Skip to content
జాతీయం › వార్తలు

Nagpur MLC Election Result 2026: ఫడ్నవీస్, ఆర్ఎస్ఎస్ అడ్డాలో కాంగ్రెస్ సంచలనం.. నాగ్‌పూర్ ఎమ్మెల్సీ సీటు కైవసం..

jagan 29 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Nagpur MLC Election Result 2026: ఫడ్నవీస్, ఆర్ఎస్ఎస్ అడ్డాలో కాంగ్రెస్ సంచలనం.. నాగ్‌పూర్ ఎమ్మెల్సీ సీటు కైవసం..

Nagpur MLC Election Result 2026

Nagpur MLC Election Result 2026: మహారాష్ట్ర శాసన మండలి (MLC) ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని అధికార ‘మహాయుతి’ కూటమికి ఊహించని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష ‘మహా వికాస్ అఘాడీ’ (MVA) కూటమి మూడు స్థానాలను దక్కించుకుని ఆధిక్యం ప్రదర్శించగా, అధికార కూటమి కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతం, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సొంత హోమ్ గ్రౌండ్ అయిన నాగ్‌పూర్ నియోజకవర్గంలోనే బీజేపీ ఘోర పరాజయం పాలవ్వడం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన నాగ్‌పూర్ పట్టభద్రుల (నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిజిత్ వంజారి అద్భుత విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోహ్లేపై 3,271 ఓట్ల వ్యత్యాసంతో అభిజిత్ గెలుపొందారు. దాదాపు 40 గంటలకు పైగా సాగిన సుదీర్ఘ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం గురువారం అధికారికంగా ఈ తుది ఫలితాన్ని వెల్లడించారు. బీజేపీకి దశాబ్దాలుగా తిరుగులేని కోటగా ఉంటూ వస్తున్న నాగ్‌పూర్‌లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ , కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలు స్వయంగా ప్రచారం నిర్వహించినప్పటికీ, బీజేపీ పరాజయాన్ని మూటగట్టుకోక తప్పలేదు.

ఈ ఎన్నికల తుది ఫలితాల వెల్లడికి ముందు బుధవారం రోజున విడుదలైన ఇతర 12 స్థానాల ఫలితాల్లో కాంగ్రెస్ బోణీ కొట్టకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈవీఎంలలో అక్రమాలు జరుగుతున్నాయని, బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే పోలింగ్ జరగాలని పదేపదే డిమాండ్ చేసే కాంగ్రెస్.. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలకు గాను ఒక్క చోట కూడా గెలవలేకపోయిందని సెటైరికల్ పోస్ట్ చేశారు. అయితే నాగ్‌పూర్ లో విజయం తర్వాత కాంగ్రెస్ నాయకులు ప్రధాని వ్యాఖ్యలకు అంతే ఘాటుగా ఎదురుదాడి చేశారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి , కీలక కేంద్ర మంత్రుల సొంత నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిపోవడం ఆ పార్టీ పతనానికి ప్రారంభ సంకేతమని, 2029 సాధారణ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గద్దె దించడం ఖాయమని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది.