Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

Diabetes Alert: ప్రపంచ మధుమేహ దినోత్సవం.. భారత్‌లో 3.86 కోట్ల మందికి తెలియకుండానే డయాబెటిస్.. అంతర్జాతీయ సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు

jagan 11 Nov 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Diabetes Alert: ప్రపంచ మధుమేహ దినోత్సవం.. భారత్‌లో 3.86 కోట్ల మందికి తెలియకుండానే డయాబెటిస్.. అంతర్జాతీయ సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు

High Blood Sugar

Diabetes Alert: నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని (World Diabetes Day) పురస్కరించుకుని విడుదలైన ఒక కీలక అంతర్జాతీయ సర్వే భారతదేశంలో ఆరోగ్య రంగం ఎదుర్కొంటున్న ముప్పును కళ్లకు కట్టింది. దేశంలో సుమారు 3.86 కోట్ల మంది పెద్దలు మధుమేహంతో జీవిస్తున్నప్పటికీ, ఆ విషయం వారికి ఏమాత్రం తెలియదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. భారత్‌తో పాటు మరో ఆరు దేశాల్లో నిర్వహించిన ఈ సర్వే, ప్రజల్లో ఉన్న అవగాహనకు, వాస్తవ ఆచరణకు మధ్య ఉన్న భారీ అంతరాన్ని ఎత్తిచూపింది.

దేశంలోని మొత్తం మధుమేహ బాధితుల్లో ఏకంగా 43 శాతం మంది ఇప్పటివరకు ఎలాంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోకపోవడం గమనార్హం. దీనివల్ల ప్రస్తుతం దేశంలో డయాబెటిస్ నిర్ధారణ రేటు కేవలం 57 శాతంగానే నమోదవుతూ, ప్రపంచ ఆరోగ్య లక్షణాల కంటే వెనుకబడి ఉంది.

సర్వేలో వెల్లడైన ముఖ్యాంశాలు:

అవగాహన లోపం: భారత్‌లో 502 మందిపై నిర్వహించిన సర్వేలో 84 శాతం మంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ముందస్తు పరీక్షలు చేయించుకోవడం మంచిదని అంగీకరించారు. అయితే, కేవలం 14 శాతం మంది మాత్రమే వ్యక్తిగతంగా తమకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ ఉందని భావించారు.
ప్రీ-డయాబెటిస్‌పై అపోహలు: రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి, పూర్తి డయాబెటిస్ స్థాయికి చేరని ఈ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయని 75 శాతం మంది తప్పుగా నమ్ముతున్నారు. సర్వే జరిగిన ఆరు దేశాల్లో భారత్‌లోనే ఈ అపోహ అత్యధికంగా ఉంది.
పరీక్షలకు వెనుకంజ: సొంతంగా ముందస్తు పరీక్షలు ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియక దాదాపు 48 శాతం మంది వెనుకంజ వేస్తున్నట్లు సర్వే తెలిపింది. జబ్బు గురించిన భయం, మార్గదర్శకత్వం కొరవడటం ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి.

టైప్ 2 డయాబెటిస్ అనేది శరీరంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా నిశ్శబ్దంగా విస్తరించే సమస్య. రక్తంలో చక్కెర స్థాయిలు నెలలు లేదా ఏళ్ల తరబడి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు బయటపడవు. స్వల్ప అలసట లేదా చూపు మందగించడం వంటి సూచనలు కనిపించినా.. చాలామంది వాటిని పని ఒత్తిడి లేదా స్క్రీన్ టైమ్ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. విపరీతమైన దాహం, తరచూ మూత్రవిసర్జన వంటి సాంప్రదాయ లక్షణాలు కనిపించే వరకు వేచి చూస్తే చికిత్స మరింత ఆలస్యమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కుటుంబంలో షుగర్ వ్యాధి చరిత్ర ఉండటం, శారీరక శ్రమ లోపించడం, ఊబకాయం, అధిక రక్తపోటు (బీపీ) వంటి లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. కేవలం వ్యాధి గురించి తెలుసుకోవడమే కాకుండా, ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ముప్పును గుర్తించి, క్రమం తప్పకుండా ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవడమే దీర్ఘకాలిక ఆరోగ్యానికి సరైన మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.