Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

వైద్య విజ్ఞానానికి మౌన గురువు…‘దేహ దానం’

Prajapaksham 14 Nov 2026 0 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
వైద్య విజ్ఞానానికి మౌన గురువు…‘దేహ దానం’

వైద్య విజ్ఞానానికి మౌన గురువు…‘దేహ దానం’

రచయిత: షేక్‌ బాబా, ప్రజాసైన్స్‌ వేదిక.

ఇటీవల ప్రగతిశీల భావాలు కలిగిన నాయకులు ప్రొ.సాయిబాబా, జయధీర్‌ తిరుమలరావు సతీమణి శ్రీమతి నీలమ్మ మృతదేహాలను గాంధీ మెడికల్‌ కళాశాలకు దానంచేయడం సమాజానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. మరణానంతరం కూడా సమాజానికి సేవ చేయవచ్చని వారి నిర్ణయం చాటిచెబుతోంది. మరణంతో మనిషి భౌతిక జీవితం ముగిసినా, దేహ దానం ద్వారా సేవాభావం కొనసాగుతుంది. తమ దేహాలను వైద్య విజ్ఞానానికి అంకితం చేయడం ద్వారా భావి వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి మానవ శరీర నిర్మాణాన్ని ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అమూల్యమైన అవకాశం లభిస్తుంది. అవయవదానంపై ప్రజల్లో కొంతవరకు అవగాహన పెరిగినప్పటికీ, సంపూర్ణ దేహ దానం గురించి ఇంకా తగినంత అవగాహన లేదు. దీనిపై అనేక అపోహలు, సందేహాలు కొనసాగుతున్నాయి. వైద్య కళాశాలలు, వైద్య విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో దేహ దానంపై విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరం.


దేహదానం అంటే మరణానంతరం వైద్య విద్య, శస్త్రచికిత్స శిక్షణ, శాస్త్రీయ పరిశోధనల కోసం స్వచ్ఛందంగా తమ సంపూర్ణ శరీరాన్ని దానం చేయడం. వైద్య విద్యార్థులు మానవ శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి, వైద్య నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, పరిశోధనలు నిర్వహించడానికి దానం చేసిన మృతదేహాలు ఎంతో ఉపయోగపడతాయి. అనాటమీ విభాగంలోని డిసెక్షన్‌ హాల్‌లోకి తొలిసారి అడుగుపెట్టే వైద్య విద్యార్థికి దానం చేసిన మృతదేహం కేవలం అధ్యయన వస్తువు కాదు. అది ఒక మౌన గురువు. పాఠ్యపుస్తకాలు, డిజిటల్‌ నమూనాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభ్యసనకు తోడ్పడినప్పటికీ, మానవ శరీరాన్ని ప్రత్యక్షంగా అధ్యయ నం చేయడం ద్వారా లభించే అనుభవానికి అవి పూర్తిగా ప్రత్యామ్నాయం కాలేవు.


తమ మరణానంతరం దేహాన్ని దానం చేయాలనుకునే వారు జీవించి ఉన్నప్పుడే అంగీకార పత్రం లేదా దేహ దాన ప్రతిజ్ఞ పత్రాన్ని పూర్తిచేసి, గుర్తింపు పత్రాలు సమర్పించి, సాక్షుల సంతకాలు పొందడం ద్వారా తమ నిర్ణయాన్ని నమోదు చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేయడం కూడా అంతే ముఖ్యం. తద్వారా వారి చివరి కోరికను గౌరవించడానికి కుటుంబానికి అవకాశం ఉంటుంది. ముందస్తు నమోదు చేసుకోవడం మంచిదే అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో మరణించిన వ్యక్తి తరఫున కుటుంబ సభ్యులు కూడా సంబంధిత వైద్య కళాశాల నిబంధనలు, అంగీకార ప్రమాణాలకు అనుగుణంగా మృతదేహాన్ని దానం చేయవచ్చు. మరణం సంభవించిన వెంటనే కుటుంబ సభ్యులు సంబంధిత వైద్య కళాశాలను సంప్రదించాలి. సాధారణంగా మరణ ధ్రువీకరణ పత్రం, గుర్తింపు పత్రం, సమీప బంధువుల అంగీకారం వంటి పత్రాలు అవసరమవుతాయి. మృతదేహ సంరక్షణ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సి ఉంటుంది కాబట్టి సమాచారం అందించడం, తరలింపు ఏర్పాట్లు చేయడంలో ఆలస్యం జరగకూడదు.


మృతదేహాలను స్వీకరించేటప్పుడు వైద్య కళాశాలలు నిర్దిష్ట వైద్య, చట్టపరమైన, సంస్థాగత మార్గదర్శకాలను అనుసరిస్తాయి. కొన్ని అంటువ్యాధులు, మృతదేహం కుళ్లిపోవ డం, తీవ్ర గాయాలు, కాలిన గాయాలు, న్యాయపరమైన విచారణకు సంబంధించిన సమస్యలు వంటి అంశాలు మృతదేహ స్వీకరణకు ఆటంకం కలిగించవచ్చు. మృతదేహాన్ని స్వీకరించిన తరువాత అవసరమైన నమోదు ప్రక్రియ పూర్తి చేసి, ఎంబామింగ్‌ వంటి సంరక్షణ పద్ధతుల ద్వారా బోధన, పరిశోధనలకు అనువుగా భద్రపరుస్తారు. ఈ మొత్తం ప్రక్రియ లో అనాటమీ విభాగాలు దాత పట్ల గౌరవం, సున్నితత్వం, మానవీయ దృక్పథాన్ని ప్రదర్శించాలి. విద్య, పరిశోధనా అవసరాలను బట్టి మృతదేహాన్ని ఉపయోగించే వ్యవధి మారుతుంది. విద్యాపరమైన అవసరం పూర్తయిన తరువాత మిగిలిన అవశేషాలను సంబంధిత సంస్థాగత విధానాలు, అమల్లో ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా గౌరవప్రదంగా అంత్య క్రియలు నిర్వహిస్తారు.


