UP MLC Polls: ప్రధాని మోదీ కంచుకోట వారణాసిలో బీజేపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి లాల్ బిహారీ యాదవ్ ఘనవిజయం.. పూర్తి వివరాలు కథనంలో..
ఉత్తరాదిన మోడీ ఇమేజ్ డామేజ్..? కాక్రోచ్ ఉద్యమం బిజెపిని అంతలా దెబ్బ తీసిందా..?
UP MLC Polls: ఉత్తర ప్రదేశ్ శాసనమండలిలోని 11 స్థానాలకు (5 పట్టభద్రులు, 6 ఉపాధ్యాయ నియోజకవర్గాలు) జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత రసవత్తరంగా సాగుతోంది. మొత్తం 11 స్థానాలకు గాను ఇప్పటికే వెలువడిన ఫలితాలు, స్పష్టమైన ఆధిక్యాల ఆధారంగా భారతీయ జనతా పార్టీ (BJP), ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (SP) ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 2027 బిహార్, యుపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ మండలి పోరు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.
ఇప్పటివరకు వెలువడిన వివరాల ప్రకారం బీజేపీ నాలుగు ప్రధాన ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకుని తన బలాన్ని నిరూపించుకుంది. మీరట్ ఉపాధ్యాయ స్థానం నుంచి శ్రీచంద్ శర్మ, మీరట్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి దినేష్ కుమార్ గోయల్ విజయం సాధించారు. బరేలీ-మొరాదాబాద్ ఉపాధ్యాయ స్థానం నుంచి డాక్టర్ హరి సింగ్ ధిల్లాన్, లక్నో ఉపాధ్యాయ స్థానం నుంచి ఉమేష్ ద్వివేది వరుసగా గెలుపొంది తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా.. ఆగ్రా గ్రాడ్యుయేట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి మానవేంద్ర ప్రతాప్ సింగ్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో గణనీయమైన విజయాలను సాధిస్తూ బీజేపీకి గట్టి పోటీనిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి ఉపాధ్యాయ స్థానంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ఎస్పీ అభ్యర్థి లాల్ బిహారీ యాదవ్ ఘనవిజయం సాధించారు. అంతేకాకుండా ఆగ్రా ఉపాధ్యాయ స్థానాన్ని ఎస్పీ అభ్యర్థి డాక్టర్ ఆకాష్ అగర్వాల్ దక్కించుకోగా, అలహాబాద్-ఝాన్సీ గ్రాడ్యుయేట్ స్థానంలో ఎస్పీ అభ్యర్థి డాక్టర్ మాన్ సింగ్ యాదవ్ విజయం సాధించారు. ఇది కాకుండా వారణాసి గ్రాడ్యుయేట్ స్థానంలో ఎస్పీ అభ్యర్థి అశుతోష్ సిన్హా, లక్నో గ్రాడ్యుయేట్ స్థానంలో కాంతి సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వగృహ ప్రాంతమైన గోరఖ్‌పూర్-ఫైజాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు అత్యంత అనిశ్చితికి దారితీసింది. ప్రాథమిక రౌండ్లలో వెనుకబడినప్పటికీ, తదుపరి రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ధృవ్ కుమార్ త్రిపాఠీ ఆధిక్యంలోకి వచ్చారు. అయితే లెక్కింపు ప్రక్రియలో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఎస్పీ అభ్యర్థి సంజయన్ త్రిపాఠీ, స్వతంత్ర అభ్యర్థి రాజీవ్ యాదవ్ కౌంటింగ్‌ను బహిష్కరించి నిరసన చేపట్టారు. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ పద్ధతి ప్రకారం ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుండటంతో తుది ఫలితం ఆలస్యమవుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు ఉత్తర ప్రదేశ్ రాబోయే రాజకీయ సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.