Skip to content
తెలంగాణ › వార్తలు

Rail Nilayam Protest: రైల్ నిలయం వద్ద తెలంగాణ కాంగ్రెస్ మెరుపు ధర్నా.. ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఇవ్వాలని డిమాండ్..

jagan 28 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Rail Nilayam Protest: రైల్ నిలయం వద్ద తెలంగాణ కాంగ్రెస్ మెరుపు ధర్నా.. ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఇవ్వాలని డిమాండ్..

Rail Nilayam Protest

Rail Nilayam Protest: సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయమైన రైల్వే నిలయం వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఆధ్వర్యంలో పార్టీ కీలక నేతలు, ప్రజాప్రతినిధులు రైల్వే నిలయం ముట్టడికి యత్నించి హఠాత్తుగా మెరుపు ధర్నాకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు శాసనసభ్యులు (MLAs) , కాంగ్రెస్ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైల్వే నిలయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మెట్లపై బైఠాయించిన నేతలు, రైల్వే శాఖ , కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.

ఈ ఉద్రిక్తతకు ప్రధాన కారణం నవంబర్ 1వ తేదీన ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి తెలంగాణ నుంచి కార్యకర్తలు, నాయకులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను (Special Trains) కేటాయించాలని టీపీసీసీ.. దక్షిణాది రైల్వే అధికారులను కోరింది. అయితే సాంకేతిక కారణాలు , రైళ్ల లభ్యత లేదనే నెపంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తమ విజ్ఞప్తిని నిరాకరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు, రైల్వే శాఖ జనరల్ మేనేజర్ (GM) కార్యాలయాన్ని ముట్టడించి మెరుపు ధర్నా నిర్వహించారు.

సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పరిసర ప్రాంతాలకు భారీగా చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులకు , పోలీసులకు మధ్య తీవ్ర నెట్టివేత, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. పరిస్థితి చేయిదాటకుండా చూసేందుకు పోలీసులు ఆందోళనలో ఉన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ వాహనాల్లోకి తరలించారు. అరెస్టయిన నేతలందరినీ మల్కాజిగిరి పోలీస్ జోన్ పరిధిలోని మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, అక్కడ కూడా కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకోవడంతో వాతావరణం వేడెక్కింది.