Skip to content
ప్రపంచం › వార్తలు

El Niño Warning: 1950 తర్వాత అత్యంత తీవ్రమైన ఎల్‌నినో ముప్పు.. వచ్చే ఏడాదంతా భారీ వేడి, కరువులు, అకాల వర్షాలతో ప్రపంచానికి పెను ముప్పు..

jagan 15 Nov 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
El Niño Warning: 1950 తర్వాత అత్యంత తీవ్రమైన ఎల్‌నినో ముప్పు.. వచ్చే ఏడాదంతా భారీ వేడి, కరువులు, అకాల వర్షాలతో ప్రపంచానికి పెను ముప్పు..

Godzilla El Niño Threat

El Niño Warning: ప్రపంచ వాతావరణ సరళిని సమూలంగా ప్రభావితం చేసే ‘ఎల్‌నినో’ (El Niño) మరింత శక్తిమంతంగా మారుతోంది. 1950లో వాతావరణ రికార్డుల నమోదు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏర్పడిన అన్ని ఎల్‌నినోల కంటే ఇది అత్యంత బలమైనదిగా నిలిచే అవకాశం ఉందని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) తాజాగా హెచ్చరించింది. దీని తీవ్రత 2027 మార్చి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తూ, ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది.

ఎన్‌వోఏఏ క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భూమధ్యరేఖ వెంబడి పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో వేగంగా పెరుగుతున్నాయి. సాధారణ స్థితి కంటే 0.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితేనే ఎల్‌నినోగా పరిగణిస్తారు. అయితే, ప్రస్తుత అక్టోబర్–డిసెంబర్ , నవంబర్–జనవరి త్రైమాసికాల్లో మూడు నెలల సగటు ఉష్ణోగ్రత వ్యత్యాసం +2.5 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువగా నమోదయ్యేందుకు 60 శాతం అవకాశాలు ఉన్నాయని ఎన్‌వోఏఏ అంచనా వేసింది. 1950 తర్వాత ఇప్పటివరకు ఏ ఎల్‌నినో కూడా ఈ స్థాయికి చేరుకోలేదని, అంతేకాకుండా పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటికే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదు కావడం చరిత్రలో ఇదే తొలిసారని నిపుణులు వెల్లడించారు.

గత అక్టోబర్‌లోనే ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ఈ ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చేసిన హెచ్చరికలను తాజా గణాంకాలు ధృవీకరిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత దెబ్బతిని కింది పరిణామాలు చోటుచేసుకుంటాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు:

వర్షపాతంలో తీవ్ర వ్యత్యాసాలు: కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, పెను వరదలు సంభవించనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరవు కాటకాలు నెలకొనే ప్రమాదముంది.
రికార్డు స్థాయి వేడి & కార్చిచ్చులు: భూమి సగటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగి వడగాల్పులు తీవ్రమవుతాయి. పొడి వాతావరణం కారణంగా అడవుల్లో కార్చిచ్చులు (Wildfires) అధికంగా చెలరేగే ముప్పు పొంచి ఉంది.

ఎన్‌వోఏఏ అంచనాల ప్రకారం, 2027 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో కూడా ఈ ఎల్‌నినో ‘బలమైన లేదా అత్యంత బలమైన’ (Strong to Very Strong) దశలో కొనసాగడానికి 79 శాతానికి పైగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ముందస్తు పంట ప్రణాళికలు, వేసవి వడగాల్పులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వాతావరణ నిపుణులు వివిధ దేశాల ప్రభుత్వాలకు సూచిస్తున్నారు.

ట్యాగ్‌లు: Breaking News El Niño