Cauvery Water Dispute: తాగడానికి కూడా నీళ్లు లేవు.. కావేరీ జలాలపై కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు.. నీళ్లు ఉంటే తమిళనాడుకు తప్పకుండా ఇస్తామని ప్రకటన..
DK Shivakumar
Cauvery Water Dispute: కావేరి జలాల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో.. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమిళనాడును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక నుంచి 11 టీఎంసీల కావేరి జలాలను విడుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది.
ఈ తీర్పు అనంతరం డీకే శివకుమార్ స్పందిస్తూ, తమ వద్ద నీటి నిల్వలు అందుబాటులో ఉండి ఉంటే కచ్చితంగా తమిళనాడుకు నీటిని విడుదల చేసేవారమని తెలిపారు. అయితే, ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోనే తాగునీటి అవసరాలకు కూడా సరిపడా నీళ్లు లేని పరిస్థితి ఉందని, తన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు దారుణంగా పడిపోయాయని పేర్కొన్న ఆయన, నీటి లభ్యత లేకపోవడంతో ఈ ఏడాది కావేరి నదికి సంప్రదాయంగా సమర్పించే ‘బాగిన’ (పూజ) కార్యక్రమాన్ని కూడా తాను నిర్వహించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, కావేరి జలాలు , మేకెదాటు ప్రాజెక్టు అంశాలపై తమిళనాడు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణల గురించి పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని డీకే శివకుమార్ వెల్లడించారు.