దేశంలో వైద్య కళాశాలల సంఖ్య, వైద్య విద్యలో ప్రవేశా లు పెరుగుతున్న కొద్దీ మృతదేహాల అవసరం కూడా పెరుగుతోంది. అయితే స్వచ్ఛందంగా దానం చేసే మృతదేహాల సంఖ్య వైద్య విద్య అవసరాలకు అనుగుణంగా పెరగడం లేదు. క్యాడర్ల కొరత వల్ల మానవ శరీర నిర్మాణంపై ప్రత్యక్ష బోధన, శస్త్రచికిత్స శిక్షణ ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అందువల్ల స్వచ్ఛంద దేహదానాన్ని ప్రోత్సహించడం కేవలం మానవతా కార్యక్రమం మాత్రమే కాదు; వైద్య విద్య నాణ్యత ను, భావి వైద్యుల నైపుణ్యాన్ని పెంపొందించే సామాజిక పెట్టుబడి కూడా. తమ ఆత్మీయుల చివరి నిర్ణయం భావి వైద్యుల విద్యకు ఉపయోగపడుతుందని తెలుసుకోవడం, దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు కొంతైనా సంతృప్తిని, తమ ఆత్మీయుల సేవా వారసత్వం కొనసాగుతుందనే
భావనను కలిగిస్తుంది.


ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో స్వచ్ఛంద సంస్థల కృషి
మృతదేహ, అవయవదానాలపై అవగాహన పెంపొందించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కృషి చేస్తున్నారు. అనంతపురంలో 2009లో స్థాపించబడిన అనంత దేహదాత ల సంస్థ ఇప్పటివరకు వందమందికి పైగా వ్యక్తులు తమ దేహాలను దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ప్రోత్సహించింది. శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు కృషి చేస్తున్న ప్రజా సైన్స్‌ వేదిక కూడా దేహదానం, అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. డా.ముచ్చుకోట సురేష్‌ బాబు, బి.వి. రాధాకృష్ణమూర్తి, టి స్పార్క్‌ సిఇఒ షేక్‌ బాబా, జి.ఈశ్వర లింగం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తూ దేహదానం ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులో తిక్కవరపు సుకుమార్‌ రెడ్డి ప్రారంభించిన పినాకిని దేహదాతల సంస్థ కూడా దేహదాన ఉద్యమాన్ని ప్రోత్సహిస్తోంది. విశాఖలో గూడూరి సీతామహాలక్ష్మితో అనుబంధం గా ఉన్న మరో సంస్థ కూడా ఈ అంశంపై అవగాహన కల్పించడంలో తన వంతు కృషి చేస్తోంది. ఇలాంటి ప్రయత్నాలు శాస్త్రీయ అవగాహన, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యం ఎంత కీలకమో నిరూపిస్తున్నాయి.


జీవితాన్ని దాటి సాగే సేవా వారసత్వం
సమాజానికి ఒక వ్యక్తి అందించగల అత్యంత నిస్వార్థమైన కానుకల్లో దేహదానం ఒకటి. దానం చేసిన మృతదేహాల ద్వారా భావి వైద్యులు జ్ఞానాన్ని, నైపుణ్యాలను సంపాదించి భవిష్యత్తులో అసంఖ్యాక రోగులకు సేవలందించే అవకాశం పొందుతారు. మృతులు జీవులకు బోధిస్తారు అనే మాట దేహదానం యొక్క గొప్పతనాన్ని చాటిచెబుతుంది.


ప్రతి దేహదానం వెనుక త్యాగం, విశ్వాసం, మానవాళి సంక్షేమం పట్ల నిబద్ధత దాగి ఉంటాయి. అందువల్ల దేహదానాన్ని కేవలం వైద్య అవసరంగా కాకుండా, శాస్త్రీయ పురోగతిని మానవీయ విలువలతో మేళవించే ఒక సామాజిక ఉద్యమంగా గుర్తించాలి. కుటుంబాల్లో బహిరంగ చర్చలు, ప్రజల్లో విస్తృత అవగాహన, వైద్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యతాయుత మార్గదర్శకత్వం ద్వారా మరింతమంది ఆలోచనాత్మకంగా దేహదాన నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహించాలి. జీవితం ముగిసినా సేవ ఆగిపోవాల్సిన అవసరం లేదు. దానం చేసిన మృతదేహం ఒక మౌన గురువుగా మారి తరతరాల వైద్యులకు విద్యాబోధన చేస్తుంది. మరణాన్ని దాటి కూడా మానవ సేవా వారసత్వాన్ని సజీవంగా ఉంచుతుంది.


ట్యాగ్‌లు: editorial