India Facing Economic Crisis: యువతకు భవిష్యత్తుపై నమ్మకం లేదు.. భారత్ ఆర్థిక విపత్తు అంచున ఉంది.. అమెరికాలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
Rahul Gandhi Targets Modi Government on Foreign Relations
India Facing Economic Crisis: అమెరికా పర్యటనలో ఉన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక కొలంబియా యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు, మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం , ఎన్నికల ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక విధానాల్లోనే కొనసాగితే భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
మంగళవారం న్యూయార్క్ చేరుకున్న రాహుల్ గాంధీ, కొలంబియా వర్సిటీ కార్యక్రమంలో మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా భారతీయ ఆర్థిక నమూనా ఆశించిన ఫలితాలను ఇవ్వడం ఆపేసిందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం భీకర స్థాయిలో ఉందని, ఆర్థిక సంక్షోభం అంచుల్లో భారత్ ఉందన్న వాస్తవాన్ని మీడియా సహా పలు వర్గాలు పక్కన పెడుతున్నాయని ఆయన అన్నారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు (MSMEs), వ్యవసాయమే భారత ఆర్థిక వ్యవస్థకు అసలైన వెన్నుముక అని పేర్కొన్న రాహుల్, ఆ వెన్నుముకను దెబ్బతీశారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మేకిన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ వంటి పథకాలు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను కాపాడలేకపోయాయని, కేవలం సేవల రంగం ద్వారా అందరికీ ఉపాధి కల్పించడం అసాధ్యమని, ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయకుండా దేశం విజయం సాధించలేదని స్పష్టం చేశారు.
దేశంలో ప్రైవేటు పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయాయని, కేవలం అదానీ, అంబానీ వంటి కొద్దిమంది పెట్టుబడులు మాత్రమే కనిపిస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. సంపద, అధికారం ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల ఆదివాసీలు, దళితులు, రైతులు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నారని తెలిపారు. భారతీయ విద్యా వ్యవస్థలోనూ అనేక లోపాలు ఉన్నాయని, గత పదేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక అణచివేత ఫలితంగానే దేశంలో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
భారత ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన రాహుల్ గాంధీ, దీనిలో భాగంగానే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తప్పించాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎన్నికల వ్యవస్థను తిరిగి సుస్థిరం చేయాలని, లేదంటే ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. మరోవైపు, అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, పెరిగిన ఇంధన ధరల ప్రభావం వల్లే రిపబ్లికన్ పార్టీ ఓటమి పాలైందని ఆయన విశ్లేషించారు.
రాహుల్ వ్యాఖ్యలపై BJP తీవ్ర అభ్యంతరం:
కాగా, విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అధికార భారతీయ జనతా పార్టీ (భాజపా) తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్ఠను దిగజార్చేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని భాజపా అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలన్నీ భారత్‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తిస్తుంటే, రాహుల్ గాంధీ మాత్రం దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని భాజపా నేతలు మండిపడ్డారు.