Israel Parliament Elections: రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు.. కింగ్మేకర్లుగా మారనున్న చిన్న పార్టీలు.. నెతన్యాహు వర్సెస్ ఐసెన్‌కోట్ మధ్యనే పోరు..
2026 Israel elections
Israel Parliament Elections: మధ్యప్రాచ్యంలో కీలక పరిణామాలకు వేదికగా నిలిచిన ఇజ్రాయెల్ దేశ నూతన ప్రధానమంత్రి ఎవరో తేల్చేందుకు అక్టోబర్ 27న పార్లమెంట్ (నెస్సెట్) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేదా ప్రతిపక్ష నేతలు గాడి ఐసెన్‌కోట్, నఫ్తాలి బెన్నెట్, యూయిర్ లాపిడ్లలో ఎవరైనా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొత్తం 120 పార్లమెంట్ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో, అక్టోబర్ 7నాటి హమాస్ దాడి సమయంలో చోటుచేసుకున్న తీవ్ర భద్రతా వైఫల్యాలు, దేశంలో ఆందోళనకరంగా పెరుగుతున్న జీవన వ్యయం , అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతిన్న ఇజ్రాయెల్ ప్రతిష్ఠ ప్రధాన ఎన్నికల అంశాలుగా మారాయి.
ప్రస్తుతం ప్రధాని నెతన్యాహు నేతృత్వంలోని అధికారిక కూటమిలో ఆయన సొంత లికుడ్ పార్టీతో పాటు జాతీయ భద్రతా మంత్రి ఇతమార్ బెన్-గ్విర్‌కు చెందిన అతివాద ‘ఓట్జా యెహుదిత్’, ఆర్థిక మంత్రి బెజాలెల్ స్మోట్రిచ్ పార్టీ , షాస్, యునైటెడ్ తోరా జడాయిజం వంటి అల్ట్రా-ఆర్థడాక్స్ మతతత్వ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి.
ఈ ఎన్నికల్లో ‘యషార్’ పార్టీ అగ్రనేత గాడి ఐసెన్‌కోట్ , ‘బేయాహాద్’ పార్టీ నాయకుడు నఫ్తాలి బెన్నెట్ ప్రధానమంత్రి రేసులో నెతన్యాహుకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవల వెలువడిన పలు సర్వేలు , పాలీ మార్కెట్ (PolyMarket) విశ్లేషణల ప్రకారం, ప్రధాని పదవి దక్కించుకునే అవకాశాల్లో గాడి ఐసెన్‌కోట్ 51 శాతం మద్దతుతో నెతన్యాహు (28 శాతం) కంటే స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జాతీయ మీడియా సంస్థ ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ సర్వేల ప్రకారం.. ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి అత్యధికంగా 54 స్థానాలు దక్కే అవకాశం ఉండగా, నెతన్యాహు మితవాద, అతివాద కూటమికి 48 నుంచి 49 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశారు.
120 మంది సభ్యులుండే నెస్సెట్‌లో మేజిక్ ఫిగర్ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. ఈ లెక్కన ప్రస్తుత సూచికల ప్రకారం ఏ ఒక్క ప్రధాన కూటమికి సొంతంగా స్పష్టమైన మెజారిటీ లభించే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు అరబ్ జాతీయుల ప్రాబల్యం ఉన్న పార్టీలు దాదాపు 13 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్నందున, ఎన్నికల అనంతరం వారు ఎటువైపు మొగ్గుచూపుతారనేది అత్యంత కీలకంగా మారింది.
ఇజ్రాయెల్‌లో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ప్రధాని నెతన్యాహుకు తన పాత మిత్రపక్షాలైన మితవాద, అతివాద , ఆర్థడాక్స్ పార్టీల మద్దతు మళ్లీ అవసరం అవుతుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇతర చిన్న పార్టీలను, స్వతంత్రులను తమ కూటమిలో కలుపుకోవాల్సి ఉంటుంది. అరబ్ నేతృత్వంలోని పార్టీలను కూటమిలోకి తీసుకునే విషయంలో ప్రతిపక్ష నాయకులు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, ఆ పార్టీల మద్దతును నెతన్యాహు బహిరంగంగానే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో అక్టోబర్ 27 పోలింగ్ , ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే ఇజ్రాయెల్ తదుపరి ప్రధాని పీఠం ఎవరికి దక్కుతుందనేది స్పష్టం కానుంది.