Skip to content
బిజినెస్ › వార్తలు

New ₹1,000 Note With Temple Image? భారత్‌లో కొత్త రూ.1,000 నోటు విడుదల కానుందా.. కేంద్ర ప్రభుత్వ వివరణ ఇదే..

jagan 27 Oct 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
New ₹1,000 Note With Temple Image? భారత్‌లో కొత్త రూ.1,000 నోటు విడుదల కానుందా.. కేంద్ర ప్రభుత్వ వివరణ ఇదే..

New ₹1,000 Note With Temple Image?

New ₹1,000 Note With Temple Image? దేశంలో త్వరలోనే కొత్త రూ.1,000 నోటు విడుదల కానుందంటూ సోషల్ మీడియా వేదికల్లో ఊపందుకున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం తీవ్రంగా స్పందించింది. వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా అవాస్తవాలని స్పష్టం చేసింది. కొత్త రూ.1,000 నోటు విడుదల లేదా చెలామణిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పసుపు రంగు డిజైన్‌తో కూడిన కొత్త రూ.1,000 నోటు చిత్రాలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ కొత్త నోటును ప్రభుత్వం ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిందని, మరికొద్ది రోజుల్లోనే బ్యాంకుల ద్వారా అందుబాటులోకి రానుందని నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో నెటిజన్లలో మళ్లీ కొత్త నోట్లు వస్తున్నాయా అనే తీవ్ర చర్చ మొదలైంది.

ఈ తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ‘ఎక్స్’ వేదికగా అధికారిక వివరణ జారీ చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు కల్పితాలని తేల్చిచెప్పింది. ప్రజలు ఇటువంటి పుకార్లను నమ్మి మోసపోవద్దని, అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. ఆధారం లేని నిరూపితం కాని వార్తలను, నోట్ల చిత్రాలను ఇతరులకు షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

కాగా, ప్రస్తుతం దేశంలో ఆర్‌బీఐ మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్‌ కింద రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200 , రూ.500 నోట్లను మాత్రమే చట్టబద్ధమైన చెల్లింపుల కోసం చెలామణిలో ఉంచింది. 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు (Demonetisation) సమయంలో అప్పటి పాత రూ.500, రూ.1,000 నోట్లు చెల్లుబాటును కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నూతన డిజైన్‌తో రూ.500 నోటును ప్రవేశపెట్టినప్పటికీ, రూ.1,000 నోటును మాత్రం పునరుద్ధరించలేదు.

ఇక పెద్ద నోట్ల రద్దు సమయంలో తీసుకొచ్చిన రూ.2,000 నోటును కూడా ఆర్‌బీఐ మే 2023లోనే చెలామణి నుంచి ఉపసంహరించుకునే ప్రక్రియను ప్రారంభించి దాదాపు పూర్తి చేసింది. ఈ క్రమంలో రూ.1,000 నోటు మళ్లీ వస్తోందంటూ జరుగుతున్న ఎలాంటి పోస్టులనైనా ప్రజలు నమ్మవద్దని అధికారులు కోరారు.