Saudi Arabia-Houthi Tensions: దాడులు ఆపితే ఒక బిలియన్ డాలర్లు ఇస్తాం.. యెమెన్‌లోని హూతీలకు ఆఫర్ ఇచ్చిన సౌదీ అరేబియా..
Saudi Airport Attacks
Saudi Arabia-Houthi Tensions: సౌదీ అరేబియా , యెమెన్‌లోని హూతీ (Houthi) తిరుగుబాటుదారుల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పోరు పశ్చిమాసియా (మధ్యప్రాచ్యం) ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన వేళ ఒక సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. సౌదీ అరేబియాలోని కీలక మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలు , చమురు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని హూతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో దాడులు తీవ్రతరం చేయడంతో సంపన్న దేశమైన సౌదీ భారీగా ప్రాణ, ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది.
మరోవైపు హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా పయనించే చమురు ట్యాంకర్లపై ఇరాన్ సృష్టిస్తున్న ఆటంకాల వల్ల గల్ఫ్ దేశాల నుంచి అంతర్జాతీయ చమురు ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ , ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ హూతీలతో కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ వార్తాసంస్థలు వెల్లడించాయి.
ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం, హూతీలు తమ దేశ భూభాగంపై జరిపే దాడులను సంపూర్ణంగా నిలిపివేస్తే వారికి 1 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 9,500 కోట్లు) నిధుల రూపంలో అందజేస్తామని సౌదీ అరేబియా ప్రతిపాదించింది. ఇరాన్ మధ్యవర్తిత్వంలో సాగుతున్న ఈ శాంతి చర్చల్లో భాగంగా సదరు నిధులను ఇరాన్ ద్వారానే హూతీ తిరుగుబాటుదారులకు బదిలీ చేసే అవకాశం ఉందని సమాచారం.
ఈ శాంతి ఒప్పంద ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇటీవల సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ ప్రత్యేకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్నారు. ఆయన ప్రయాణించిన ప్రత్యేక సైనిక రవాణా విమానంలోనే హూతీలకు అందించాల్సిన నిధులను తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ నగదు బదిలీ అంశాన్ని సౌదీ అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
ఇరాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అత్యున్నత స్థాయి ప్రాంతీయ చర్చల్లో టర్కీ ఇంటెలిజెన్స్ చీఫ్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ , ఇరాన్ ఇస్లామిక్ విప్లవాత్మక గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. గతంలో యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా హూతీలకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా ప్రత్యక్షంగా రక్షణ దళాలను దింపినప్పటి నుంచి ఇరువర్గాల మధ్య సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. విపరీతంగా పెరుగుతున్న ఆర్థిక నష్టం, చమురు రవాణా భద్రతను దృష్టిలో ఉంచుకుని సౌదీ అరేబియా శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేస్తోంది.