Mukesh Ambani Wipes Away Tears: ముఖేష్ అంబానీ ఎమోషనల్ వీడియో ఇదిగో..ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తూ స్టాక్ మార్కెట్లోకి గ్రాండ్‌గా జియో ఎంట్రీ..
Mukesh Ambani Wipes Away Tears
Mukesh Ambani Wipes Away Tears: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, కోటీశ్వరుడు ముఖేష్ అంబానీకి జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్ వేడుకలో ఒక అరుదైన భావోద్వేగభరిత క్షణం ఎదురైంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలో మహావృక్షంలా విస్తరించిన జియో ప్లాట్‌ఫామ్స్ సంస్థ బుధవారం (అక్టోబర్ 28) దేశీయ స్టాక్ మార్కెట్లలో తొలిసారిగా అడుగుపెట్టిన సందర్భంగా ముంబైలోని స్టాక్ ఎక్స్ఛేంజ్ వేదికగా ప్రత్యేక లిస్టింగ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు అనంత్ అంబానీ ప్రసంగిస్తూ.. రిలయన్స్ స్థాపకుడు ధీరూభాయ్ అంబానీ వారసత్వాన్ని, డిజిటల్ విప్లవంలో జియో సాగించిన ప్రయాణాన్ని, దానికి వెనుక ఉన్న కష్టాన్ని ప్రస్తావిస్తున్న సమయంలో ముఖేష్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. ఆత్మీయమైన ఈ సన్నివేశంలో ఆయన సతీమణి నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్ , కుమార్తె ఇషా అంబానీలు పాల్గొని ఉత్సాహపరిచారు.
21.36 శాతం ప్రీమియంతో లిస్టింగ్ – రూ. 12.5 లక్షల కోట్లకు చేరిన మార్కెట్ విలువ
జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు బుధవారం నాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో బంపర్ లిస్టింగ్ లాభాలతో ఘనమైన అరంగేట్రం చేశాయి. ఐపీఓ ద్వారా ఒక్కో షేరు ఇష్యూ ధరను రూ. 1,119 గా నిర్ణయించగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లలో ఏకంగా రూ. 1,358 వద్ద షేర్లు ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దీంతో ఇష్యూ ధర కంటే ఇన్వెస్టర్లకు 21.36 శాతం మేర ప్రీమియం లభించింది.
ఈ అద్భుతమైన లిస్టింగ్‌తో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) సుమారు రూ. 12.5 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారత స్టాక్ మార్కెట్లలోనే రెండో అతిపెద్ద కంపెనీగా జియో ప్లాట్‌ఫామ్స్ నిలవగా.. ఈ క్రమంలో ప్రసిద్ధ కంపెనీలైన భారతీ ఎయిర్టెల్ , హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లను అధిగమించడం గమనార్హం.
దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ – 22.19 రెట్ల సబ్స్క్రిప్షన్
ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్ దాదాపు రూ. 30,213 కోట్ల భారీ నిధులను సమీకరించి, భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓ (IPO)గా సరికొత్త చరిత్ర సృష్టించింది. అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగిసిన ఈ ఇష్యూకి దేశీయ , అంతర్జాతీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి విపరీతమైన ఆదరణ లభించడంతో మొత్తం 22.19 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయింది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలం తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి ఒక ప్రధాన అనుబంధ సంస్థ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించి లిస్ట్ కావడం భారత క్యాపిటల్ మార్కెట్లలో మైలురాయిగా నిలిచింది.