకు చంద్ రామ్, చందర్ భాన్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఖజానో మరణించిన అనంతరం ఆ 45 బిగాల భూమిపై వివాదం మొదలైంది. ఆ భూమి తమ పూర్వీకుల నుంచి వచ్చిందని, కాబట్టి తమకే చెందుతుందని మొదటి భర్త కుటుంబీకులు వాదించగా, తమ తల్లికి ఆ భూమిపై పూర్తి హక్కులు ఉన్నందున చట్టబద్ధ వారసులుగా తమకే దక్కాలని రెండో పెళ్లి కుమారులు న్యాయపోరాటానికి దిగారు.
‘సుల్తాన్ సింగ్ వర్సెస్ ఫైనాన్షియల్ కమిషనర్’ కేసులో ఈ న్యాయపరమైన చిక్కుముడిని సుప్రీంకోర్టు లోతుగా విశ్లేషించింది. 1956లో హిందూ వారసత్వ చట్టం అమల్లోకి రాకముందే ఖజానో ఆ భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవిస్తున్నారని, ఆ చట్టంలోని సెక్షన్ 14(1) ప్రకారం ఆమెకున్న పరిమిత హక్కులు కాస్తా సంపూర్ణ యాజమాన్య హక్కులుగా (Absolute Ownership) మారాయని కోర్టు పేర్కొంది. దీనివల్ల ఆమె కేవలం ఆ ఆస్తికి తాత్కాలిక సంరక్షకురాలిగా కాకుండా, పూర్తి స్థాయి స్వతంత్ర యజమానిగా గుర్తింపు పొందారని ధర్మాసనం వివరించింది.
ఢిల్లీ భూ సంస్కరణల చట్టం 1954 నిబంధనల ప్రకారం, సదరు మహిళ మరణించే నాటికి అమల్లో ఉన్న వ్యక్తిగత చట్టాల ఆధారంగానే వారసత్వం నిర్ణయించబడుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆమె ఆ భూమికి సంపూర్ణ యజమానిగా మారినందున, చట్టబద్ధ వారసులైన రెండో వివాహ కుమారులు చంద్ రామ్, చందర్ భాన్‌లకే ఆ ఆస్తి చెందుతుందని స్పష్టం చేసింది. ఒక ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందనే గత మూలాల కంటే, సదరు మహిళ మరణించే సమయానికి ఆ ఆస్తిపై ఆమెకున్న యాజమాన్య హక్కు స్వభావమే అత్యంత ప్రధానమని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.