సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం సీపీఐ భారీ మానవహారం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం సీపీఐ భారీ మానవహారం
ఓట్లు కోల్పోయిన ఓటర్లకు సంఘీభావం
జంతర్ మంతర్ ప్రజావేదికను తిరిగి తెరవాలి
సర్ ప్రక్రియను నిలిపివేయాలి
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా డిమాండ్
ప్రజావిశ్వాసం కోల్పోయిన జ్ఞానేశ్ కుమార్‌కు పదవిలో కొనసాగించే నైతిక హక్కు లేదని విమర్శ
‘జంతర్ మంతర్ అనేది ప్రజలు తమ ప్రజాస్వామ్యబద్ధమైన నిరసన హక్కును ప్రతిబింబించే ఒక చారిత్రక ప్రదేశం. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా అసమ్మతి వ్యక్తం చేయకుండా అడ్డుకునేందుకు ఈ ప్రదేశంలో అనుమతి నిరాకరించడం అంటే, ప్రజా ఉద్యమాల పట్ల ప్రభుత్వానికి ఎంతగా అసహనం పెరిగిపోయిందో అర్థమవుతోంది.
ప్రజల నిరసన హక్కును ఒక పద్ధతి ప్రకారం అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.’ – డి. రాజా
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ చాటున పేర్లు తొలగించిన ఓటర్లకు సంఘీభావంగా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) న్యూఢిల్లీలో వేలాదిమందితో అపూర్వ స్థాయిలో భారీ మానవహారం నిర్మించింది. మంగళవారం వేలాదిమంది కార్యకర్తలు, పార్టీ నాయకులు, పౌర సంఘాలు, సంస్థలు పాల్గొన్న ఈ మానవహార కార్యక్రమానికి ప్రజల నుంచి అఖండమైన స్పందన లభించింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఇతర ప్రజా డిమాండ్లు పరిష్కరించాలని సీపీఐ కోరింది. నిష్కారణంగా ఓట్లు కోల్పోయిన ఓటర్లకు సంఘీభావం ప్రకటిస్తూ సీపీఐ కేంద్ర కార్యాలయం అజయ్ భవన్ నుంచి ఐటీఓ వరకు వేలాదిమంది ఈ మానవహారాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా మాట్లాడుతూ, జ్ఞానేశ్ కుమార్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, ఇక ఎంతమాత్రం ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిలో కొనసాగించే నైతిక హక్కు ఆయనకు లేదని అన్నారు. ఆ పదవిలో కొనసాగడం, ఎన్నికల ద్వారా పాలకులను నియమించుకునే ప్రజాస్వామ్య వ్యవస్థకు పెద్ద ప్రమాదమని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా జంతర్ మంతర్‌ను ప్రజలకు నిరసన తెలియజేసే ప్రదేశాల జాబితా నుంచి తొలగించడాన్ని మానవహారం తీవ్రంగా ఖండించింది. తక్షణం జంతర్ మంతర్‌ను తెరవాలని, ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ పేరుతో చేపట్టిన ప్రక్రియను వెనక్కు మళ్లించాలని కోరుతూ వేలాదిమందితో చేతులు కలిపి సీపీఐ ఈ మానవహారాన్ని నిర్మించింది.
ఒక క్రమపద్ధతిలో పౌరులను ఓటు హక్కుకు దూరం చేయడంతోపాటు, ఓటు వేసే ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కుపై దాడికి వ్యతిరేకంగా దేశంలో పెరుగుతున్న ప్రజాగ్రహాన్ని ఈ మానవహారం ప్రతిబింబించింది. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
“జంతర్ మంతర్ అనేది ప్రజలు తమ ప్రజాస్వామ్యబద్ధమైన నిరసన హక్కును ప్రతిబింబించే ఒక చారిత్రక ప్రదేశం. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా అసమ్మతి వ్యక్తం చేయకుండా అడ్డుకునేందుకు ఈ ప్రదేశంలో అనుమతి నిరాకరించడం అంటే, ప్రజా ఉద్యమాల పట్ల ప్రభుత్వానికి ఎంతగా అసహనం పెరిగిపోయిందో అర్థమవుతోంది. ప్రజల నిరసన హక్కును ఒక పద్ధతి ప్రకారం అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
ప్రజలకు ఎన్నికల హక్కులను, వారి హక్కులను తెలియజేయడానికి, వారికి జరిగిన అన్యాయాన్ని తెలియజేయడానికి గొంతెత్తి నినదించే హక్కును తిరస్కరిస్తే ప్రజాస్వామ్యం మనుగడ సాగించదని సీపీఐ ఉద్ఘాటించి చెబుతున్నది.
స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం భారత ఎన్నికల సంఘానికి రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు అప్పగించారు. కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం నిబద్ధత, విశ్వాసం కోల్పోయి అసాధారణ సంక్షోభంలో కూరుకుపోయింది.
ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ ప్రక్రియను రద్దు చేయాలి, ఓటర్ల జాబితాలను పాత విధానంలో పునరుద్ధరించాలి, జంతర్ మంతర్‌ను పునఃప్రారంభించాలి. దేశ ప్రజాస్వామ్య విస్తార ప్రయోజనాలను ఆశించి, రాజ్యాంగబద్ధమైన జవాబుదారీతనాన్ని నిలబెట్టేందుకు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసి తీరాలి” అని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం తన ప్రకటనలో డిమాండ్ చేసింది.
ఈ మానవహారంలో డి. రాజాతోపాటు సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అమర్జీత్ కౌర్, రాజ్యసభ సభ్యుడు పి. సంతోష్ కుమార్, రామకృష్ణ పాండా, డా. గిరీశ్ శర్మ, అన్నీ రాజా, కె. ప్రకాశ్ బాబు, కె. రామకృష్ణ, పార్లమెంటులో సీపీఐ సభ్యుడు పి.పి. సునీర్, సీపీఐ ఢిల్లీ కార్యదర్శి, జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రొఫెసర్ దినేశ్ వర్ష్న, ఎన్ఎఫ్ఏడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి నిషా సిధు, ఏఐకేఎస్ అధ్యక్షుడు రాజన్ కృష్ణసాగర్, బీకేఎంయూ కార్యదర్శి వి.ఎస్. నిర్మల్, ఏఐవైఎఫ్ అధ్యక్షుడు రౌషన్ కుమార్ సిన్హా, ఏఐవైఎస్ ప్రధాన కార్యదర్శి సుఖిందర్ మహేసరి, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు విరాజ్ దేవాంగ్ తదితరులు పాల్గొన్నారు. వేలాదిమంది ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, కార్మిక సంఘాలతో కలిసి ఈ మానవహార కార్యక్రమంలో పాల్గొన్నారు.
అన్ని ప్రజాస్వామ్య శక్తులు, రాజకీయ పార్టీలు, పౌర సంఘ సంస్థలు ఈ పోరాటంలో పాల్గొనాలని, ఎన్నికల సంఘాన్ని జవాబుదారీ చేసేందుకు, ఎలాంటి రహస్యాలు లేకుండా బాహాటత్వ విధానాలు పాటించేందుకు వీలుగా, ఓటు చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లాలని సీపీఐ ఈ సందర్భంగా పిలుపునిచ్చింది.