Cancer Drug Price Cut: క్యాన్సర్ రోగులకు ఊరట.. రూ.40,421 నుంచి రూ.2,720కి తగ్గిన క్యాన్సర్ మందు.. ఏదో తెలుసా?
US Pharma Tariff
Cancer Drug Price Cut: క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న కోట్లాది మంది రోగులకు , వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ఊరటను ప్రకటించింది. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA) పలు కీలకమైన క్యాన్సర్ ఔషధాల గరిష్ఠ చిల్లర ధరలను (MRP) భారీగా సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా నిర్ణయం ప్రకారం, కొన్ని రకాల క్యాన్సర్ మందుల ధరలు ఏకంగా 93 శాతం వరకు తగ్గడం విశేషం. సవరించిన ఈ కొత్త ఔషధ ధరలు 2026 నవంబర్ 9వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి రానున్నాయి.
ఈ భారీ ధరల తగ్గింపు వెనుక ప్రభుత్వం చేపట్టిన ట్రేడ్ మార్జిన్ విధానం ప్రధానమైన కారణం. నాన్-షెడ్యూల్డ్ విభాగంలో ఉన్న 137 రకాల క్యాన్సర్ నివారణ మందులపై పంపిణీదారులు (Distributors), హోల్‌సేలర్లు, ఆసుపత్రులు , ఫార్మసీ మధ్యవర్తులు వసూలు చేసే ట్రేడ్ మార్జిన్‌ను గరిష్ఠంగా 30 శాతానికి మాత్రమే పరిమితం చేస్తూ ఎన్పీపీఏ నిబంధనలు విధించింది. దీని ప్రభావంతో మొత్తం 543 క్యాన్సర్ మందుల బ్రాండ్లు , ప్యాక్‌ల ఎంఆర్పీ ధరలు గణనీయంగా పడిపోయాయి. ఉదాహరణకు, బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో వాడే ‘పాల్బోప్రో 125 ఎంజీ’ (Palbopro 125mg) 21 క్యాప్సూల్స్ ప్యాక్ ధర గతంలో రూ. 40,421 ఉండగా, ప్రస్తుతం అది రూ. 2,720 కే లభించనుంది. అలాగే కీమోథెరపీలో వాడే ‘థియోటెపా 100 ఎంజీ’ (Thiotepa 100mg) ఇంజెక్షన్ ప్రామాణిక ధర రూ. 80,071.86 నుంచి ఏకంగా రూ. 7,150.33కి తగ్గడంతో రోగులకు ఒక్క వైయల్ (Vial) పైనే దాదాపు రూ. 72,922 వరకు ఆదా కానుంది.
అయితే, ఈ మార్జిన్ పరిమితి చర్య అన్ని రకాల క్యాన్సర్ మందులపై ఒకే రకమైన ప్రభావాన్ని చూపలేదు. విశ్లేషణల ప్రకారం, సవరించిన 543 ఔషధ రూపాల్లో 146 మందుల ధరలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ముఖ్యంగా ఇమ్యునోథెరపీలో ఉపయోగించే అత్యంత ఖరీదైన బ్రాండ్ ‘కీట్రూడా’ (Keytruda) ఎంఆర్పీ ధర రూ. 2,16,500 వద్దే కొనసాగుతుండగా, ‘అవాస్టిన్’ (Avastin) వంటి ఇతర ప్రాధాన్య మందుల ధరల్లోనూ పెద్దగా వ్యత్యాసం కనిపించలేదు. ఔషధ సరఫరా వ్యవస్థలో మధ్యవర్తుల లాభాల మార్జిన్ ఎక్కువగా ఉన్న మందులపై ఈ నిర్ణయం బాగా పనిచేసినప్పటికీ, కంపెనీ ప్రాథమిక ఉత్పత్తి ధర ఆధారంగా నిర్ణయించే మందులపై దీని ప్రభావం పరిమితంగానే ఉంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల క్యాన్సర్ రోగులకు దేశవ్యాప్తంగా ఏటా రూ. 2,500 కోట్ల వరకు వైద్య ఖర్చులు ఆదా అవుతాయని కేంద్రం అంచనా వేసింది. అయితే ఈ ఆదా ప్రయోజనం రోగి వ్యాధి తీవ్రత, వైద్యులు సూచించిన బ్రాండ్, ఆయా ఆసుపత్రులు కొత్త ధరల జాబితాను అమలు చేసే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. నిరంతరం పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో కొన్ని మందుల ధరలైనా భారీగా తగ్గడం కొంతవరకు ఊరటనిచ్చినప్పటికీ, అత్యంత ఖరీదైన ప్రాణరక్షక మందులను కూడా సామాన్యులకు తక్కువ ధరకే లభ్యమయ్యేలా మరిన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజారోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.