Rajiv Gandhi’s Political Entry: రాజీవ్ గాంధీ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకించిన సోనియా.. రాహుల్ విషయంలో ఎందుకు అలా చేయలేదు..
Rahul Gandhi and sonia
Rajiv Gandhi’s Political Entry: తన భర్త రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని, ఆయన ఆ రంగంలోకి అడుగుపెట్టవద్దని దశాబ్దాల క్రితం వేడుకున్నానని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ వెల్లడించారు. భర్త రాజకీయ ప్రవేశం వల్ల కుటుంబం ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వస్తుందని ఆనాడు తీవ్రంగా ఆందోళన చెందినట్లు తెలిపారు.
అయితే, తన కుమారుడు రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రం తాను ఎలాంటి అడ్డంకులు చెప్పలేదని స్పష్టం చేశారు. తన జీవిత ప్రయాణాన్ని వివరిస్తూ రాసిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) అనే పుస్తకంలో ఈ ముఖ్యాంశాలను ప్రస్తావించారు. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
రాహుల్ గాంధీకి చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి ఉండేదని సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. ప్రాణముప్పు ఉందని తెలిసినప్పటికీ రాజీవ్ గాంధీ అత్యంత ధైర్యంగా రాజకీయాల్లో కొనసాగిన తీరును రాహుల్ ఎంతో గౌరవించేవారని తెలిపారు. తండ్రి రాజకీయ నిర్ణయాలపై రాహుల్ విభేదించిన సందర్భాలు ఉన్నప్పటికీ, రాజీవ్ ఆశయాలు, విలువలు, ధైర్యం పట్ల ఆయనకు నిండైన గౌరవం ఉండేదన్నారు.
ఇక ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు విడదీయలేని అనుబంధం ఉందని పేర్కొన్నారు. చిన్నతనంలోనే రాజీవ్ తన పిల్లలను అమేథీకి తీసుకెళ్లి గ్రామీణ ప్రాంతాల వాస్తవ పరిస్థితులను పరిచయం చేశారని, ప్రియాంక కూడా ప్రతి ఎన్నికల సమయంలో అమేథీలోనే ఉండి పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేవారని వివరించారు. ఆ సమయంలో ప్రియాంక తన పిల్లల పెంపకంతో పాటు బౌద్ధ అధ్యయనాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరించినట్లు చెప్పారు.
రాహుల్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ‘డెవలప్‌మెంట్ స్టడీస్’ విభాగంలో ఎంఫిల్ పూర్తి చేశారని, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలోనూ భారతదేశ రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించేవారని సోనియా వెల్లడించారు. రాహుల్ విదేశాల నుంచి వచ్చినప్పుడల్లా తమతో కలిసి అమేథీలో పర్యటించేవారని, ఆ పర్యటనల ద్వారానే ప్రజలకు సేవ చేయాలనే బలమైన ఆలోచన ఆయనలో పెరిగిందన్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు కోరిన వేళ, ప్రజా జీవితంలోకి అడుగుపెడితే ఎదురయ్యే విమర్శలు, నిరంతర పరిశీలనల గురించి రాహుల్‌కు పూర్తి స్పష్టత ఉందన్నారు. తనతో, ప్రియాంకతో సమగ్రంగా చర్చించిన అనంతరమే ఆయన రాజకీయ అరంగేట్రానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
చివరకు 2004 మార్చిలో రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా, తాను పక్కనే ఉన్న రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగినట్లు సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. తొలి ఎన్నికల్లోనే రాహుల్ భారీ మెజార్టీతో విజయం సాధించారని, ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజీవ్ గాంధీ బాటలోనే గ్రామీణ అమేథీలో పరిశ్రమలు, వ్యాపార సంస్థల ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేశారని సోనియా గాంధీ తన పుస్తకంలో పేర్కొన్నారు.