హెగ్సెత్‌పై అమెరికా కాంగ్రెస్‌లో అభిశంసన తీర్మానం
అమెరికాలో డెమొక్రటిక్ సోషలిస్టులకు ఆదరణ
ఇది దేశభక్తి కాదు.. దేశద్రోహం: హెగ్సెత్ తీవ్ర వ్యాఖ్యలు
ఇరాన్ యుద్ధం, వెనిజులా అధ్యక్ష దంపతుల కిడ్నాప్ సహా ఎనిమిది అభియోగాలు.. సొంత పార్టీ రిపబ్లికన్ ప్రతినిధి నుంచే వ్యతిరేకత
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్కు వ్యతిరేకంగా ఆ దేశ కాంగ్రెస్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. ఇరాన్ యుద్ధం, వెనిజులా అధ్యక్ష దంపతుల అపహరణ, యెమెన్‌లో సైనిక కార్యకలాపాలు సహా మొత్తం ఎనిమిది అభియోగాలతో రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధి థామస్ మాస్సీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై స్పందించిన హెగ్సెత్.. ఇది దేశభక్తి కాదని, దేశద్రోహమని విమర్శించారు.
పెంటగాన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనపై కాంగ్రెస్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టారు. మరోవైపు థామస్ మాస్సీ మాత్రం హెగ్సెత్‌పై ఉన్న ఎనిమిది అభియోగాలను ప్రతినిధుల సభలో వివరించారు. మాస్సీ రిపబ్లికన్ పార్టీ తరఫున కెంటకీ రాష్ట్రంలోని నాలుగో కాంగ్రెస్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
హెగ్సెత్ చర్యలను తీవ్రమైన నేరాలు, దుష్ప్రవర్తనగా పరిగణించాలని ఆయన తన తీర్మానంలో పేర్కొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందనడానికి ఈ పరిణామం నిదర్శనమని ఈ వార్తను ప్రచురించిన ఇరాన్ పత్రిక వ్యాఖ్యానించింది.
34 పేజీల తీర్మానంలో ఎనిమిది అభియోగాలు
మొత్తం 34 పేజీలతో రూపొందించిన ఈ తీర్మానాన్ని థామస్ మాస్సీ ప్రతినిధుల సభకు సమర్పించారు. ఇరాన్ యుద్ధం, వెనిజులా, యెమెన్‌లో హెగ్సెత్ పోషించిన పాత్రను అందులో వివరించారు. కాంగ్రెస్ అనుమతి లేకుండానే యుద్ధ చర్యలకు దిగారని ఒక అభియోగంలో ఆరోపించారు. పౌరుల ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన చట్టపరమైన నిబంధనలను కూడా హెగ్సెత్ ఉల్లంఘించారని మరో అభియోగంలో పేర్కొన్నారు.
మినాబ్ పాఠశాలపై దాడి ప్రస్తావన
ఇరాన్‌లోని మినాబ్ పాఠశాలపై జరిగిన బాంబు దాడిని కూడా తీర్మానంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ దాడిలో 164 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు మరణించినట్లు పేర్కొన్నారు. మినాబ్పై జరిగిన దాడిలో 120 మంది విద్యార్థులు, 26 మంది ఉపాధ్యాయులు, ఏడుగురు తల్లిదండ్రులు, ఒక బస్సు డ్రైవర్, ఒక ఫార్మసిస్ట్తో పాటు ఇతర పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు.
ఈ ఘటన ద్వారా మానవ హక్కులు ఉల్లంఘించబడ్డాయని తీర్మానంలో ఆరోపించారు. ఈ దాడిని యుద్ధరంగంలో జరిగిన పొరపాటుగా లేదా లక్ష్యాలను గుర్తించడంలో తలెత్తిన గందరగోళంగా కొట్టిపారేయలేమని పేర్కొన్నారు.
కరీబియన్ సముద్రంలో పడవలపై దాడులు
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే పేరుతో కరీబియన్ సముద్ర జలాల్లో పడవలపై అక్రమ దాడులకు పాల్పడ్డారని మరో అభియోగంలో ఆరోపించారు. ఈ దాడుల్లో పలువురు అమాయకులు కాల్పులకు బలయ్యారని తీర్మానంలో పేర్కొన్నారు.
వెనిజులా అధ్యక్ష దంపతుల అపహరణపై ఆరోపణలు
వెనిజులా అధ్యక్ష భవనంపై అర్ధరాత్రి దాడి చేసి, పలువురు భద్రతా సిబ్బందిని హతమార్చారని తీర్మానంలో ఆరోపించారు. ఈ ఏడాది జనవరి మొదటివారంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అపహరించి అమెరికాకు తరలించారని పేర్కొన్నారు. అనంతరం వారిని విచారణ నిమిత్తం జైలుకు తరలించిన వ్యవహారంలో హెగ్సెత్ పాత్రను కూడా ప్రశ్నించారు.
మార్క్ కెల్లీ వ్యవహారంపైనా విమర్శలు
చట్టవిరుద్ధమైన ఆదేశాలను సైనికులు పాటించవద్దని చట్టసభ సభ్యుడు మార్క్ కెల్లీ చేసిన విజ్ఞప్తిపై హెగ్సెత్ అనుసరించిన వైఖరిని కూడా ప్రతిపాదిత తీర్మానం తప్పుబట్టింది. సైనికులకు చట్టవిరుద్ధమైన ఆదేశాలను పాటించవద్దని సూచించినందుకు కెల్లీ పట్ల వ్యవహరించిన తీరును అభిశంసన తీర్మానంలో మరో అంశంగా ప్రస్తావించారు.